చలికి గజగజ...

18 Dec, 2018 13:28 IST|Sakshi
గుంటూరులోని ఓ వసతి గృహంలో కిటికీలకు తలుపులు లేక ఫ్లెక్సీలు అడ్డుపెట్టుకున్న విద్యార్థులు

వర్షం వస్తే జిల్లా ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల అవస్థలు

చలికి వణుకుతూ దోమ కాట్లకు బలవ్వాల్సిందే

పలుచోట్ల అధ్వానంగా మరుగుదొడ్లు

కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం

క్షేత్రస్థాయిలో హాస్టళ్ల నిర్వహణలో కొరవడిన చిత్తశుద్ధి

ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల సంక్షేమం కోసం కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఉంటాయి. వాస్తవానికి ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లిపోతున్నాయో
ఆ పై వాడికే ఎరుక. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వ హాస్టళ్లలోఉండే విద్యార్థులు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.

సాక్షి, గుంటూరు: ప్రభుత్వ వసతి గృహాలు ఎక్కడ చూసినా విరిగిన తలుపులు, రెక్కలు లేని కిటికీలు వెక్కిరిస్తుంటాయి. శీతాకాలంలో విద్యార్థులు చలికి గజగజ వణుకుతూ ముడుచుకు పడుకోవాల్సిందే. ఓ పక్క తుపాను వచ్చి ఎన్నడూ లేని విధంగా భయంకరంగా చలిగాలులు వేస్తుంటే ప్రభుత్వం ఇంతవరకు వసతిగృహాల్లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయలేదు. కొన్నిచోట్ల సరఫరా చేసినా నాణ్యత లేని వైనం, మరికొన్ని చోట్లా విద్యార్థులందరికీ సరిపడా దుప్పట్లు సరఫరా చేయని పరిస్థితి.   

జిల్లాలో  76 ఎస్సీ, 88 బీసీ, 33 ఎస్టీ వసతి గృహాలు ఉన్నాయి. అయితే వీటిలో చాలావరకూ వసతి గృహాలకు సరైన భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా పాలకులు, అ«ధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలోని వేమూరు, వినుకొండ, గుంటూరు ఈస్ట్, వెస్ట్, తెనాలి, రేపల్లె సహా వివిధ నియోజకవర్గాల్లోని వసతి గృహాలు పశువులు ఉండే బందులదొడ్లను తలపిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  పలుమార్లు అధికారులు, అమాత్యుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి మార్పు లేదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

చలికి వణకాల్సిందే...
వాతావరణంలో వస్తున్న మార్పులతో రోజురోజుకు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీనికి తోడు గత రెండు రోజులుగా పెథాయ్‌ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో వసతి గృహాల్లో విద్యార్థుల పరిస్థితి దైన్యంగా మారింది. వసతి గృహాల్లో గదులకు సరిగా తలుపులు, కిటికీలు లేకపోవడంతో చలికి గజగజ వణుకుతూ కిటికీలకు దుస్తులను అడ్డం పెట్టుకుని గడపాల్సివస్తోంది. డిసెంబర్‌ నెల సగం దాటినా నేటికి జిల్లా వ్యాప్తంగా వసతి గృహాల్లో పూర్తి స్థాయిలో దుప్పట్లు పంపిణీ కాలేదని తెలుస్తోంది.

మరుగుదొడ్లు అంతంత మాత్రమే...
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మరుగుదొడ్ల సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో 100–150 వరకు విద్యార్థులు ఉన్న వసతి గృహాల్లో ఒకటి రెండు మరుగుదొడ్లు ఉంటే, మరికొన్ని చోట్ల మరుగుదొడ్ల ఉన్నా సరైన నిర్వహణకు నోచుకోని దుస్థితి. దీంతో విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. బాలికల వసతి గృహాల్లో సైతం ఇదే పరిస్థితులు నెలకొనడంతో ఆరుబయటకు కాలకృత్యాలకు వెళ్లడానికి విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాధారణ రోజుల్లో ఎలాగోలా ఉన్నా వర్షాలు పడిన రోజు మాత్రం మరుగుదొడ్లు లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు జిల్లాలోని పలు బాలికల వసతి గృహాల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.  చాలావరకు ప్రభుత్వ బాలికల సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల వద్ద నైట్‌ డ్యూటీవాచ్‌మెన్‌లు లేకుండానే నిర్వహిస్తున్నారు.   

విజిలెన్స్‌ తనిఖీలు చేసినా అంతే...
జిల్లాలోని వసతి గృహాల్లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించినా వసతి గృహాల నిర్వహణలో మాత్రం మార్పు రావడం లేదు. గతంలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి గురుకులాల్లో సిబ్బంది కొరత ఉన్నట్టు గుర్తించామని అధికారులు చెప్పారు. కనీస సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వానికి నివేదికలు సైతం పంపారు. అయినా నేటికీ ప్రభుత్వ హాస్టళ్లలో మాత్రం మార్పు రాకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.

విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి
ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్ఞానభేరి సభలు అంటూ కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్న ప్రభుత్వ పెద్దలు విద్యార్థులకు సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. జిల్లాలో వసతి గృహాల దుస్థితి, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై పలుమార్లు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతులు ఇచ్చాం అయినా ఎటువంటి మార్పు లేదు. ఇప్పటికైనా నేతలు, అధికారులు స్పందించి సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస అవసరాలు కల్పించాలి.–భగవాన్‌దాస్,ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు

మరిన్ని వార్తలు