హాస్టల్‌ బస ఎక్కడ?

18 Jan, 2019 08:27 IST|Sakshi
ఇరుకు గదుల్లో భోజనాలు చేస్తున్న విద్యార్థినులు (ఫైల్‌)

వసతిగృహాల్లో పేరుకుపోతున్న సమస్యలు

కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్న విద్యార్థులు

పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం

శ్రీకాకుళం, సీతంపేట/పాలకొండ రూరల్‌: సంక్షేమ వసతిగృహాల్లో తాగునీరు, మెనూ అమలుతీరు, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్యం వంటి సమస్యల గుర్తించి, వాటి పరిష్కారానికి గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు రాత్రి బస చేపట్టేవారు. అయితే ఇప్పుడా తరహా రాత్రి బస కార్యక్రమం ఎక్కడా కానరావడం లేదు. ఫలితంగా చాలా వసతిగృహాల్లో సమస్యలు తిష్ట వేసి ఉన్నాయి. వీటిని పట్టించుకునే నాథుడే లేడని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్నా ఈ సమస్యలు పరిష్కారం కాలేదని వాపోతున్నారు.

ఇదీ పరిస్థితి...
పాలకొండ సబ్‌ డివిజన్‌లోని మూడు నియోజకవర్గాలకుగాను రెండు నియోజకవర్గాలు ఏజెన్సీ ప్రాంతాన్ని కలుపుకుని ఉన్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు 18, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 18, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 18, ఎస్సీ, బీసీ, పోస్టుమెట్రిక్‌ వసతిగృహాల్లో విద్యార్థులు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారు. వీటితోపాటు సీతంపేట ఏజెన్సీలో 10 వరకు ఆశ్రమ పాఠశాలల వసతి గృహాలున్నాయి. వీటిలో 15 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇరుకు గదుల్లోనే తరగతులు నిర్వహించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వసతిగృహాల్లో సరిపడినన్నీ మరుగుదొడ్లు, సురక్షిత నీటి సౌకర్యం వంటివి పూర్తిగా లేవు. నిత్యావసరాలకు నీటివసతి అరకొరగా ఉంది. కొన్నిచోట్ల తరగతులు, విద్యార్థులు ఉండటం అక్కడే అన్న చందంగా నిర్వహిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలికవసతుల పేరిట భారీగా నిధులు వెచ్చించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. కేజీ నుంచి పీజీ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత విద్యనందించి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్న టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం
సౌకర్యాల కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చాలాచోట్ల కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నారు. అయినా పట్టించుకున్న నాథుడు లేడు. ముఖ్యంగా విద్యార్థులు ఉండటానికి సరైన వసతి లేకపోవడంతో కొంతమంది డ్రాపౌట్‌గా మారుతున్నారు. రాత్రి బస వంటివి చేసి పక్కాగా సమస్యలు పట్టించుకోవాలి.– విశ్వాసరాయి కళావతి,పాలకొండ, ఎమ్మెల్యే

పర్యవేక్షణ లేక కుంటుపడుతున్న విద్య
అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటే మంచిది. గతంలో ఎస్‌ఎఫ్‌ఐ తరుపున చాలా వసతిగృహాలను సందర్శించాం. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మౌలిక వసతుల పేరిట గిరిజన ప్రాంతాల్లో భారీగా నిధులు వెచ్చిస్తున్నప్పటికీ అవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియడం లేదు.– ఎం కనకారావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు

మరిన్ని వార్తలు