పేదవాళ్లైతే పరిస్థితేంటి ?

6 Jul, 2020 10:05 IST|Sakshi
ప్రైవేటు ఆస్పత్రిలో కాన్పు అనంతరం బెడ్‌పై తల్లీబిడ్డ

కొలమాసనపల్లి పీహెచ్‌సీ వైద్యుల తీరుపై ఆగ్రహం

ప్రైవేటు ఆస్పత్రిలో రూ.లక్ష ఖర్చు పెట్టి కాన్పు చేయించిన హాస్టల్‌ వార్డెన్‌

పలమనేరు: ‘నేను ప్రభుత్వ ఉద్యోగి గనుక ఎలాగో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటా.. ఇదే పరిస్థితుల్లో పేదవాళ్లెవరైనా ప్రభుత్వాస్పత్రి మీద నమ్మకంతో వస్తే వారి పరిస్థితేంటి ?’ అని పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి హాస్టల్‌ వార్డెన్‌ మధుసూధన్‌రెడ్డి స్థానిక ఏరియా ఆస్పత్రి వైద్యుల తీరుపై స్పందించిన తీరు. శనివారం ఉదయం పలమనేరులో ఉంటున్న మధుసూదన్‌రెడ్డి భార్య నేత్రకు ప్రసవనొప్పులు రావడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరిశీలించిన వైద్యులు తొలికాన్పు సిజేరియన్‌ కావడంతో రెండోకాన్పు ఆపరేషన్‌ చేయాల్సిందేనని చెప్పారు. అందుకు అతను సరే అన్నాడు. అయితే ఆపరేషన్‌ చేసేందుకు తమవద్ద రక్తం లేదని చెప్పారు.

అప్పటికే నొప్పులు ఎక్కువ కావడంతో చేసేదిలేక అతను తన భార్యను హుటాహుటిన హొసకోటలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌హోంకు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు సిజేరియన్‌ చేశారు. అందుకుగానూ రూ.లక్ష దాకా ఖర్చు అయినట్లు బాధితుడు మధుసూదన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి మరో పేదవాడికి రాకుండా చూడాలని ఆయన మీడియాకు తెలిపారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వీణాకుమారిని సాక్షి వివరణ కోరగా వాళ్లు ఆస్పత్రికి రాగానే కరోనా టెస్ట్‌ చేయాలన్నారని, దీంతో కాదన్నామని తెలిపారు. తమ ఆస్పత్రిలో రక్తం లేదని అందుకే డ్యూటీ డాక్టర్‌ చిత్తూరుకు రెఫర్‌ చేశారన్నారు. ప్రసవ నొప్పులతో ఈ ఆస్పత్రికి వచ్చేవారికి రెఫర్లు మాత్రం తప్పడం లేదు. డీసీహెచ్‌ఎస్, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ సైతం ఈ విషయమై ఇక్కడి వైద్యులను పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకుండా పోతోంది.

మరిన్ని వార్తలు