సంక్షేమ హాస్టళ్లలో.. సమస్యల ముళ్లు

18 Jun, 2015 02:14 IST|Sakshi

హాస్టళ్ల విద్యార్థులను పీడించిన పాత సమస్యలు విరగడ కాకుండానే కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. ఊడిన మరుగుదొడ్ల తలుపులు అలాగే ఉన్నారుు. దుస్తులు, వస్తువులను తుప్పురేకుల పెట్టెల్లోనో, నేలపైనో ఉంచాల్సిన దుస్థితి కొనసాగుతూనే ఉంది. కష్టాలు తిష్ట వేసిన అద్దె భవనాల  నుంచి విముక్తీ సుదూరమే. మరో వైపు హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం అందుకు తగ్గట్టు నిధులు పెంచడానికి సిద్ధంగా లేదు.
 
 పిఠాపురం : జిల్లాలో పదవతరగతి లోపు ఎస్సీ, బీసీ, ఎస్టీ విద్యార్థినీ విద్యార్థులు ఉండే వసతి గృహాలు (హాస్టళ్లు) 61 ఉండగా ఆ వర్గాల కాలేజీ విద్యార్థులుండే వసతిగృహాలు 38. వీటిలో సుమారు 9,400 మంది వసతి పొందుతున్నారు. 80 శాతానికి పైగా వసతిగృహాలలో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా బాలికల వసతిగృహాలలో  మరుగుదొడ్లు లేక వారు పడుతున్న తిప్పలు.. గొప్పలు చెప్పుకొనే సర్కారు తలదించుకోవలసినవేనని చెప్పక తప్పదు. ఇక ఇచ్చే ఆహారంలో పోషక విలువలు లేక పలువురు విద్యార్థులు రక్తహీనత వంటి రోగాల  బారిన పడుతున్నారు. ఒక్కో విద్యార్థికీ రోజూ 2,600 కిలో కేలరీల శక్తి గల ఆహారపదార్థాలు అందించాల్సి ఉండగా ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం కేవలం 1,500 కిలో కేలరీల శక్తినిచ్చే పదార్థాలు మాత్రమే అందుతున్నారుు.
 
 ఏరీ ఏఎన్‌ఎంలు?
 ప్రతి వసతిగృహంలో ఒక ఏఎన్‌ఎంను నియమించాల్సి ఉండగా ఏ ఒక్క దానిలో నూ వారు అందుబాటులో లేరు. దాంతో ఆ రోగ్య పరీక్షలు జరగక విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆరోగ్య ప రీక్షల నిమిత్తం ఒక్కో హాస్టల్‌కు నెలకు రూ. 1,000 కేటాయించాల్సి ఉన్నా ప్రభుత్వం వాటి ఊసెత్తడం లేదు. అనేక వసతిగృహా ల్లో ట్యూటర్ లేక పాఠ్యాంశాల్లోని సందేహాల్ని నివృత్తి చేసుకోలేకపోతున్నారు. పలు హాస్టళ్ల ప్రాంగణాల్లో లైట్లు వెలగక విద్యార్థులు చీకటిలోనే సంచరిస్తున్నారు. పలుచోట్ల హ్యేండ్ పంపులు రిపేరు వచ్చి ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులు జరగడం లేదు. ఇక మన్యంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. ఐరన్ లోపంతో పలువురు విద్యార్థులు మృత్యువాత పడుతున్నట్లు చెబుతున్నారు. నీటిశుద్ధి యంత్రాలు దాదాపు అన్నీ మూలనపడ్డారుు.
 
 చెప్పులూ అందలేదు..
 సుమారు ఆరేళ్లుగా విద్యార్థులకు పెట్టెలు ఇవ్వక పోవడంతో తుప్పు పట్టిన పెట్టెల్లోనో, నేలపైనో ఉంచుకోవాల్సి వస్తోంది. కాస్మోటిక్స్ చార్జీలు సకాలంలో అందవు. పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకోకుండా తక్కువ ధరలున్నప్పటి చార్జీలనే ఇవ్వడం వల్ల విద్యార్థులు చాలీచాలని సరుకులతో కాలం గడపాల్సి వస్తోంది. ఏడాదికోసారి పంపిణీ చేయాల్సిన చెప్పులు, బ్యాగులు,  దుప్పట్లు, నోట్ పుస్తకాలు, కార్పెట్లు గత ఏడాది పూర్తిస్థాయిలో అందలేదు. జిల్లాలో 45 వరకు వసతిగృహాలు అద్దె భవనాలలోనే ఉన్నాయి, ఇవి కూడా శిథిలావస్థలో సమస్యలకు నెలవులుగా ఉన్నాయి. చాలీచాలని ఇరుకు గదులో మగ్గుతూనే విద్యార్థులు ఏడాదంతా గడుపుతున్నారు.
 
 సౌకర్యాల మెరుగుకు చర్యలు : డీడీ
 హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగు పర్చడానికి చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఎం.చినబాబు చెప్పారు. రామచంద్రపురం, కాకినాడ, రంపచోడవరంలలో సొంత భవనాలను నిర్మించామని, మిగిలిన చోట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెట్టెలు గత ఆరేళ్ల నుంచి ఇవ్వలేదని, ప్రస్తుతం ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు