అడుగడుగునా...ఉక్కుపాదం

27 Jul, 2017 03:31 IST|Sakshi
అడుగడుగునా...ఉక్కుపాదం

గృహ నిర్బంధంలో ముద్రగడ
పోలీసుల ఆధీనంలో కిర్లంపూడి
అష్ట దిగ్బంధంలో జిల్లా
69 చెక్‌ పోస్టులు, 112 పికెట్లు
కాపు నేతల హౌస్‌ అరెస్టులు
రోడ్లపైకి వచ్చిన కాపుల అణిచివేత
ప్రముఖల విగ్రహాలకు పాలాభిషేకాలు, వినతి పత్రాలతో నిరసనలు
♦  కాలినడకన కిర్లంపూడికి చేరుకున్న 24 గ్రామాల కాపులు
ముద్రగడకు మద్దతుగా ... చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు


సాక్షి, రాజమహేంద్రవరం:  కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ‘చలో అమరావతి’ పేరుతో బుధవారం నుంచి చేపట్టిన నిరవధిక పాదయాత్రపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9:10 గంటలకు ముద్రగడ ఇంటి నుంచి బయలుదేరారు. ఇంటి గేటు వద్ద పోలీసులు పాదయాత్రకు అనుమతి లేదని అడ్డుకున్నారు. 20 నిమిషాల వాదోపవాదాలు జరిగిన తర్వాత కూడా అనుమతి లేదని పోలీసులు చెబుతూ శాంతిభద్రతల దృష్ట్యా ముద్రగడకు సీఆర్‌పీసీ సెక‌్షన్‌ 151 ప్రకారం నోటీసులు జారీచేసి 24 గంటలపాటు గృహ నిర్బంధంలో ఉంచారు.

 ఉదయం 5:30 గంటలకే ర్యాపిడ్‌ యాక‌్షన్‌ ఫోర్సు, ప్రత్యేక దళాలు, పోలీసులను ముద్రగడ ఇంటి వద్ద మోహరించారు. ఇంటికి ఇరువైపులా చెక్‌పోస్టులు పెట్టి వాహనాలు, ప్రజల వివరాలపై ఆరాతీశారు. జగ్గంపేట, ప్రత్తిపాడు జాతీయ రహదారి పరిసరాలు, కిర్లంపూడి చుట్టు పక్కల గ్రామాల్లో దాదాపు 3500 మంది పోలీసులను మోహరించారు. జాతీయ రహదారిపై ఆర్టీసీతో సహా ప్రతి వాహనాన్నీ తనిఖీ చేసి కాపు సామాజిక వర్గీయులు ఉన్నారేమోనని ఆరా తీశారు. ఇతర జిల్లాల రిజిస్ట్రేషన్‌ ఉన్న కార్లు, ద్విచక్ర వాహనాలను జగ్గంపేట, ప్రత్తిపాడు జాతీయ రహదారి నుంచి కిర్లంపూడి వైపు రాకుండా నిలిపి వేశారు. కిర్లంపూడిపై డేగ కన్ను వేసిన పోలీసులు గ్రామానికి ఇరువైపుల ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టుల దగ్గర గుర్తింపు కార్డు చూపిస్తేనే కిర్లంపూడికి అనుమతిస్తున్నారు.

ఎక్కడికక్కడ అణిచి వేతలు...
ముద్రగడ పాదయాత్రకు మద్దతుగా బయలుదేరిన కాపు సామాజిక వర్గీయులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సెక‌్షన్‌ 30, 144 అమలులో ఉందంటూ చెల్లా చెదురు చేశారు. మరికొంత మందిని అరెస్ట్‌ చేశారు. 69 చెక్‌ పోస్టులు, 112 పికెట్లు ఏర్పాటు చేసి జిల్లాను అష్ట దిగ్బంధిచారు. కిర్లంపూడితో సహా జిల్లా వ్యాప్తంగా దాదాపు 7 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. కాపులని తెలిస్తే చాలు అరెస్టులు లేదా అడ్డుకోవడం చేశారు. కిర్లంపూడి సమీపంలోని రాజుపాలెం, తామరాడ, వేలంక, సోమవరం, సింహాద్రిపురం తదితర గ్రామాల్లోని కాపు సామాజిక వర్గ ప్రజలు ముద్రగడకు మద్దతుగా కిర్లంపూడి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. సింహాద్రిపురం గ్రామం మొత్తం భారీ పాదయాత్రతో వచ్చేందుకు రోడ్లపైకి రాగా సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బలగాలతో వారిని నిలువరించారు. ముమ్మిడివరం కాపు కల్యాణ మండపం నుంచి లంకతల్లమ్మ ఆలయం వరకు మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించిన కాపులను పోలీసులు అడ్డుకున్నారు. పి.గన్నవరంలో మామిడికుదురు మండలం మగటపల్లిలో జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నామన రాంబాబు ఇంటిని కాపులు ముట్టడించారు.

సుమారు 170 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పి.గన్నవరం బోడపాటివారిపాలెంలో ముద్రగడకు మద్దతుగా మహిళలు ఆందోళన చేశారు. ముద్రగడ పాదయాత్రకు ఆంక్షలు విధించడం సరికాదంటూ అంబాజీపేట నాలుగు రోడ్ల సెంటర్‌లో కాపు వర్గీయులు నల్ల బ్యాడ్జీలతో ఒక్కసారిగా రోడ్డెక్కి ముద్రగడ పాదయాత్రకు అడ్డు తొలగించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. కొత్తపేట పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన కాపునేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెద్దాపురంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. రాజానగరంలో పోలీస్‌ పికెట్‌లు ఏర్పాటు చేశారు. నాయకులు హౌస్‌ అరెస్టు చేశారు. రాజానగరం నియోజకవర్గం సీతానగరం నుంచి అధిక సంఖ్యలో కిర్లంపూడి తరలివెళ్లడానికి బైక్‌లపై కాపులు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం కడియం మండలం బురిలంక గ్రామంలో కాపు యువత ఆధ్వర్యంలో ముద్రగడ పాదయాత్రకు పోలీసులు అడ్డుతగిలన నేపథ్యంలో గాంధీజీ, నేతాజీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేసి వినతి పత్రాలు అందజేశారు. తునిలో బైక్‌ర్యాలీ నిర్వహించిన 20 మంది కాపు జేఏసీ నేతలను అరెస్ట్‌ చేశారు. పిఠాపురం, గొల్లప్రోలులో ముద్రగడకు మద్దతుగా ధర్నా చేసిన వారిని అరెస్ట్‌ చేశారు.

గృహ నిర్బంధంలో కాపు నేతలు...
ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో జిల్లాలోని పలువురు కాపు సంఘం నేతలు, వైఎస్సార్‌సీపీలోని కాపు సామాజిక వర్గ నేతలను పోలీసులు గృహ నిర్బంధించారు. రాజహేంద్రవరం నగరంలో వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం రూరల్‌ కోఆర్డినేటర్లుఆకుల వీర్రాజు, గిరిజాల వీర్రాజు (బాబు) ఆ పార్టీ గ్రేటర్‌ రాజమహేంద్రరం అధ్యక్షుడు కందుల దుర్గేష్‌లతో సహా 60 మంది కాపు నేతలను హౌస్‌ అరెస్ట్‌లు చేశారు. ముద్రగడకు అనుకూలంగా మాట్లాడిన కాపులను తునిలో అరెస్ట్‌ చేశారు.  వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, పిఠాపురం మున్సిపాలిటీ ఫ్లోర్‌లీడర్‌ గండేపల్లి బాబి, జిల్లా కార్యదర్శి మొగలి అయ్యారావు, కొత్తపల్లిలో ఆనాల సుదర్శన్‌ తదితర నాయకులను హౌస్‌ అరెస్టు చేశారు. అమలాపురంలో రాష్ట్ర కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, కోనసీమ టీబీకే అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, రాష్ట్ర కాపు జేఏసీ జాయింట్‌ కన్వీనర్‌ నల్లా పవన్‌కుమార్, నల్లా అజయ్, వైఎస్సార్‌ సీపీ నాయకులైన కాపు మహిళా జేఏసీ నాయకురాలు కొల్లాటి దుర్గాబాయిలను ఉదయం ఆరు గంటలకే పోలీసులుగృహ నిర్భంధాలు చేశారు. మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం, రాజానగరంలలో కాపు నేతలను హౌస్‌ అరెస్ట్‌లు చేశారు. కాకినాడలో జిల్లా  కాంగ్రెస్‌ అధ్యక్షుడు పంతం నానాజీని గొడారిగుంటలోని ఆయన నివాసంలో పోలీసులు నిర్బంధించారు. రంపచోడవరంలో ఎటపాక మండలం తోటపల్లిలో కాపు నాయకులపై పోలీసులు బైండోవర్‌ కేసులు నమోదు చేశారు.  

పోలీసుల కన్నుగప్పి... కాలినడకన..
పోలీసులు ఎక్కడిక్కడ చెక్‌ పోస్టులు, పికెట్‌లు పెట్టినా 24 గ్రామాల నుంచి దాదాపు 100 మంది కాపు సామాజిక వర్గీయులు వారి కన్నుగప్పి కిర్లంపూడి చేరుకున్నారు. వాహనాల్లో గుంపులుగా వస్తుంటే అడ్డుకుంటున్నారని తెలిసీ ఒక్కో గ్రామం నుంచి నాలుగురైదుగురు వేర్వేరుగా ప్రత్తిపాడు చేరుకున్నారు. అక్కడ నుంచి ధర్మవరం, రాచపల్లి, ఉత్తరకంచి, వొమ్మడి, బి.ప్రత్తిపాడు, చిన శంకలపూడి, పెద శంకలపూడి, లింగపర్తి, భద్రవరం, చిన్నింపేట, సిరిపురం, యర్రవరం, ఏలేశ్వరం, కాండ్రకోట, సిరివాడ, గోవాడ, గోరంట, రాగంపేట, పోతవరం, ఎస్‌.తిమ్మాపురం, తాటిపర్తి, సోమవరం, పిఠాపురం మండలం భోగాపురం, కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతాల నుంచి కిర్లంపూడి చేరుకున్నారు. ముద్రగడ ఇంటి సమీపంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై భైఠాయించారు. ముద్రగడకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇచ్చిన హామీని అమలు చేయకుండా, తమ సామాజికవర్గం పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. కాపుల సత్తా ఏమిటో త్వరలోనే తెలుస్తుందని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు