ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీ

19 Mar, 2020 11:15 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి

సుప్రీంకోర్టు ఎన్నికల కోడ్‌ ఎత్తివేయటం హర్షణీయం

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుకు మార్గం సుగమం

ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్‌సీపీదే విజయం  

ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరం: ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రాష్ట్ర వ్యాప్తంగా  అమలు చేయతలపెట్టిన  ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని విజయనగరం నియోజకవర్గంలో  ఈ నెల 25న ఉగాది రోజునే  చేయనున్నట్టు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. బుధవారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడారు.  స్థానిక సంస్థల ఎన్నికల  నేపథ్యంలో ఉగాది రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ జరగదని భావించినప్పటికీ  ఎన్నికలు వాయిదా నేపథ్యంలో సుప్రీం కోర్టు కోడ్‌ అమలును ఎత్తివేయాలంటూ తీర్పునివ్వటాన్ని స్వాగతిస్తున్నామన్నారు.  ఎన్నికల కోడ్‌ ఎత్తివేయటంతో  రాష్ట్రంలో జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి  పనులకు శంకుస్థాపనలకు అవకాశం ఉంటుందన్నారు. మరల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తమకు అభ్యంతరం లేదని, స్థానిక సంస్థల  ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు మిన్నగా అధిక స్థానాలు కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిలా కాకుండా లంచగొండితనానికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. నియోజకవర్గంలో రేపటి నుంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. నగరంలో మంచి నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టామని పలు ప్రాంతాల్లో  వేధిస్తున్న సమస్యలను  పరిష్కరించేందుకు  చర్యలు చేపడతామన్నారు. 

కుటిల రాజకీయాలకు కేరాఫ్‌ చంద్రబాబు
కుటిల రాజకీయాలకు  కేరాఫ్‌ అడ్రస్‌గా ప్రతిపక్ష నేత చంద్రబాబు నిలుస్తారని  ఎమ్మెల్యే కోలగట్ల ధ్వజమెత్తారు.  చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎప్పుడు వెన్నుపోట్లు పొడవటం, ప్రజలను మోసగించే ధోరణిలో నడుచుకుంటారన్నారు. ప్రజల ఆమోదంతో  ఏనాడూ గెలిచిన సందర్భాలు లేవన్నారు.  ఇప్పటికే రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో జత కట్టి ఎన్నికల్లో పని చేసిన చంద్రబాబు తీరును చూసి సొంత పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు ఆ పార్టీ అధినేతపై విశ్వాసం కోల్పోయి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారన్నారు. రానున్న కాలంలో టీడీపీకి పుట్టగతులుండవన్న విషయాన్ని  గుర్తించుకోవాలన్నారు. ప్రస్తుతం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను తన వ్యక్తిగత పరిచయాలు, సామాజిక వర్గాల పరిచయాలను అడ్డం పెట్టుకుని  వాయిదా వేయించటం  చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. చంద్రబాబు తన దుర్నీతితో ఎన్నికలు వాయిదా వేయించాగలిగారే తప్పా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోలేరన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై పూర్తి విశ్వాసంతో ఉన్న ప్రజలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి  ఆయనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో  ఏఎంసీ చైర్మన్‌ నడిపేన శ్రీనివాసరావు, వైస్‌చైర్మన్‌ రెడ్డి గురుమూర్తి,  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి కోలగట్ల తమ్మన్నశెట్టి,  సీనియర్‌ సిటిజన్‌ విభాగం నాయకులు కోలగట్ల కృష్ణారావు, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, సీనియర్‌ మాజీ కౌన్సిలర్‌ ఎస్‌వివి.రాజేష్,  నగర యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, పార్టీ నాయకులు డాక్టర్‌ విఎస్‌.ప్రసాద్, కనకల ప్రసాదరావు,  మామిడి అప్పలనాయుడు, సత్తరపు శంకరరావు, జివి.రంగారావు, పిన్నింటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు