అబ్రకదబ్ర... అబ్రకదబ్ర

21 Mar, 2019 11:43 IST|Sakshi
జమ్మలపాళెం వద్ద అపార్ట్‌మెంట్లు నిర్మించే అటవీప్రాంతంలో ఉన్న భూమి, మద్దూరుపాడులో నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు

పేదల ఇళ్ల నిర్మాణంలో టీడీపీ నాయకుల మాయాజాలం

నిర్మాణాలు పూర్తికాకుండానే గృహ ప్రవేశాలు

విస్తుపోతున్న లబ్ధిదారులు 

సాక్షి, కావలి (నెల్లూరు): ప్రజలకు ఏమీ చేయకుండానే అబ్రకదబ్ర...అబ్రకదబ్రా...అని అన్నీ చేసేసినట్లుగా దబాయించగల సమర్థులు కావలి టీడీపీ నాయకులు. అందుకే కావలి పట్టణంలో గత ఐదేళ్లుగా పేదలు ఇంటి స్థలాలు ఇవ్వాలని వేడుకున్నా కనికరించని టీడీపీ నాయకులు, తామే ఇంటిని నిర్మించి ఇస్తామని చెబుతూవచ్చారు. ఇలా నాలుగేళ్లు గడిపేశారు. ఇక ఏడాదిలో ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని, ‘అపార్ట్‌మెంట్ల నిర్మాణం’ అనే డూప్‌  సినిమాను సిద్ధం చేసుకున్నారు.ఇందుకోసం రెండు శంకుస్థాపనలు... ఫ్లాట్ల కేటాయింపులు, గృహ ప్రవేశాలు చేశారు. ఇవన్నీ కూడా మంత్రులు నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొంగూరు నారాయణ సహకారంతో పట్టణంలో ‘అపార్ట్‌మెంట్ల నిర్మాణం’ అనే డూప్‌ సినిమాను టీడీపీ నాయకులు చూపించిన వైనమిది. పట్టణంలో టీడీపీ ప్రభుత్వం ఒక పక్కాగృహం కూడా నిర్మించి ఇవ్వలేదు. కానీ గృహప్రవేశాలు మాత్రం చేసేసినట్లుగా టీడీపీ నాయకులు డూప్‌ సినిమాను రక్తి కట్టించారు. కానీ ఎన్నికలు వచ్చేయడంతో తమ డూప్‌ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని టీడీపీ నాయకులే తలలు పట్టుకుంటున్నారు.

అట్టహాసంగా శంకుస్థాపనలు
చంద్రమోహన్‌రెడ్డిలచే కావలి టీడీపీ నాయకుడు బీద మసాన్‌రావు శంకుస్థాపన అట్టహాసంగా చేయించి టీడీపీ నాయకులతో వైభవంగా సన్మానం చేయించారు. అక్కడ అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నామని, వాటిలో ఫ్లాట్లనే పక్కా గృహాలుగా ఇస్తామని టీడీపీ నాయకులు అర్జీదారులకు గొప్పగా చెప్పసాగారు. కాగా నిర్మాణ పనులు జరుగుతుండగా వార్డుల వారీగా టీడీపీ నాయకులు ప్రజలను అక్కడకు తీసుకెళ్లి అక్కడేదో అద్భుతమైన నిర్మాణాలు జరుగుతున్నట్లుగా ‘నిర్మాణాలు ప్రత్యక్ష వీక్షణం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అసలు నిర్మాణాలు పూర్తి కాకుండా, గోడలను తమకు చూపించడం ఏమిటో...వీరి పైత్యం ఏమిటో అంటూ లబ్ధిదారులు విస్తుపోయారు. కొద్దిరోజులకు అంటే గత ఏడాది అక్టోబర్‌ 5 వతేది మంత్రి పొంగూరు నారాయణ చేత ఫ్లాట్ల కేటాయింపులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

అప్పటికీ నిర్మాణాలు సగం దశలో ఉన్నాయి. అప్పుడు కూడా అసలు నిర్మాణం పూర్తికాకుండానే ఈ కేటాయింపులు ఏమిటీ.. ఎందుకు తమల్ని ఇలా సతాయిస్తున్నారని లబ్ధిదారులు టీడీపీ నాయకులపై విమర్శలతో దండయాత్ర చేశారు. అనంతరం గత ఫిబ్రవరి 9  బీద మస్తాన్‌రావు ఫ్లాట్లలో గృహ ప్రవేశాలు అంటూ అచ్చం నిజమైన గృహ ప్రవేశాలు ఎలా చేస్తారో అలానే చేశారు. అంటే ఇంటి గుమ్మాలకు పూలు కట్టి, పాలు పొంగించి, ఆవును ఇంట్లోకి తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలు చేశారు. విచిత్రం ఏమిటంటే అప్పటికీ ఫ్లాట్లు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ఇదే విషయాన్ని అబ్దిదారులు టీడీపీ నాయకులను నిలదీసి అడిగారు. వారు ఏమో మా నాయకుడు బీద మస్తాన్‌రావు లబ్ధిదారులను మద్దూరుపాడు వద్ద నిర్మిస్తున్న ఫ్లాట్ల వద్దకు తీసుకురమ్మన్నాడు, మేం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాం అంటూ చెప్పి తప్పించుకున్నారు

కావలి పట్టణానికి 7,501 ఇళ్లు మంజూరు అయితే, వాటిలో 2,112 ఇళ్లు (అపార్ట్‌మెంట్లులో ఫ్లాట్లు) మాత్రమే పట్టణానికి 5 కిలోమీటర్లు దూరంలో ఉన్న మద్దూరుపాడు రైస్‌మిల్లులు వెనుక నిర్మిస్తున్నారు. మిగిలిన 5,398 ఫ్లాట్లు  కావలి పట్టణానికి ఐదు కిలోమీటర్లు దూరంలో జమ్మలపాలెం గ్రామం అటవీ ప్రాంతంలో ఉన్న  స్థలంలో నిర్మించడానికి గత ఫిబ్రవరి 9 వ తేది శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపనకు  కావలి టీడీపీ నాయకుడు బీద మస్తాన్‌రావు తనకన్నా వీఐపీ కావలిలో ఎవరున్నారుకున్నారో ఏమో కానీ, మంత్రులు ఎవరినీ పిలవకుండానే ఆయనే దర్జాగా శంకుస్థాపన చేసేశారు. కాగా రైతులకు చెందిన ఆ భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా అపార్ట్‌మెంట్లు నిర్మిస్తే తాము ఊరుకోమని హెచ్చరించడంతో అక్కడ నిర్మాణ పనుల వ్యవహారం కేవలం శంకుస్థాపన వరకే పరిమితమైంది. ఇప్పుడు ఈ వ్యహారం అంతా గప్‌చుప్‌ అన్నట్లుగా టీడీపీ నాయకులు ఉండిపోయారు. లబ్ధిదారులు మాత్రం టీడీపీ నాయకులు నాలుగేళ్లు ఇంటి పట్టాలు కాని, ఇళ్లు కాని ఇవ్వకుండా, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని  ఏడాది పాటు అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్లు సినిమా చూపించారని కామెడీగా నవ్వుకుంటున్నారు. అంతిమంగా కావలి పట్టణంలో టీడీపీ నాయకులు వ్యవహారశైలి పట్ల, పక్కా గృహాలు ఇస్తామని టీడీపీ నాయకులు భ్రమలు కల్పించి వారి చుట్టూ ఆ కాగితాలు, ఈ కాగితాలు అంటూ తిప్పుకొని తమల్ని ఏమీ లేకుండా చేశారని లబ్ధిదారులు మండిపడుతున్నారు.

అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో ప్రధాన ఘట్టాలు

తొలి శంకుస్థాపన చేసింది  08 జనవరి, 2018  నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి,   మంత్రులు
ఫ్లాట్ల కేటాయింపులు  05 అక్టోబర్, 2018  పొంగూరు నారాయణ, మంత్రి
రెండవ శంకుస్థాపన చేసింది

 06 ఫిబ్రవరి, 2019

 బీద మస్తాన్‌రావు, టీడీపీ నాయకుడు
గృహ ప్రవేశాలు  09 ఫిబ్రవరి, 2019  బీద మస్తాన్‌రావు, టీడీపీ నాయకుడు

 

మరిన్ని వార్తలు