ఇక ఉగాది కానుక!

23 Nov, 2019 11:20 IST|Sakshi
నందిగామ మండలం కమ్మవారిపాలెంలో ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ  భూములను పరిశీలిస్తున్న తహశీల్దారు చంద్రశేఖర్, సిబ్బంది  (ఫైల్‌) 

ఇళ్ల స్థలాల కోసం 2,71,033 మంది అర్హులు 

అవసరమైన భూమి 4601.36 ఎకరాలు 

అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి  2132.02 ఎకరాలు 

సేకరించాల్సిన భూమి 2497.79 ఎకరాలు 

సొంతింటి కల సాకారం దిశగా.. సొంత స్థలం కానుక కాబోతున్న వేడుక ఉగాది. ఆ రోజు రాక కోసం కోటి ఆశలతో నిరుపేదలు ఎదురుచూస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని జీవితాంతం కష్టపడినా కాసింత జాగా కూడా కొనుక్కోలేని రోజులివి. పేదలను సొంతింటి మారాజులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నిరుపేదల్లో ఆనందాలు నింపుతోంది.

సాక్షి, మచిలీపట్నం: ఉగాది నాటికి జిల్లాలోని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వివిధ రూపాల్లో అందిన దరఖాస్తులను ఇంటింటి సర్వేలో గ్రామ, వార్డు వలంటీర్లు క్షేత్ర స్థాయి పరిశీలన జరిపారు. దరఖాస్తు చేయని అర్హుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించారు. కులాలు, మతాలు, పార్టీలకతీతంగా జరిపిన సర్వేలో అర్హుల గుర్తింపు పూర్తి పారదర్శకంగా సాగింది. ఈ జాబితాలను ఇప్పటికే పంచాయతీలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించి వాటిని కూడా ఇటీవల జరిగిన గ్రామసభల్లో పరిష్కరించారు. ఇప్పటి వరకు సొంత ఇల్లు, ఇంటి స్థలం లేని అర్హులైన జాబితాను వివిధ కోణాల్లో పరిశీలన అనంతరం జిల్లాలో 2,71,033 మంది అర్హులుగా లెక్కతేల్చారు. వీరిలో గ్రామీణ జిల్లాలో 1,31,660 మంది, అర్బన్‌ ప్రాంతంలో 1,39,373 మంది అర్హులున్నట్టుగా గుర్తించారు. వీరికి ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఇళ్ల స్థలాలు కేటాయిం చాలంటే కనీసం 4601.36 ఎకరాలు భూమి అవసరమని గుర్తించారు. ఎక్కువగా డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో 2132.02 ఎకరాల ప్రభుత్వ భూములను ఆ ఇళ్ల స్థలాలకు అనువైనవిగా నిర్ధారించారు. కాగా మరో 2497.79 ఎకరాలు సేకరించాల్సి ఉందని లెక్కతేల్చగా, ఇప్పటి వరకు భూసేకరణ కోసం 960.2 ఎకరాల ప్రైవేటు భూములు  గుర్తించారు.  

మరో 1537.77 ఎకరాల భూముల కోసం అన్వేషిస్తున్నారు. భూసేకరణ కోసం రూ.2326.80 కోట్లు అవసరమని అంచనా వేశారు. కాగా ఆ భూముల లెవలింగ్‌ కోసం మరో రూ.306.75 కోట్లు ఖర్చవుతాయని లెక్కతేల్చారు. మొత్తం జిల్లాకు 2633.52 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అర్బన్‌ ప్రాంతాల్లో అత్యధికంగా విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో 86,513 మంది అర్హులుగా లెక్క తేల్చగా, నందిగామలో కేవలం 1072 మంది మాత్రమే అర్హులుగా గుర్తించారు. వీరంతా అర్హులని సమాచారం కూడా అందించారు. ఒకటికి పదిసార్లు ఇంకా ఎవరైనా అర్హులున్నారేమో బూతద్దంతో గుర్తించే కార్యక్రమం కూడా చేశారు. చివరకు ఎవరూ లేరని తేలడంతో అర్హుల జాబితాలను ప్రభుత్వామోదం కోసం పంపించారు. వీరందరికీ  వచ్చే ఏడాది ఉగాది రోజున ఇళ్ల స్థలాలు కేటాయించి ఇచ్చేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు గుర్తించిన ప్రైవేటు భూముల కోసం త్వరలోనే ప్రభుత్వాదేశాల మేరకు భూసేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు 
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు జిల్లాలో అర్హులను గుర్తించారు. వారికి ఇళ్ల స్థలాల కోసం ఎంత భూమి అవసరమో లెక్కతేలింది. అందుబాటులో ప్రభుత్వ భూముల గుర్తింపు పూర్తయింది. ఇక సేకరించాల్సిన ప్రైవేటు భూములను ఇంకా గుర్తించాల్సి ఉంది. ప్రభుత్వాదేశాలతో త్వరలోనే గుర్తించిన ప్రైవేటు భూముల కోసం భూసేకరణ ప్రక్రియ మొదలు పెట్టనున్నాం. ఏదిఏమైనా ప్రభుత్వ లక్ష్యం మేరకు వచ్చే ఏడాది ఉగాది రోజున అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి స్థలం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.  – ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్‌

>
మరిన్ని వార్తలు