హౌస్ కీపింగ్ మాయాజాలం

17 Oct, 2014 03:11 IST|Sakshi

సాక్షి,తిరుమల: తిరుమలలో కాటేజీల పరిశుభ్రత విషయంలో ప్రైవేట్ కంపెనీలు చేతులెత్తేశాయి. టీటీడీ విధించిన నిబంధనలు పాటించడం లేదు. హౌస్‌కీపింగ్ పేరుతో ప్రైవేట్ కంపెనీలకు ఏటా రూ.2కోట్లు కేటాయించే సంబంధిత అధికారులు గదుల శుభ్రత  తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
 
నాలుగు కంపెనీలకు ఏటా రూ.2 కోట్లపైగా కాంట్రాక్టు

తిరుమలలో మొత్తం 6,800 గదులున్నాయి. వీటిని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ప్యాకేజీల కింద టీటీడీ విభజిచింది. వాటి శుభ్రత కోసం బీవీజీ (వెస్ట్ ), క్రిస్టల్ (నార్త్), పనోరమ (ఈస్ట్), ఆల్‌సర్వీస్ (సౌత్) ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. ఇందుకోసం ఏటా రూ.2 కోట్లకుపైగా కేటాయిస్తోంది. టీటీడీ నిబంధనల ప్రకారం ఆయా ప్రాంతాల్లోని కాటేజీలు, అతిథి గృహాల్లోని గదుల్లో పరిశుభ్రత చర్యలు, నిర్వహణ అంతా ఆ కంపెనీల నిర్వాహకులే చూడాలి.
 
నిబంధనలకు పాతర

గదుల శుభ్రత విషయంలో సంబంధిత ప్రైవేట్ సంస్థలు టీటీడీ నిబంధనల్ని ఏమాత్రం పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఖాళీ అయిన గదిని తిరిగి కేటాయించేందుకు అనువైన మార్గం కల్పించడంలో విఫలమవుతున్నాయి. గది, మరుగుదొడ్డి, స్నానాల గది శుభ్రత వినియోగించాల్సిన పరికరాలు, మాఫ్, సువాసనలతో కూడిన ఫినాయిల్, నాప్తలిన్ ఉండలు కూడా అందుబాటులో ఉంచడం లేదు.

విరిగిన కొళాయిలు, లీకేజీ బెడత, బొద్దింకలు, నల్లుల గోల, పేరుకుపోయిన దుమ్ము, ధూళితో నిండిన గదులను వంద శాతం శుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకు భిన్నంగా కాటేజీల్లోని గదులు అపరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. అదేమని కార్మికులను అడిగితే సంబంధిత కంపెనీలు అవసరమైన వస్తువులు, పదార్థాలు ఇవ్వడం లేదని కుండబద్ధలు కొడుతున్నారు. గదులు నిర్వహణ చేసే టీటీడీ రిసెప్షన్ సిబ్బంది కూడా సంబంధిత కంపెనీల ప్రతినిధులను నిలదీసిన సందర్భాలూ ఉన్నాయి. వీఐపీలు బస చేసే ప్రాంతాల్లో అన్నీ ఉన్నా..సామాన్య భక్తులు బసచేసే గదుల్లో మాత్రం పారిశుధ్యం బాగోలేదు.
 
ఆచరణలోలేని కమిటీలు


నాలుగు ప్యాకేజీల్లోని గదుల శుభ్రతను ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు రిసెప్షన్, హెల్త్, ఎఫ్‌ఎంఎస్ ఇంజినీరింగ్ విభాగాలతో కమిటీలు వేశారు. ఆచరణలో మాత్రం కమిటీలు పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. గదుల్లో పారిశుధ్య లోపాలను గుర్తించి సంబంధిత కంపెనీల నుంచి జరిమానా వసూలు చేయాల్సిన కమిటీలు ఏమాత్రం పట్టీపట్టనట్టుగా ఉండడంతో సంబంధిత పారిశుద్ధ్య పనులు దక్కించుకున్న కంపెనీలకు కలసి వస్తోంది.
 

మరిన్ని వార్తలు