తెగువచూపి.. తిరగబడి..

6 Sep, 2017 01:45 IST|Sakshi
తెగువచూపి.. తిరగబడి..
- ఇంట్లోకి చొరబడి దోపిడీ
సాహసోపేతంగా పట్టుకునేందుకు గృహిణి విఫలయత్నం
 
గుంటూరు ఈస్ట్‌: కత్తి చూపించి బెదిరించి నగలు దోపిడీ చేసిన నిందితులపై.. ఓ గృహిణి ధైర్యం చేసి ఎదురు తిరిగింది. ఒంటరిగా ఉన్నాననే భయాన్ని వీడి ఇద్దరు నిందితులపై తిరగబడింది. వెంటాడి వెంటాడి రోడ్డుపై వెళుతూ పోరాడింది. చేతికి తీవ్ర గాయమైనా పట్టించుకోకుండా నింది తులను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. పాతగుంటూరులో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఈస్ట్‌ డీఎస్పీ కండె శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. యాదవ హై స్కూల్‌ సమీపంలో కొత్తమాసు వేణుగోపాల్, సువర్ణలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. బస్టాండ్‌ సమీపంలోని కృష్ణ క్లాత్‌ మార్కెట్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో వేణుగోపాల్‌ బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఇంట్లోనూ చీరలు, ఫాల్స్‌ విక్రయిస్తుంటారు.

ఆగస్టు 31న ఓ వ్యక్తి, మహిళ వేణుగోపాల్‌ ఇంటికి వచ్చి చీర ఫాల్‌ కొనుగోలు చేశారు. తిరిగి సెప్టెంబర్‌ 2న వేణుగోపాల్‌ ఇంటికి వచ్చి చీరలు, ఫాల్స్‌ ధరలు వాకబు చేసి వెళ్లారు. మంగళవారం ఉదయం 11.15 సమయంలో సువర్ణలక్ష్మి ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి ఒక చీర ఫాల్‌ కొనుగోలు చేశారు. మంచినీరు ఇవ్వమని అడిగారు. సువర్ణలక్ష్మి లోపలికి వెళ్లి వచ్చి మంచినీళ్లు ఇస్తే ఇద్దరూ తీసుకున్నారు. మంచినీళ్లు తాగే సాకుతో లోపలి గదిలోకి వచ్చి తలుపులు వేసి గడియపెట్టి సువర్ణ లక్ష్మిపై ఇద్దరూ దాడి చేశారు. కత్తి పొట్టపై పెట్టి మెడలో ఉన్న రెండు బంగారు చైన్లు, వాటికి ఉన్న తాళిబొట్టు, రూపు, చేతికి ఉన్న రెండు బంగారు గాజులు లాక్కున్నారు.

సువర్ణలక్ష్మి ధైర్యంగా వారిని అడ్డగించి కేకలు వేసింది. ఇద్దరిలో పురుషుడు వేగంగా రోడ్డుపైకి వెళ్లి బైక్‌ ఎక్కి స్టార్ట్‌ చేశాడు. సువర్ణలక్ష్మి అరుపులు విని ఆ దారిన వెళుతున్న మరో మహిళ పారిపోతున్న నిందితురాలిని గట్టిగా పట్టుకుంది. ఇద్దరు మహిళలూ బైక్‌ను కదలనీయకుండా విఫలయత్నం చేశారు. నిందితుడు వాహనాన్ని వేగంగా నడపటంతో ఇద్దరూ పరారయ్యారు. పెనుగులాటలో సువర్ణ లక్ష్మి చేతికి తీవ్రగాయమై రక్తస్రావమైంది. సువర్ణలక్ష్మి నుంచి 15 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. వీధిలో అనేక సీసీ కెమెరాలు ఉండటంతో నిందితులు ఫుటేజీలో నమోదయ్యాయి.
మరిన్ని వార్తలు