రాజధానికి చేరిన హౌసింగ్‌ అవినీతి

16 Feb, 2019 12:24 IST|Sakshi

రోడ్డెక్కుతున్న మోసపోయిన లబ్ధిదారులు 

జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు సీఎం కార్యాలయానికి వెళ్లిన కాకినాడ మహిళ

సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వక

పోవడంతో స్పృహ తప్పి పడిపోయిన వైనం

రూ.లక్ష కట్టినా ఇళ్లు మంజూరవ్వలేదని గగ్గోలు పెడుతున్న బాధితురాలు 

సాక్షి ప్రతినిధి, కాకినాడ: హౌసింగ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని, కాకినాడలో జరుగుతున్న మోసాలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లేందుకు నగరానికి చెందిన ముంత నళినికుమారి అనే మహిళ యత్నించింది. ఇల్లు మంజూరైందని చెప్పి రెండు విడతలుగా రూ.లక్ష కట్టించుకుని తీరా ఇల్లు లేదంటూ చేతులేత్తేశారని చెప్పుకునేందుకు సీఎం కార్యాలయానికి వెళ్లిన ఆమెకు సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. గత మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నా అడ్డు తగులుతుండటం, ఉదయం 6 గంటల నుంచి వేచి ఉన్నా కరుణించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవడమే కాకుండా అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆమె స్పృహ తప్పి పడిపోయింది.

 దీంతో కాకినాడ నగరంలో చోటుచేసుకున్న హౌసింగ్‌ అక్రమాలు రాజధానివేదికగా బట్టబయిలైనట్టయింది.ఒక్క నళినీయే కాదు కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో ఇటువంటి బాధితులు వేలల్లో ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలను తొలి నుంచీ ‘సాక్షి’ చెప్పుకొస్తూనే ఉంది. ఇల్లు మంజూరు చేస్తామని ముడుపులు తీసుకొని, మంజూరైందని చెప్పి రూ.లక్షల్లో కట్టించుకుని, తీరా మంజూరు కొచ్చేసరికి మొండిచేయి చూపిస్తున్నారు. దీంతో సొంతింటికల నెరవేరుతుందన్న ఆశతో ఏళ్ల తరబడి ఎదురుతెన్నులు చూస్తున్న పేదలకు నిరాశ ఎదురవ్వడమే కాకుండా ముడుపులు ముట్టజెప్పి మోసపోయిన పరిస్థితి ఏర్పడింది.

 ‘హౌస్‌ఫర్‌ ఆల్‌’ పథకం కింద జిల్లా కేంద్రం కాకినాడకు సుమారు 4,600 ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో ఎంతో కాలంగా సొంతింటికోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఎట్టకేలకు సొంత గూడు వస్తుందని ఆశ పడ్డారు. అయితే, అధికార పార్టీ నేతలు వచ్చిన అవకాశాన్ని క్యాష్‌ చేసుకోవాలని కాకినాడకు కేటాయించిన ఇళ్లను వాటాలు వేసేసుకున్నారు. ఒక్కొక్కరికీ 50 నుంచి 100 అని చెప్పి జన్మభూమి కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు తలో కొన్ని పంచేసుకున్నారు. పంపకాలు జరగడమే తరువాయి తమ కోటా కింద వచ్చిన ఇళ్లను అమ్మకాలకు పెట్టారు. అప్పటికే ఇళ్లు లేదని దరఖాస్తులు చేసుకున్న వారితో బేరసారాలు సాగించారు. ఒక్కో ఇంటికి రూ.25వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకుని ఇళ్లు మంజూరు చేస్తామని మభ్య పెట్టారు. అంతటితో ఆగకుండా లబ్ధిదారుల నుంచి రూ. 25 వేలు చొప్పున తొలి విడతగా, రూ.75 వేలు చొప్పున రెండో విడతగా కట్టించుకున్నారు.

 అయితే, కాకినాడ కార్పొరేషన్‌కు తొలి విడతగా 1105 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. దరఖాస్తులు ఎక్కువ...మంజూరైనవి తక్కువ కావడంతో పోటీని చూపించి మళ్లీ ముడుపులకు డిమాండ్‌ చేశారు. సొంతింటి కల నెరవేరుతుందని నేతలు చెప్పినట్టుగా అడిగినంతా ముట్టజెప్పారు. ఎమ్మెల్యే ఇంటిని అడ్డాగా చేసుకుని రూ.25 వేల నుంచి రూ.50 వేలు వరకూ ముడుపులు తీసుకొని ఇల్లు మంజూరు చేస్తున్నారని  ఒకానొక సందర్భంలో లబ్ధిదారులు లబోదిబోమన్నారు. పోనీ ముడుపులు తీసుకున్నా అందరికీ ఇళ్లు మంజూరు చేయలేదు. చాలా మంది లక్షలాది రూపాయలు ముట్టజెప్పినా ఇల్లు దక్కని పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పులు చేసి కట్టిన నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు.

 పూట గడవకపోయినా సొంతింటి కోసం అక్కడా ఇక్కడా అప్పులు చేశామని, తీరా ఇళ్లు రాలేదని వారంతా ఆవేదన చెందడమే కాకుండా రోడ్డెక్కుతున్నారు. అప్పులు భరించలేక ఏదో ఒకటి చేసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇలాంటి బాధితుల్లో ఒకరు కాకినాడ డెయిరీ ఫారమ్‌కు చెందిన ముంత నళినికుమారి. రాజీవ్‌ గృహ కల్పలో 175ఎఫ్‌4లో అద్దెకుంటున్నారు. ఆమె భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నారు. నిరుపేదైన నళిని కుమారికి ఎముకలకు సంబంధించిన వ్యాధితోపాటు నరాల బలహీనతతో కుడి చేతి వేళ్లు వంకరపోయాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈమె ప్రభుత్వం ఇస్తుందనుకున్న సొంతింటి కోసం రూ.25 వేలు ఒకసారి, రూ.75 వేలు మరోసారి డీడీ కట్టారు. సీ10/55 సెకండ్‌ ఫ్లోర్‌లో ఇల్లు వచ్చిందని కూడా అటు మున్సిపల్‌ ఆఫీసులోనూ, ఇటు ఎమ్మెల్యే ఆఫీసులోనూ చెప్పారు. కానీ ఇప్పుడు తనకే నెంబర్‌ ఇల్లు రాలేదని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మూడు రూపాయల వడ్డీకి తెచ్చి కడితే ఇప్పుడు ఇల్లు రాలేదని చెప్పడంతో ఆందోళనకు లోనయ్యారు. అటు ఎమ్మెల్యే కార్యాలయం, ఇటు మున్సిపల్‌ అధికారులు ఎంత బతిమిలాడినా స్పందించకపోవడంతో ఏకంగా అమరావతికి వెళ్లి సీఎంను కలిసి తన గోడు చెప్పుకుందామని భావించారు. ఆమేరకు గత మూడు రోజులుగా సీఎం కార్యాలయానికి వెళ్తుండగా అక్కడి అధికారులు అవకాశం ఇవ్వలేదు. శుక్రవారం కూడా ఉదయం 6 గంటల నుంచి సీఎం కార్యాలయం వద్ద నిరీక్షించగా ఏ ఒక్కరూ స్పందించలేదు సరికదా లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఈమె ఎండలో నిరీక్షించి స్పృహ తప్పి పడిపోయారు. స్థానికుల సాయంతో అసుపత్రికి తరలించారు. దీని ప్రకారం కాకినాడ కార్పొరేషన్‌లో హౌసింగ్‌ గోల్‌మాల్‌ ఏ స్థాయిలో జరిగిందో స్పష్టమవుతోంది. 

నేటికీ కొలిక్కిరాని డీడీల కుంభకోణం...
సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో అప్పులు చేసి పుస్తెలమ్మి రూ.25వేలు చొప్పున కార్పొరేషన్‌కు ఇచ్చిన డీడీలు గల్లంతైన వ్యవహారం నేటికీ కొలిక్కి రాలేదు. కొంతమంది కార్పొరేషన్‌ అధికారులు, కిందిస్థాయి సిబ్బందితో టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర నేతలు కుమ్మక్కై డీడీలను స్వాహా చేసేశారు. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ కార్పొరేటర్లతో నిజనిర్ధారణ కమిటీ వేసినప్పటికీ అధికారులు సహకరించలేదు. డీడీలు గల్లంతైనట్టు తేలినా ఎమ్మెల్యే ఒత్తిడితో ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా బుట్టదాఖలు చేశారు. డీడీల తీగ బయటికిలాగితే పచ్చనేతల బాగోతం మరింత బయటపడనుంది. 

మరిన్ని వార్తలు