బీపీఎల్‌ కుటుంబాలకే ఇళ్ల స్థలాలు

1 Apr, 2020 04:30 IST|Sakshi

హైకోర్టు ఆదేశాల మేరకు నిబంధనల సవరణ 

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్ల స్థలాల పంపిణీకి దారిద్య్రరేఖకు దిగువనున్న (బీపీఎల్‌) కుటుంబాలనే అర్హులుగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రాష్ట్రంలో ఇళ్లు లేనివారందరికీ సంతృప్త స్థాయిలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి దశలవారీగా ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అయితే.. దీన్ని సవాల్‌ చేస్తూ కొందరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు లబ్ధిదారుల ఎంపికతోపాటు కొన్ని నిబంధనలను మార్చాలని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈ ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ ఆగకుండా కొనసాగించడంలో భాగంగా హైకోర్టు ఆదేశాల ప్రకారం నిబంధనలను ప్రభుత్వం స్వల్పంగా సవరించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసినందున కొత్త నిబంధనల ప్రాతిపదికగా వారి జాబితాను పునఃపరిశీలించి.. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలనే ఎంపిక చేసి జాబితాను సవరించనున్నారు. అనంతరం సవరించిన జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మార్చిన నిబంధనలతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉషారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

నివాస స్థలం పట్టా ధర రూపాయే.. 
► పేదలకు ఇచ్చే స్థలం పట్టా ధరను రూపాయిగా నిర్ణయించారు. కన్వేయన్స్‌ డీడ్‌ రూపంలో ఇవ్వదలిచినందున స్టాంప్‌ పేపర్‌కు రూ.10, లామినేషన్‌కు రూ.10 కలిపి రూ.21గా ఖరారు చేశారు. 
► కొత్త నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలను విక్రయించడానికి వీలుకాదు. ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఐదేళ్లు నివాసం ఉన్న తర్వాత అత్యవసరమైతేనే వేరే వారికి విక్రయించవచ్చు.  
► పేదల పట్టాలను కన్వేయన్స్‌ డీడ్‌ రూపంలో ఇవ్వనుంది. డూప్లికేషన్‌ లేకుండా చేయడం, ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా చేయడం కోసమే ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా