పేదల ఇళ్లకు తీపి కబురు

3 Jun, 2020 03:35 IST|Sakshi

గత ప్రభుత్వం పెట్టిన ఇళ్ల బకాయిలను చెల్లించాలని సీఎం జగన్‌ నిర్ణయం

గత సర్కారు బకాయిలు పెట్టినా పేదలకు అండగా ఉంటాం

వైఎస్సార్‌ జయంతి రోజైన జూలై 8న పేదలందరికీ ఇళ్ల స్థలాలు

భౌతిక దూరం పాటిస్తూ పట్టాల పంపిణీ కార్యక్రమం

ప్రభుత్వం నాణ్యమైన పనులు చేస్తుందనే పేరు రావాలి

ఈ సత్కార్యాన్ని చిత్తశుద్ధితో చేస్తే పుణ్యం దక్కుతుంది

పేదలకు ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

పేదల ఇళ్ల నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. పేదవాడిపై ఒక్క రూపాయి కూడా అప్పు అనేది లేకుండా ఇంటిని సమకూర్చాలి. అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో పనులు కొనసాగాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: పేద వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరో శుభవార్త వినిపించారు. గత సర్కారు పేదలకు పెట్టిన ఇళ్ల బకాయిలను చెల్లించాలని సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల 3,38,144 మంది ఇళ్ల లబ్ధిదారులకు రూ.1,323 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. గత ప్రభుత్వం బకాయిలు పెట్టినా పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. పొరపాట్లకు తావివ్వకుండా నిధులు సమీకరించుకుని చెల్లింపులకు ఒక తేదీ ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్మాణాలు నాసిరకంగా ఉంటాయనే అభిప్రాయం తొలగిపోవాలన్నారు. పేదల కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధితో పూర్తి చేస్తే పుణ్యం దక్కుతుందని, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం  చేపడుతున్నామని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణంపై సీఎం జగన్‌ మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..
క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   

ఇళ్ల సంఖ్యను పెంచాలి...
దివంగత వైఎస్సార్‌ జయంతి రోజైన జూలై 8వతేదీన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమంపై సమీక్షించారు.భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. కేటాయించిన స్థలం వద్దే అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వాలని ఆదేశించారు.
– తొలి విడతలో చేపట్టబోయే 15 లక్షల నిర్మాణాలపై సీఎం సమీక్షించారు. విశాఖ, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇళ్ల సంఖ్యను పెంచాలని సీఎం ఆదేశించారు.

రూపాయి కూడా అప్పు లేకుండా ఇల్లు..
– పేదలకు నిర్మించబోయే ఇళ్లలో కల్పించే సదుపాయాలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. డిజైన్‌లో భాగంగా పడక గది, వంట గది, లివింగ్‌ రూం, మరుగుదొడ్డి, వరండా సహా సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
– పేదల ఇళ్ల నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సీఎం స్పష్టం చేశారు. పేదవాడిపై ఒక్క రూపాయి కూడా అప్పు అనేది లేకుండా ఇంటిని సమకూర్చాలన్నారు. పేదలకు గృహ వసతి కల్పించాలనే సదుద్దేశంతో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించామని, అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో పనులు కొనసాగాలని పేర్కొన్నారు.

మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి..
– చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రభుత్వం నాణ్యతతో పనులు చేస్తుందనే పేరు రావాలని సీఎం పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం ద్వారా ఏర్పాటయ్యే కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
– సమీక్షలో గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్, అధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా