ఇంటి రుణం@ 5%

20 Sep, 2013 01:04 IST|Sakshi

అల్పాదాయ తరగతుల కోసం కేంద్రం పథకం
రూ.ఐదు లక్షల రుణం వరకే ఐదుశాతం వడ్డీ పరిమితం
స్థలం ఉన్నా, ఫ్లాట్ కొంటున్నా రుణమిస్తారు..


 సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో సామాన్య ప్రజ లు ఎదుర్కొంటున్న సొంతగూడు ఇబ్బందులు దూరం కానున్నాయి. గృహనిర్మాణంకోసం వీరికి అతి తక్కువగా ఐదుశాతం వడ్డీకే రుణాలందజేయాలని కేంద్రప్రభుత్వం సంకల్పించింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్-ఈడబ్ల్యూఎస్), అల్పాదాయవర్గ తరగతుల(లో ఇన్‌కం గ్రూప్-ఎల్‌ఐజీ) ప్రజల కోసం ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ స్కీము ఇప్పటినుంచి 2017 మార్చి వరకు అమలుకానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజీ వర్గాలవారు గృహ నిర్మాణానికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే.. కేంద్రం తన నోడల్ ఏజెన్సీద్వారా వడ్డీ సబ్సిడీని నేరుగా సదరు బ్యాంకులకు జమ చేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
 
 ఐదుశాతం వడ్డీ రూ.ఐదు లక్షల వరకే పరిమితం..
 ఐదు శాతం వడ్డీ సబ్సిడీ రూ.ఐదు లక్షల రుణం వరకు మాత్రమే వర్తిస్తుంది. ఐదు లక్షలకంటే ఎక్కువ తీసుకున్నపక్షంలో.. మిగిలిన మొత్తానికి సాధారణ వడ్డీ చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్ వర్గాల ప్రజలకు కనీసం 29 చదరపు మీటర్ల స్థలం కార్పెట్ ఏరియా ఉండాలని, అదే ఎల్‌ఐజీ వర్గాల గృహానికైతే 40 చదరపు మీటర్ల స్థలం కార్పెట్ ఏరియా ఉండాలని నిబంధన విధించింది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వైకల్యమున్నవారికి ఈ రుణాల్లో ప్రాధాన్యమివ్వనున్నట్టు వెల్లడించింది. లబ్ధిదారులకు నేరుగా సబ్సిడీ ఇవ్వకుండా కేంద్రం ఎంపిక చేసిన జాతీయ గృహ బ్యాంకు(నేషనల్ హౌజింగ్ బ్యాంక్), హడ్కోల నుంచి ప్రతి మూడు నెలలకోమారు ఈ సబ్సిడీ వడ్డీని వాణిజ్య బ్యాంకులకు బదిలీచేస్తారు. లబ్ధిదారులు ప్రతినెలా చెల్లించే వాయిదా(ఇన్‌స్టాల్‌మెంట్)లో ఈ సొమ్మును మినహాయించి మిగతా మొత్తాన్ని వాణిజ్య బ్యాంకులు వసూలు చేసుకుంటాయి. ఈ పథకాన్ని రాజీవ్ లోన్ స్కీమ్ లేదా రాజీవ్ రిన్ యోజన(ఆర్‌ఆర్‌వై) పథకంగా పరిగణిస్తున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ పేర్కొంది. కేంద్రప్రభుత్వం జాతీయ పట్టణ నవీకరణ పథకం, గృహనిర్మాణ పథకాలను దీనికి అనుసంధానం చేయనున్నట్టు తెలిపింది.
 
 అర్హులు వీరే...
 తలసరి ఆదాయం రూ.లక్ష ఉన్న ఈడబ్ల్యూఎస్ వర్గాలు, రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలలోపు ఆదాయమున్న ఎల్‌ఐజీ వర్గాలవారు అర్హులు. ఆయా పట్టణాలు, నగరాల్లో స్థలం ఉండి.. కుటుంబంలో ఎవరి పేరిటా ఇల్లు లేనివారు మాత్రమే అర్హులు. ఒకవేళ ఇంటిస్థలం లేనిపక్షంలో, కొనడానికి సిద్ధంగా ఫ్లాట్ ఉన్నా.. రుణం మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ వర్గాలకు రుణాలివ్వడానికి వాణిజ్య బ్యాంకులు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ సూచించిం ది. రుణాలు మంజూరు చేసేటప్పుడు ఆ ఆస్తిని తనఖా పెట్టుకోవచ్చని, కానీ థర్డ్‌పార్టీ గ్యారంటీ అడగరాదని, కొల్లాటరల్ సెక్యూరిటీ కోరరాదని బ్యాంకులకు సూచించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని 15 ఏళ్లల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. రాష్ట్రప్రభుత్వాలు గృహ రుణాలు కోరేవారికోసం పట్టణాలు, నగరపాలక సంస్థల్లో ప్రత్యేకంగా అధికారులను నియమించి, దరఖాస్తులు స్వీకరించి వాటిని బ్యాంకులకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పట్టణాలు, నగరాల్లో గృహవసతి లేక సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి ఈ పథకాన్ని ప్రోత్సహించాలని సూచించింది.

మరిన్ని వార్తలు