బాబొచ్చాడు.. జాబు పోయింది

3 Aug, 2014 01:47 IST|Sakshi
బాబొచ్చాడు.. జాబు పోయింది

గృహ నిర్మాణ శాఖలో 3 వేల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం

సాక్షి విజయవాడ బ్యూరో : బాబొస్తే జాబొస్తుందని ఎన్నికల ముందు ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.. సీఎం  పీఠం అధిష్టించిన రెండు నెలల్లోనే వేలాది మంది ఉద్యోగులను ఇంటి బాట పట్టిస్తున్నారు. ఇప్పటికే డ్వామాలో ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను సర్కారు ఇంటికి పంపింది.
 
తాజాగా గృహ నిర్మాణ శాఖలో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించాలని నిర్ణయించింది. కంప్యూటర్ ఆపరేటర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు 2006 నుంచి అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో వీరు పనిచేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన లక్షలాది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయించేందుకు వీరిని నియమించారు.
 
డేటా ఎంట్రీ ఆపరేటర్, వర్క్ ఇన్‌స్పెక్టర్లకు నెలకు రూ. 7,500 నుంచి రూ. 8,500 వరకు, అసిస్టెంట్ ఇంజనీర్లకు రూ. 12 వేల చొప్పున జీతం ఇచ్చేవారు. ఏడాదికోసారి వీరి ఉద్యోగాలను పొడిగిస్తూ వచ్చారు. వాస్తవానికి వీరందరికీ జూన్ 30వ తేదీతో కాంట్రాక్టు గడువు ముగిసింది. జూలై 31వ తేదీ వరకు వీరిని కొనసాగించింది. కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు తమను కూడా క్రమబద్ధీకరిస్తారని వీరంతా ఆశపడ్డారు.
 
అయితే చంద్రబాబు వీరిని ఇంటిబాట పట్టించే పని మొదలు పెట్టారు. గత ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయించడంపై టీడీపీ ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదు. ఈ ఏడాది మార్చి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించే ఆలోచన కూడా చేయడం లేదు. దీంతోపాటు ఇప్పుడు గృహ నిర్మాణ శాఖలో సుమారు 3 వేల మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

>
మరిన్ని వార్తలు