నగర ప్రజలకు గృహ యోగం

14 Oct, 2019 10:40 IST|Sakshi
గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం

సాక్షి, నగరంపాలెం(గుంటూరు) : నగర ప్రజల సొంతింటి కల త్వరలో నిజం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల్లో భాగంగా అందరికీ ఇళ్లు పథకం తొలిదశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నగరపాలక సంస్థలో ఒక కొలిక్కి వచ్చింది. నగర ప్రాంతాల్లో స్థలాల లభ్యత తక్కువుగా ఉన్న దృష్ట్యా జీప్లస్‌ టూలో విశాలమైన గృహాలు నిర్మించి అందించనున్నారు. వార్డు వలంటీర్లను నియమించిన ఆగస్టు 15వ తేదీ నుంచి తొలి పనిగా డోర్‌ టూ డోర్‌ గృహాలు లేని నిరుపేదల గురించి సర్వే నిర్వహించారు. నగరంలోని 52 డివిజన్లతో పాటు, 10 విలీన గ్రామాల్లో వార్డు వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి హౌసింగ్‌ దరఖాస్తులను స్వీకరించారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీటిని క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి ప్రాథమికంగా అర్హుల జాబితాను తయారు చేశారు.

నగరంలో 52 డివిజన్లు, 10 విలీన గ్రామాల్లో కలిపి మొత్తం 38,252 మందితో ప్రాథమిక అర్హుల జాబితాను నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ విడుదల చేశారు. ప్రాథమిక అర్హుల జాబితాను నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు, బృందావన్‌ గార్డెన్స్‌లోని సర్కిల్‌ కార్యాలయంలో ప్రదర్శించారు. అర్హుల జాబితాపై ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరించి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. డివిజన్ల వారీగా విడుదల చేసిన అర్హుల జాబితాలో ఎక్కువ మంది విలీన గ్రామాలకు సంబంధించి 56వ డివిజన్‌లో 3,428, 57వ డివిజన్‌లో 3,097, పశ్చిమ నియోజకవర్గంలోని 28వ డివిజన్‌లో 2,252 మంది ఉన్నారు. అతి తక్కువ మంది 42వ డివిజన్‌లో 385 మంది మాత్రమే ఉన్నారు. అర్హుల జాబితాపై అభ్యంతరాలను డివిజన్ల వారీగా నిర్వహించనున్న వార్డు సభల్లో స్వీకరించనున్నారు.

ప్రైవేటు స్థలాల కొనుగోలుకు చర్యలు :
గృహాల నిర్మాణానికి స్థల సేకరణను రెవెన్యూ అధికారులతో కలసి నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వేగవంతం చేశారు. నగరంతో పాటు, విలీన గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు లభ్యత లేకపోవటంతో ప్రైవేటు స్థలాలు కొనుగోలుకు ప్రయత్నాలు ప్రారంభించారు. విలీన గ్రామాల్లోను, శివారు కాలనీలోని ఇళ్ల మధ్యలో ఉన్న పొలాలను కొనుగోలు చేయటానికి ఇప్పటికే రెవెన్యూ అధికారుల సహాయంతో యజమానులను గుర్తించి చర్చలు ప్రారంభించారు. సుమారు 40 వేల ఇళ్లకు 60 నుంచి 100 ఎకరాలు అవసరం ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి సంబంధించి ప్రాథమికంగా గుర్తించిన స్థలాల ప్రతిపాదనలు జిల్లా అధికారులకు సమర్పించనున్నారు.

15 నుంచి వార్డు సభలు
అర్హుల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 15 నుంచి డివిజన్ల వారీగా వార్డు సభలు నిర్వహిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. ప్రాథమిక అర్హుల జాబితాను డివిజన్ల వారీగా అందుబాటులో ఉంచామన్నారు. అందరికీ ఇళ్లు పథకం ద్వారా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలోను, ఆన్‌లైన్‌ ద్వారా వెరిఫికేషన్‌ చేసి ప్రాథమిక అర్హుల జాబితాను రూపొందించామని తెలిపారు. అర్హుల జాబితాపై ఫిర్యాదులు, సలహాలు, సూచనలను వార్డు సభల్లో అందిస్తే విచారణ చేసి, తుది జాబితాను సిద్ధం చేస్తామని వివరించారు.

మరిన్ని వార్తలు