హోవర్‌క్రాఫ్టస్‌ స్పీడ్‌కు బ్రేక్‌!

19 Mar, 2018 07:39 IST|Sakshi
బీచ్‌లో సిద్ధంగా ఉన్న హోవర్‌ క్రాఫ్ట్‌లు

వెనక్కి వెళ్లిన రష్యా శిక్షకుడు

ఏప్రిల్‌ ఆఖరుకు అందుబాటులోకి వచ్చే అవకాశం

సాక్షి, విశాఖపట్నం : ఆర్కే బీచ్‌లో పర్యాటకులతో షికార్లు కొట్టేందుకు సిద్ధమైన హోవర్‌ క్రాఫ్ట్‌లు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఇలాంటి హోవర్‌ క్రాఫ్ట్‌లను ఇప్పటిదాకా అమెరికా, న్యూజిలాండ్, అస్ట్రేలియా, రష్యా, యూరప్‌ దేశాల్లో పర్యాటకుల కోసం నడుపుతున్నారు. వీటిని మన దేశంలోనే తొలిసారిగా విశాఖలో ప్రవేశపెట్టడానికి హోవర్‌ డాక్‌ అనే సంస్థ ముందుకొచ్చి పర్యాటకశాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ హోవర్‌ క్రాఫ్ట్‌లు నేలపైన, నీటిపైన కూడా సునాయాసంగా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆర్కే బీచ్‌లో తీరం నుంచి కిలోమీటరు లోపల వరకు హోవర్‌ క్రాఫ్ట్‌లు నడపడానికి అనుమతి పొందింది. దీంతో నాలుగు స్పీడ్‌ బోట్ల (హోవర్‌ క్రాఫ్ట్‌ల)ను నడపడానికి హోవర్‌ డాక్‌ సంస్థ సన్నద్ధమయింది. వీటిలో ఐదుగురు కూర్చునే వీలున్న హోవర్‌ క్రాఫ్ట్‌ రూ.1.10 కోట్లు, ఏడుగురు ప్రయాణించే సామర్థ్యం ఉన్న బోటును రూ.1.70 కోట్లు వెచ్చించింది. వీటితో పాటు మరో రెండు హోవర్‌ క్రాఫ్ట్‌లకు వెరసి రూ.6 కోట్లు వెచ్చించి రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఈ హోవర్‌ క్రాఫ్ట్‌లను నడిపే టగ్‌ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వడానికి గత నెల మొదటి వారంలో రష్యా నుంచి శిక్షకుడిని తీసుకొచ్చారు. వారం రోజుల పాటు విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని రెడ్డికంచేరు సముద్రతీరంలో ఈ ఆపరేటర్లకు ఆయన శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆయన వ్యక్తిగత పనులపై స్వదేశానికి వెళ్లిపోవడంతో వీరికి శిక్షణ నిలిచిపోయింది. మళ్లీ రష్యా నుంచి మరొక శిక్షకుడు రావలసి ఉంది. ఇందుకు మరి కొన్నాళ్ల సమయం పట్టనుంది. అందువల్ల ఆయన వచ్చే దాకా శిక్షణ పూర్తికాదు. వేసవిలో విశాఖకు ఉత్తర భారతదేశం నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో వేసవికి ముందే ఈ నెలాఖరు నుంచి ఆర్కే బీచ్‌లో ఈ హోవర్‌ క్రాఫ్ట్‌లను ప్రారంభించాలని హోవర్‌ డాక్‌ సంస్థ ప్రతినిధులు సన్నాహాలు చేశారు. కానీ రష్యా శిక్షకుడు అర్థాంతరంగా వెళ్లిపోవడంతో హోవర్‌ క్రాఫ్ట్‌ల ప్రారంభానికి బ్రేకు పడింది. త్వరలోనే రష్యా నుంచి మరో శిక్షకుడు రానున్నారని, ఆయన రాగానే శిక్షణ కొనసాగుతుందని హోవర్‌ డాక్‌ అధినేత ఆర్‌.మెహర్‌ చైతన్యవర్మ ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుత అంచనాలను బట్టి ఏప్రిల్‌ నెలాఖరు నాటికి హోవర్‌ క్రాఫ్ట్‌ల్లో షికారు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 

మరిన్ని వార్తలు