ఎంత దుర్మార్గుడు

2 Nov, 2014 02:55 IST|Sakshi
ఎంత దుర్మార్గుడు

 అతనో దుర్మార్గుడు. తనకు పుట్టింది ఆడబిడ్డని తెలసి కన్నెత్తి కూడా చూడలేదు. ఆడబిడ్డతో ఇంటికి వస్తే.. నిన్ను కూడా వదిలించుకుంటానంటూ భార్యనూ బెదిరించాడు. ఒక్కసారైనా వచ్చి తల్లీబిడ్డను చూసి వెళ్లాల్సిందిగా కోరిన అత్తమామలనూ చెడామడా తిట్టేశాడు. అయినా అతనిలోని రాక్షసత్వం తగ్గలేదు. తన ఇంట ఆడబిడ్డ పుట్టడమే అరిష్టంగా భావించిన ఆ దుర్మార్గుడు తల్లి ఒడిలో హాయిగా నిద్రిస్తున్న ఆ పసికందును ఎత్తుకెళ్లి నీళ్ల ట్యాంకులో పడేసి చంపేసిన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులోని నిందితుడు కొంగళి దిలీప్‌కుమార్‌ను ప్రొద్దుటూరు పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.     - ప్రొద్దుటూరు క్రైం
 
 ప్రొద్దుటూరులో జరిగిన ఈ ఉదంతంలో ఎన్నో కోణాలు పోలీసుల విచారణలో వెల్లడయ్యాయి. వాటి వివరాలను స్థానిక డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి శనివారం విలేకరులకు వివరించారు. విచారణలో నిందితుడు చెప్పిన వివరాలు విని పోలీసులే విస్మయం చెందారు. ప్రొద్దుటూరుకు చెందిన దిలీప్‌కుమార్ తన భార్య రేఖను జూలై 22న పరీక్ష రాసేందుకని తిరుపతికి తీసుకెళ్లాడు. అక్కడ తనకు తెలిసిన స్కానింగ్ సెంటర్‌లో ఆమెకు స్కానింగ్ చేయించాడు. పుట్టబోయేది మగపిల్లాడంటూ స్కానింగ్ నిర్వాహకులు చెప్పడంతో సంతోషంతో ప్రొద్దుటూరుకు తిరిగి వచ్చాడు.

స్కానింగ్ చేయించిన విషయం తెలుసుకున్న దిలీప్‌కుమార్ అత్త అన్నపూర్ణమ్మ ఎందుకు స్కానింగ్ చేయించారు? పుట్టేది ఆడపిల్లైనా,మగపిల్లాడైనా ఒక్కటే కదా అని చెప్పారు. అయితే ‘నాకు మగపిల్లాడే కావాలి, ఆడపిల్ల పుడితే నీ కూతుర్నైనా వదిలించుకుంటా’నంటూ  తెగేసి చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25న రేఖ ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. వెంటనే విషయాన్ని రేఖ తల్లి అన్నపూర్ణమ్మ ఫోన్ చేసి దిలీప్‌కు చెప్పగా ‘ఆడపిల్లైతే నాకొద్దు.మీరే ఉంచుకోండి’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.

కనీసం ఆస్పత్రిక వచ్చి తల్లీబిడ్డను ఒక్కసారైనా చూసి వెళ్లాల్సిందిగా ఆమె ఎంతలా బతిమలాడినా అతని మనసు కరగలేదు. మరుసటి రోజు ఆస్పత్రికి వెళ్లిన దిలీప్ భార్యను పలుకరించాడే గానీ, బిడ్డ వైపు కన్నెతి కూడా చూడలేదు. అంతటితో ఆగక ‘తిరుపతిలో స్కానింగ్ చేయించినప్పుడు ఆడపిల్ల అని చెప్పి ఉంటే అప్పుడే నీకు అబార్షన్ చేయించేవాడినని’ భార్యతో గొడవపడ్డాడు.

‘ఆడపిల్లను ఇక్కడే వదిలేసి ఇంటికి రావాలని, లేదంటే నిన్ను కూడా ఇంట్లోకి రానివ్వనంటూ భార్యను హెచ్చరించి అక్కడి నుంచి వచ్చేశాడు. ఈ క్రమంలోనే 29న ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన రేఖ ఇంటికి వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని తెలిసినప్పటి నుంచి భార్యతో కూడా సరిగా మాట్లాడలేదు. అదే రాత్రి అత్తగారింటికి వెళ్లిన దిలీప్ పాప విషయమై భార్య, అత్తామామలతో గొడవపడ్డాడు.

ఎందుకు పాపను ఇంటికి తీసుకొచ్చారంటూ అతను వారిపై మండిపడ్డాడు. అందరు నిద్రపోయాక అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పసికూనను ఎత్తుకెళ్లి నీళ్ల ట్యాంక్‌లో పడేశాడని డీఎస్పీ వివరించారు. స్థానిక శ్రీనివాసనగర్‌లోని నోకియా కేర్ వద్ద ఉన్న నిందితుడ్ని శనివారం అరెస్టు చేశామని డీఎస్పీ చెప్పారు. సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, జావిద్, జగన్నాథ్, ఏఎస్‌ఐ మునిచంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు