ఇలాగైతే ఎలా?

13 Jan, 2015 02:42 IST|Sakshi
ఇలాగైతే ఎలా?

అనంతపురం అగ్రికల్చర్ : ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక పాలసీ వల్ల వివిధ వర్గాల వారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, తీరు మారకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు హెచ్చరించారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లు, తాపీమేస్త్రీలు, ట్రాక్టర్ యజమానులు, కూలీలు, డ్రైవర్లు, హమాలీలు... ఒక్కరేంటి ఇసుకతో సంబంధం ఉన్న అందరూ సంఘటితమై సోమవారం నగర వీధుల్లో కదం తొక్కారు. నాలుగు రోజులుగా స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదురుగా రిలేదీక్షలు చేపట్టిన నిర్మాణ రంగ ఐక్య కార్యాచరణ కమిటీ సోమవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది.

పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, కార్మికులతో స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి మొదలైన ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగింది. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద నేతలు, కార్మికులు బైఠారుుంచి రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను పెట్టి స్థంభింపజేశారు. ధర్నాకు సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్, దళిత హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాకేశ్రీహరి, సీఐటీయూ నాయకులు మద్ధతు ప్రకటించి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు బోయ తిరుపాలు, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హెచ్.నదీం అమ్మద్, ప్రసాద్, రాజహంస శ్రీనివాసులు, పెద్దన్న, లోకేష్, బాబు, రామాంజినేయులు, చలమయ్య, గోపాల్, నాగరాజు తదితరులు మాట్లాడుతూ... రైతులు, పేదల ప్రభుత్వమని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇసుక  పాలసీని తెచ్చి వివిధ వర్గాల వారిని ఇబ్బందుల్లోకి నెట్టేశారని దుమ్మెత్తిపోశారు. వర్షాలు లేక పంటలు పండక, అప్పు చేసి తెచ్చుకున్న ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణా చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న పేద వర్గాలను వేధిస్తున్నారన్నారు.

సహజ వనరుగా ఇసుకకు ధర నిర్ణయించి అమ్మకానికి పెట్టడం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టడం సిగ్గు చేటన్నారు. నిర్మాణ రంగాన్ని కుదేలు చేయడానికి కంకణం కట్టుకుని పని చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో మూడు ఇసుక రీచ్‌లు గుర్తించి అక్కడ నుంచి కదిరి, రాయదుర్గం, హిందూపురం, మడకశిర లాంటి 140 కిలోమీటర్ల దూరానికి ఇసుకను తీసుకెళ్లాంటే ఖర్చు ఎక్కువ అవుతుండటంతో చిన్న వ్యక్తి మరుగుదొడ్డి కూడా కట్టుకోలేని పరిస్థితి కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

డ్వాకా సంఘాల పేరుతో అధికార పార్టీ నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమైక్యాంధ్ర ఉద్యమ స్పూర్తితో ‘అనంత’ నుంచి ఇసుక పాలసీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున రగిలిస్తామని హెచ్చరించారు. అవసరమైతే పండుగ తరువాత అస్లెంబ్లీ ముట్టడికి కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రచిస్తామని తెలిపారు.

నిర్మాణ రంగానికి చెందిన అన్ని వర్గాలు సంఘటిత ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ (ఏజేసీ) ఖాజామెహిద్ధీన్‌ను ఆందోళన చేస్తున్న వారి వద్దకు వచ్చి సమస్యలు విన్నారు. అనంతరం వినతి పత్రం స్వీకరించి ప్రభుత్వానికి పంపుతానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
 
ఇవీ డిమాండ్లు
 
ఇసుక పాలసీని వెంటనే రద్దు చేయాలి.
క్యూబిక్ మీటర్ ఇసుక రూ.625 కాకుండా రూ.75 ప్రకారం నిర్ణయించాలి.
మీ-సేవాలో చలానా కట్టే పద్ధతికి స్వస్తి పలకాలి.
జేసీబీలు, ట్రిప్పర్లు కాకుండా ట్రాక్టర్లు, కూలీలకు అవకాశం కల్పించాలి.
ట్రాక్టర్ యజమానులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి.
పోలీసుల వేధింపులు భరించలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ట్రాక్టర్ యజమాని నాగభూషణం కుటుంబాన్ని ఆదుకోవాలి.

మరిన్ని వార్తలు