ఆకలి బాధలు ఎన్నాళ్లు?

29 Nov, 2014 04:26 IST|Sakshi
ఆకలి బాధలు ఎన్నాళ్లు?

పార్వతీపురంటౌన్: మా చేతులతో పది మంది పిల్లలకు కడుపారా భోజనం వడ్డిస్తున్నామని, మేము మా కుటుంబసభ్యులం మాత్ర ఏడాదిగా ఆకలిబాధలతో బతుకులీడుస్తున్నామని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ కుక్, కమాటి, వాచ్‌మన్‌లు వాపోతున్నారు. 12 నెలలుగా జీతాలు అందకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 60 సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో 98 మంది కుక్, కమాటి, వాచ్‌మన్‌లు కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్నారు.

ప్రతి నెలా కేసలి స్వచ్ఛంద సంస్థ ద్వారా కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు పొందుతున్నారు. గత ఏడాది సమైక్యాంధ్ర ఉద్యమం కార ణంగా అప్పటి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా జీతాలకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. జీతాలకు సంబంధించి కేసలి స్వచ్ఛంద సంస్థను అడగలేక, సాంఘిక సంక్షేమ శాఖాధికారులను నిలదీయలేక ‘ముందుకు వెళ్తే నుయ్యి..వెనక్కి వస్తే గొయ్యి’ అన్న చందంగా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు 2013 అక్టోబర్ నుంచి 2014 నవంబర్ వరకు నెలకు రూ.6, 700 చొప్పున వీరికి జీతాలు రావాలి. కానీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో స్వచ్ఛంద సంస్థ చేతులెత్తేసింది. దీంతో కుక్‌లు, కమాటీ, వాచ్‌మన్‌లు కుటుంబాలను పోషించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మా కష్టాలు తీరుస్తుందని ఆశపడ్డామని, కానీ మా కష్టాలు మరింత పెరిగాయని కాంట్రాక్ట్ కార్మికులు వాపోతున్నారు.  
 
ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే..
‘సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న 98 మంది కుక్, కమాటీ, వాచ్‌మన్‌లకు ప్రభుత్వం  నిధులు మంజూరు చేయకపోవడం వల్లే జీతాలు చెల్లించలేకపోతున్నాం. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన జీతాలు వచ్చాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. జీతాల చెల్లింపు గురించి ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వానికి తెలియజేశాం.’    
 - జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఆదిత్య లక్ష్మి

మరిన్ని వార్తలు