అభివృద్ధి ఎలా

12 Aug, 2015 02:22 IST|Sakshi

జిల్లా పరిషత్‌కు ప్రభుత్వ గ్రాంట్లు తగ్గిపోతున్నాయి. అభివృద్ధిపై ఆప్రభావం పడుతోంది.  ప్రభుత్వం నుంచి తలసరి ఆదాయం గ్రాంటు తప్ప మరొకటి రావడం లేదు.  స్థానికంగా వచ్చే సీనరేజి, సర్‌చార్జి ఆదాయంపైనే జెడ్పీ ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.  వీటి ద్వారా వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోదు. ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉండడం లేదు. దీంతో  ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులపైనే ఆశలు పెట్టుకోవాల్సి వస్తోంది.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం: గతంలో కేంద్రప్రభుత్వం నుంచి బీఆర్‌జీఎఫ్ గ్రాంట్లు వచ్చేవి. ఏటా రూ.26 కోట్లు నిధులు విడుదలయ్యేవి. వాటి ద్వారా జిల్లాలో కొత్త నిర్మాణాలతో పాటు  అసంపూర్తిగా ఉండిపోయిన నిర్మాణ పనుల్ని చేసేందుకు అవకాశం ఉండేది.ఇప్పుడా   గ్రాంటు నిలిచిపోయింది. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడంతో దాని పరిధిలో గల బీఆర్‌జీఎఫ్ కూడా ఆగిపోయింది. దీంతో ఏటా రూ.26కోట్ల మేర జెడ్పీ కోల్పోవలసి వస్తోంది.
 
 ఆగిపోయిన 14వ ఆర్థిక సంఘం నిధులు
 జిల్లా పరిషత్‌కు ఆర్థిక సంఘం నిధులు కూడా భారీగా వచ్చేవి. 13వ ఆర్థిక సంఘం అమలైనంతవరకు నిధులొచ్చాయి. కానీ 14వ ఆర్థిక సంఘం వచ్చేసరికి  నిధుల విడుదలకు కేంద్రం బ్రేకులేసింది. ఏటా రూ.25నుంచి 30కోట్లు వరకు విడుదలయ్యేవి. వీటితో సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణతో పాటు సీసీ రోడ్లు, అగ్రి, ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఇతర   అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారు. అయితే, ఈసారి పంచాయతీలకు  సుమారు రూ.25కోట్లు విడుదల చేసి కేంద్రం, జెడ్పీకి  ఇప్పటికి  ఒక్క పైసా విడుదల చేయలేదు. విడుదల చేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
 
 ఇంతవరకు జెడ్పీకి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణపై జెడ్పీ సందిగ్ధంలో పడింది. ఇక, మౌలిక సదుపాయాల కల్పన, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాల పరిస్థితి అగమ్యగోచరమే.మానవ వనరుల్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాజీవ్ గాంధీ స్వశక్తి కిరణ్ అభియాన్ పథకం కింద  జెడ్పీకి సరాసరి రూ.2కోట్లు విడుదలయ్యేవి. అలాగే, మండల పరిషత్‌లకు రూ.10 లక్షల చొప్పున విడుదలయ్యేది. ఇప్పుడా పథకానికి కూడా కేంద్రం మంగళం పాడేసింది. ముఖ్యంగా శిక్షణా కార్యక్రమాలకు దోహదపడే కేంద్రాల నిర్మాణాలకు బ్రేక్ పడింది.
 
 స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులూ అనుమానమే
 స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్‌ఎఫ్‌సీ) కింద ప్రతి ఏడాది రూ.2కోట్ల వరకు నిధులొచ్చేవి. వీటిని కొత్తగా నిర్మాణాలు చేపట్టేందుకు,   పాత నిర్మాణాల నిర్వహణను వినియోగించే వారు. గత ఏడాదిగా ఎస్‌ఎఫ్‌సీ గ్రాంటు రాలేదు. దానిపై ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. దాదాపు ఆగిపోయినట్టేనని తెలుస్తోంది. దీంతో జెడ్పీకి  పాత నిర్మాణాల నిర్వహణ సమస్యగా మారనుంది.
 
 జనరల్ నిధులే ఆధారం
 నాలుగు రకాల గ్రాంట్లు నిలిచిపోవడంతో జెడ్పీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. ప్రభుత్వం నుంచి ప్రస్తుతం తలసరి ఆదాయం గ్రాంటు మాత్రమే వస్తోంది. ఒక వ్యక్తికి రూ.4 చొప్పున సుమారు రూ.93 లక్షలు వస్తోంది. సర్‌చార్జీ  ద్వారా సుమారు రూ.50 లక్షల నుంచి 70 లక్షల వరకు, సీనరేజీ ద్వారా దాదాపు రూ.కోటి వరకు వస్తోంది. ఇవన్నీ జనరల్ ఫండ్స్ కిందకొస్తాయి. ఈ ఆదాయం రూ.3 కోట్ల లోపే ఉంటుంది. ఈ మొత్తంతో జిల్లా వ్యాప్తంగా ఎంత మేర అభివృద్ధి చేయవచ్చన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీంతో అభివృద్ధికి కల్ప తరువుగా ఉపాధి హామీ పథకమే కన్పిస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ పథకమైనప్పటికీ జెడ్పీ తీర్మానం ద్వారా ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనుల్ని ప్రతిపాదిస్తుండటంతో అదే జెడ్పీ గొప్పతనంగా చెప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడా పనుల కోసమే అధికార పార్టీ నేతలు ఆరాటపడుతున్నారు. విపక్షాల పంచాయతీలకు కేటాయింపులు చేయకుండా ఏకపక్షంగా మంజూరు చేయించుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు