-

గడువు కోరడం ఎలా?

17 Jan, 2014 02:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లుపై శాసనసభ, శాసనమండలిలో చర్చకు ఇచ్చిన సమయం సరిపోలేదని భావిస్తే గడువు పొడిగించడానికి ఏం చేయాలి? సభా నాయకుడిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రపతికి లేఖ రాసినంత మాత్రాన సరిపోదని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. గడువు పొడిగింపును సభ ద్వారా కోరితేనే దానికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. విభజన సందర్భంగా పలు రాష్ట్రాలకు గతంలో రాష్ట్రపతి గడువు పొడిగించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రపతి నుంచి విభజన బిల్లులు వచ్చిన సమయంలో ఆ రాష్ట్రాల్లో శాసనసభ సమావేశాలు జరగడం లేదు.
 
  సమావేశాలు ప్రారంభమయ్యే నాటికే ఇచ్చిన గడువు పూర్తికావడంతో.. పొడిగించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేఖలు రాయగా రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని అసెంబ్లీ వర్గాలు వివరిస్తున్నాయి. ఇక్కడ ఆ పరిస్థితి లేదని, బిల్లు వచ్చిన సమయానికి ఒకరోజు ముందు నుంచే ఉభయ సభల సమావేశాలు జరుగుతున్నాయని గుర్తుచేస్తున్నాయి. పైగా బిల్లు వచ్చీరాగానే సభలో ప్రవేశపెట్టడం, చర్చ చేపట్టడం కూడా జరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో చర్చకు మరింత గడువివ్వాలని సీఎం ఒక్కరు తనకుతానుగా రాష్ట్రపతికి లేఖ రాయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, అది సీఎం వ్యక్తిగత అభిప్రాయంగా పరిగణిస్తారని ఆ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. అదనపు సమయం కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి నివేదించినప్పుడే దానికి ఫలితముంటుందని పేర్కొన్నాయి. నిబంధనల ప్రకారం దీనికి సంబంధించి సభలో నేరుగా తీర్మానం పెట్టడానికి వీలులేనందున సభా నాయకుడు ముందుగా స్పీకర్‌కు నోటీసు అందజేయాల్సి ఉంటుంది. దానిపై స్పీకర్ బీఏసీ సమావేశపరిచి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంటారు. బీఏసీ ఆమోదిస్తే సభలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. విభజన బిల్లుకు సంబంధించి ఎలాంటి అంశమైనా బీఏసీ నిర్ణయం ప్రకారమే ముందుకు వెళతానని స్పీకర్ తొలినుంచి చెబుతున్న మాటను ఈ సందర్భంగా అధికారులు గుర్తుచేస్తున్నారు.
 
 బిల్లుపై చర్చకు ఇచ్చిన గడువు సరిపోవడం లేదని, దాన్ని పొడిగించాలని రాష్ట్రపతికి ముఖ్యమంత్రి లేఖ రాయనున్నట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. బిల్లుపై గడువులోగా చర్చను పూర్తి చేసి తిరిగి రాష్ట్రపతికి పంపించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమైనప్పుడు ఆయన సభ అభిప్రాయం తీసుకుని రాష్ట్రపతికి లేఖ ఎందుకు రాస్తారని ఆయన సన్నిహితులు అంటున్నారు. వ్యక్తిగతంగా లేఖ రాయడం ద్వారా సమైక్యం కోసం ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్న అభిప్రాయం జనంలోకి వెళితే చాలని ఆయన భావిస్తున్నారని వారంటున్నారు. కిరణ్ వ్యక్తిగత స్థాయిలో లేఖ రాయడం వల్ల సమైక్యం కోసం పనిచేసినట్టు ప్రజలు భావిస్తారని, గడువు ఇవ్వనందున తానేమీ చేయలేకపోయానని ప్రచారం చేసుకోవడానికి వీలవుతుందని, మరోవైపు హైకమాండ్ ఆదేశాల మేరకు గడువులోగా చర్చను ముగించి బిల్లును తిప్పి పంపినట్టూ ఉంటుందన్న ఉద్దేశంతోనే ఆయన అలా చేస్తున్నారని వివరించారు.

మరిన్ని వార్తలు