‘జనన ధ్రువీకరణ’ పొందాలంటే!

18 Jun, 2016 03:56 IST|Sakshi
‘జనన ధ్రువీకరణ’ పొందాలంటే!

పాలకోడేరు రూరల్ : పిల్లలను పాఠశాలల్లో చేర్చాలన్నా.. కళాశాలల్లో అడ్మిషన్ కావాలన్నా.. స్కాలర్‌షిప్, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందాలన్నా.. పాస్‌పోర్టు తీసుకోవాలన్నా.. ప్రస్తుతం జనన ధ్రువీకరణ పత్రం అత్యవసరం. ఈ పత్రం ఎలా పొందాలో మనలో చాలామందికి తెలీదు. దీని గురించి పాలకోడేరు ఆర్‌ఐ ఎం.మహేశ్వరరావు వివరించారు. బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు గానీ, కుటుంబ సభ్యులుగానీ ముందు  పంచాయతీలో.. లేదా మున్సిపాలిటీలో ఆ విషయాన్ని తెలియజేయాలి. అక్కడ పుట్టిన తేదీ, సంవత్సరం నమోదు చేయించాలి.
 
* ఆ తర్వాత మనకు జనన ధ్రువీకరణ పత్రం అవసరమైనప్పుడు పంచాయతీ కార్యదర్శిని సంప్రదిస్తే  ఫారం-5పై జనన ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు.
* అదే మున్సిపాలిటీలో అయితే మీసేవా కేంద్రానికి వెళ్లి జనన ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకుని నామమాత్రపు ఫీజు చెల్లించాలి. ఆ దరఖాస్తును మీ సేవా కేంద్రం వారు మున్సిపాలిటీకి పంపిస్తారు. అక్కడ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ సేవా కేంద్రం ద్వారా ప్రింటవుట్ జనన ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు.  
* బిడ్డ పుట్టిన వెంటనే పంచాయతీలో నమోదు చేయకపోతే సంవత్సరం  లోపు స్థానిక  తహసిల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆయన పంచాయతీ కార్యదర్శి/మున్సిపల్ అధికారికి ఆదేశాలు జారీ చేసి జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేస్తారు. దీనికోసం దరఖాస్తుకు తల్లిదండ్రుల ఆధార్, రేషన్ కార్డులతోపాటు బిడ్డ పుట్టిన ఆస్పత్రి జారీ చేసిన సర్టిఫికెట్ జిరాక్సు జతచేయాలి.  
 
1989 జూన్ తర్వాత పుట్టిన వారికి..
జనన సమయంలో పంచాయతీ/మున్సిపాలిటీలో నమోదు చేయించుకోని, 1989 జూన్ తర్వాత పుట్టిన వారికి కచ్చితంగా జనన ధ్రువీకరణ పత్రం అవసరం. వారు ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాలి. వారు ఈ కింది పత్రాలు దరఖాస్తుకు జతచేయాలి.  
 
రేషన్, ఆధార్ కార్డు జిరాక్సు విద్యార్హత సర్టిఫికెట్
అభ్యర్థి సోదరుల్లో ఒకరిది మార్కుల లిస్టు
తండ్రి, తల్లి ఆధార్, రేషన్ కార్డుల జిరాక్సు,
తండ్రి గానీ తల్లి గానీ ఆఫిడవిట్ నోటరీ
మంత్రసాని అఫిడవిట్ నోటరీ లేదా ఆస్పత్రిలో
రిజిస్టర్‌చేసిన పత్రం
నానమ్మ, అమ్మమ్మ గ్రామాల్లోని పంచాయతీలో పుట్టిన తేదీ నమోదు కాని పత్రాలు (నాన్‌లెవ ల్‌బుల్)
 అమ్మమ్మ నానమ్మ ఇళ్లల్లోని కుటుంబ సభ్యులు ఆధార్, రేషన్ కార్డులు
 ఇద్దరు సాక్షుల ఆధార్,రేషన్ కార్డుల జిరాక్సులు జతచేయాలి.
 అభ్యర్థి అమ్మమ్మ గ్రామం వద్ద ఉన్న ఆర్డీవో కార్యాలయానికి మీసేవా కేంద్ర ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు రూ.135 చెల్లించాలి.
 
దరఖాస్తుపై ఆర్‌ఐ విచారణ
ఆర్డీవో ఆ దరఖాస్తును తహసిల్దార్ కార్యాలయానికి పంపిస్తారు. దీనిపై ఆర్‌ఐ సంబంధిత గ్రామానికి వెళ్లి విచారణ చేపడతారు. సాక్షులను విచారించి నివేదిక తయారు చేస్తారు. అనంతరం వీఆర్వో, ఆర్‌ఐ, తహసిల్దార్ సంతకాలు చేసి జనన ధ్రువీకరణ ఇవ్వొచ్చని ఆర్డీవో కార్యాలయానికి సిఫార్సు చేస్తారు.

ఆర్డీవో దానిని పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటూ మీ సేవా కేంద్రం ద్వారా పంచాయతీ కార్యద్శి/మున్సిపల్ అధికారికి ప్రోసిడింగ్ ఆర్డర్‌ను పంపిస్తారు. దానిని తీసుకుని అభ్యర్థి పంచాయతీ కార్యదర్శిని సంప్రదిస్తే కార్యదర్శి వెంటనే ఫారం 5 పై జనన ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. మున్సిపాలిటీల్లో ప్రింటెండ్ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవచ్చు.
 
గమనిక : 1989జూన్‌కు ముందు పుట్టిన వారికి టెన్త్‌క్లాస్ సర్టిఫికెట్, రేషన్‌కార్డు వంటివాటిల్లో నమోదైన తేదీలే జనన నిర్ధారణకు ఉపకరిస్తాయి.

మరిన్ని వార్తలు