మన బస్సు భద్రమేనా..?

12 Sep, 2018 13:56 IST|Sakshi
బొల్లాపల్లి మండలంలో వినుకొండ నుంచి పలకూరు వెళ్లే బస్సుపైకి ఎక్కిన విద్యార్థులు

‘ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. సుఖప్రదం’ అన్నది సంస్థ నినాదం. ఈ నినాదం అన్ని ఆర్టీసీ బస్సులపైనా నిత్యం కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఘాట్‌ రోడ్డులో సోమవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 57 మంది మరణించడంతో మన బస్సులు ఎంత భద్రం? అన్న ప్రశ్న జిల్లా వాసుల్లో తలెత్తింది.  

సాక్షి, గుంటూరు: జిల్లాలో ఆర్టీసీ సంస్థకు మొత్తం 1075 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వాటిలో 260 అద్దె బస్సులు. మొత్తం బస్సుల్లో 10 శాతం కాలం చెల్లినవేనని సమాచారం. ఆర్టీసీ యాజమాన్యం, అద్దె బస్సులు యజమానులు ధనార్జనే ధ్యేయంగా జిల్లాలో బస్సులను కండీషన్‌ లేకపోయినా నడుపుతున్నారు. దీంతో ఆ బస్సులు మృత్యుశకటాలను తలపిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యం, మితిమీరిన వేగం కారణంగా గతంలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. గత ఏడది డిసెంబర్‌ 27న ఫిరంగిపురం వద్ద బస్సు డ్రైవర్‌ అతివేగంగా వెళ్లి ఆటోను ఢీ కొట్టడంతో నలుగురు చిన్నారులు, ఆటో డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు విద్యార్థులు తీవ్ర గాయలపాలై నేటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నారు. గత నెల 27న సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల వద్ద బైక్‌ వెళ్తున్న ముగ్గురిని వేగంగా వచ్చిన గుంటూరు–1 డిపో బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలోబెల్లంకొండ మండలం మాచాయపాలేనికి చెందిన ముగ్గురి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయినా డ్రైవర్లు నిర్లక్ష్యం వీడటంలేదన్న విమర్శలు ఉన్నాయి.

అద్దె బస్సుల డ్రైవర్లకు అరకొర శిక్షణే!
జిల్లాలో 260 అద్దె బస్సులు ఆర్టీసీ సంస్థ తరఫున నడుస్తున్నాయి. అయితే వాటి యజమానులు ప్రైవేట్‌ వ్యక్తులనే డ్రైవర్లుగా నియమించుకుంటున్నారు. వారందరూ గతంలో లారీలు, డీసీఎంలు తదితర వాహనాలు నడిపిన వారు. ఆర్టీసీలోకి ప్రవేశించినా వారికి సరైన శిక్షణ ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రయాణికులతో వ్యవహరిం చాల్సిన తీరు, రహదారి నిబంధనలపై వారికి  అవగాహన లేకపోవడంతో ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతున్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగి పోలీసులు కేసులు నమోదు చేసినా, వ్యక్తిగతంగా, విధి నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ప్రైవేటు డ్రైవర్లు అడుగడుగునా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.

డ్రైవర్ల చేతికే టిమ్‌లు
ఆర్టీసీలో కండక్టర్‌ వ్యవస్థను రద్దు చేసే క్రమంలో డ్రైవర్ల చేతికి టికెట్లు జారీ చేసే టిమ్‌లను ఇస్తున్నారు. డ్రైవర్లు టికెట్లు ఇస్తూనే వాహనాలు నడుపుతున్నారు. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రాంభించిన కార్గో సేవలను డ్రైవర్ల నెత్తిన పెట్టడంతో వారు ఒత్తిడికి గురై ప్రమాదాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.   

బస్సుల నిర్వహణ గాలికే..
జిల్లాలో ఆర్టీసీ ఆధీనంలో నడుస్తున్న బస్సుల నిర్వహణ ఫర్వాలేదని అపిస్తున్నా, అద్దె బస్సులు మాత్రం ఆందోళన కరంగానే ఉన్నాయి. ఆ బస్సులు తరచూ బ్రేక్‌డౌన్‌ అవుతున్నాయి. అసలే సరైన శిక్షణ, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన లేని డ్రైవర్ల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకు ప్రథమ చికిత్స అందించడానికి ప్రతి బస్సులో విధిగా ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లు ఉండాలి. అయితే జిల్లాలోని చాలా బస్సుల్లో ఫస్ట్‌ ఎయిడ్, ఫైర్‌ కిట్‌లు కనిపించవు. ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ బాక్సులు ఉన్నా వాటిలో అవసరమైన మందులు కనిపించవు.

పరిమితికి మించి ప్రయాణికులు..
రాజధాని అమరావతి, సింగపూర్‌ అంటూ ఊదర గొడుతున్న ప్రభుత్వం జిల్లాలో చాలా ప్రాంతాలకు సరైన బస్సు, రోడ్డు సౌకర్యాలు లేకున్నా పట్టించుకోవడం లేదు. చాలా ప్రాంతా లకు సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు పరిమితికి మించి బస్సులు ఎక్కుతున్నారు. టాప్‌పై ఎక్కి ప్రయాణాలు చేస్తున్నారు. ఇలా బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కితే వాహనం డ్రైవర్‌ అదుపులో ఉండదు. ఇది కూడా ప్రమాదాలు జరగడానికి కారణమే. కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన ప్రమాదానికి పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఉండటమేనన్న ఆరోపణలూ ఉన్నాయి. అనుకోని ప్రమాదాన్ని ఎవరూ ఆపలేరు. నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రమాదానికి ప్రతి ఒక్కరు మూల్యం చెల్లించుకోక తప్పదు అనే విషయాన్ని కొండగట్లు ఘాట్‌రోడ్డు ప్రమాదంతో అయినా ప్రభుత్వం, ఆర్టీసీ పెద్దలు, రవాణా శాఖ అధికారులు గుర్తించుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు