బడి బ్యాగుల భారం ఇక తేలిక!

28 Nov, 2018 07:38 IST|Sakshi

ఒకటి, రెండు తరగతుల పిల్లలకు హోంవర్క్‌ ఇవ్వరాదు

పదో తరగతి పిల్లల స్కూలు బ్యాగులు బరువు ఐదు కేజీలు మించరాదు

రాష్ట్రాలకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు

విద్యాసంవత్సరం మధ్యలో ఆదేశాలతో గందరగోళంలో విద్యాశాఖ

వెన్నెముక విరిగేలా పుస్తకాల బరువు మోయలేక ఆపసోపాలు పడుతున్న బడి పిల్లలకు శుభవార్త! ఇక నుంచి అన్ని పుస్తకాలు, అంత బరువు మోయాల్సిన పనిలేదని, బరువును వెంటనే తగ్గించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. స్కూలు పిల్లల తరగతుల వారీగా ఎంతెంత బరువుండాలో మార్గదర్శకాలు రూపొందించింది. 

సాక్షి, అమరావతి/సత్తెనపల్లి: బడి పిల్లలకు పుస్తకాల బ్యాగుల బరువు భారం తగ్గనుంది. ఒకటి, రెండు తరగతుల పిల్లలకు హోంవర్క్‌ ఇవ్వరాదని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఏ తరగతి చదివే పిల్లలకు పుస్తకాల బ్యాగులు ఎంత బరువు ఉండాలో నిర్ధారిస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని స్కూల్స్‌లో నిర్ధారించిన బరువు కన్నా ఎక్కువ బరువు గల బ్యాగులను అనుమతించరాదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించింది. 

నిబంధలు బేఖాతరు
నిబంధనల ప్రకారం పుస్తకాల సంచి బరువు ఆ విద్యార్థి శరీర బరువులో పదో వంతు మాత్రమే ఉండాలి. ఈ నిబంధనలు పాటిస్తున్న పాఠశాలలు తక్కువ. ఫలితంగా వయసుకు మించిన పుస్తకాల భారాన్ని మోస్తూ సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి విద్యార్థులు నీరసించి పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాలను అనుసరించి రాష్ట్ర, జిల్లా పాఠశాల విద్యా శాఖ తప్పనిసరిగా నిబంధనలు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది.

2006 చట్టం ఏం చెబుతోంది?

  • పాఠశాల విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ 2006లోనే చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం..
  • నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు ఎలాంటి బరువులతో కూడిన పుస్తకాల సంచులను మోయకూడదు
  • పై తరగతులకు చెందిన విద్యార్థులు తమ శరీర బరువులో పుస్తకాల సంచి బరువు పది శాతానికి మించకూడాదు
  • రోజూ పాఠశాలకు తీసుకెళ్లాల్సిన పుస్తకాలపై తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు అవగాహనతో ముందుకెళ్లాలి
  • ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలను భద్రపరచడానికి ఏర్పాట్లు చేపట్టాలి. ప్రైవేటు పాఠశాలల్లో ప్రత్యేకంగా పుస్తకాలు ఉంచడానికి అరలు ఉండాలి.
  • ఇలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయని ప్రైవేటు పాఠశాలలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. రూ.3 లక్షలు అపరాధ రుసుము విధించవచ్చు. ఆదేశాలు పాటించకుంటే ఆయా పాఠశాలల గుర్తింపు రద్దు చేయవచ్చు. 


బరువు సంచితో నష్టాలు

  • పుస్తకాల సంచి భారంతో వంగి నడుస్తూ తరచూ తలెత్తి చూడడం వల్ల మెడనరాలపై భారం పడి నొప్పి వస్తుంది
  • అధిక బరువు వల్ల సంచి భుజాలపై నుంచి కిందకి లాగేటట్లు వేలాడుతోంది. దీని వల్ల భుజాల నొప్పి వస్తుంది
  • వంగి నడవడం వల్ల నడుము, దానికి కింది భాగం, వెన్నెముక దెబ్బతింటుంది
  • మోకాలి నొప్పుల వల్ల రాత్రి వేళ సరిగా నిద్రపట్టదు. నరాలు లాగేసినట్లు అనిపిస్తుంది. తిమ్మిరి వచ్చి పట్టు కోల్పోతారు. 
  • బరువు సంచి మోయడం వల్ల పిల్లలు తొందరగా అలిసి పోతారు. దీని వల్ల చదువు పై ఏకాగ్రత పెట్టలేరు.

ఆదేశాలివీ..
ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఇంటి పని (హోంవర్క్‌) ఇవ్వకూడదు. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి సూచించిన ప్రకారం ఒకటి, రెండు తరగతుల పిల్లలకు పాఠశాలల్లో సంబంధిత భాష, గణితం మాత్రమే ఉండాలి. 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు వీటితోపాటు పరిసరాల విజ్ఞానం మాత్రమే ఉండాలి. విద్యార్థులను ఎలాంటి అదనపు పుస్తకాలను తెచ్చుకోవాలని చెప్పకూడదు. ఎన్‌సీఈఆర్‌టీ నిర్ధారించిన సబ్జెక్టులను మాత్రమే మూడు నుంచి ఐదో తరగతి పిల్లలకు బోధించాలి.

కేంద్రం ఆదేశాల ప్రకారం పుస్తకాల సంచి బరువు ఇలా ఉండాలి..
తరగతి    బరువు(కిలోలు)
1-2            1.5
3-5            2.3
6 -7             4
8-9            4.5
10             5 

మరిన్ని వార్తలు