ప్రత్యేక పాలనలో.. ప్రగతి తప్పింది

25 Nov, 2014 01:10 IST|Sakshi
ప్రత్యేక పాలనలో.. ప్రగతి తప్పింది

సాక్షి ప్రతినిది, శ్రీకాకుళం:ఒకటి జిల్లా కేంద్రం, మరొకటి పారిశ్రామికంగా, విద్యాపరంగా వేగంగా విస్తరిస్తున్న పట్టణం. ఈ రెండు పట్టణాలు పాలకులు లేక అనాథల్లా మారాయి. ప్రత్యేకాధికారుల పాలనలో అభివృద్ధి కుంటపడుతోంది. స్థానికావసరాలను గుర్తించి నిధులు నిధులు రాబట్టడంలో.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణలో ప్రత్యేకాధికారులు తగిన శ్రద్ధ చూపలేకపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల ప్రణాళికలకూ అతీగతి లేకుండా పోయింది. పాలకవర్గాలు లేకపోవడాన్ని అవకాశంగా తీసుకొని అధికార టీడీపీ నాయకులు పెత్తనం చెలాయిస్తూ, అధికారులపై స్వారీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎన్నికలు జరగని శ్రీకాకుళం, రాజాం పట్టణాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుస్థితి ఇది. జిల్లాలో పలాస, ఇచ్చాపురం, శ్రీకాకుళం, ఆమదాలవలస మున్సిపాలిటీలతోపాటు రాజాం, పాలకొండ నగర పంచాయితీలు ఉన్నాయి. వీటిలో శ్రీకాకుళం, రాజాం తప్ప మిగిలిన మున్సిపాలిటీలకు ఈ ఏడాది జూన్‌లో ఎన్నికలు జరగడంతో పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. శ్రీకాకుళం పట్టణానికి మూడేళ్ల నుంచి, రాజాం పట్టణానికి 2005 నుంచి ఎన్నికలు జరగలేదు. రాష్ట్రంలో ఎన్నికలు జరగని మున్సిపాలిటీలకు నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. వచ్చే ఏడాది మార్చి వరకు ఎన్నికలు ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 రాజాంలో ఇదీ పరిస్థితి
 రాజాం ప్రాంతం 2005లో నగర పంచాయతీగా ఆవిర్భవించింది. రాజాం, సారధి మేజర్ పంచాయతీలతో పాటు కొండంపేట, కొత్తవలస, బుచ్చెంపేట, పంచాయతీలు, సంతకవిటి మండలం పొనుగుటివలస గ్రామాలను ఇందులో విలీనం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ పొనుగుటివలసతో పాటు నాలుగు మైనర్ పంచాయతీల ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో అక్కడ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి వరకూ పంచాయతీ పాలకవర్గాల ఆధీనంలో అభివృద్ధిపథాన నడిచిన ఈ పంచాయతీలన్నీ ప్రజాప్రాతినిధ్యం లేక సమస్యల్లో కూరుకుపోతున్నాయి. రాజాం నగర పంచాయతీ విస్తీర్ణం 25.76 చదరపు కిలోమీటర్లు. 20 వార్డులుగా విభజించారు. 11,158 గృహాల్లో 42,123 (2011 జనాభా లెక్కల ప్రకారం) జనాభా ఉంది. ఎన్నికైన పాలకవర్గం లేకపోవడంతో కేంద్రం నుంచి నిధులు నిలిచిపోయాయి. ప్రజాసమస్యలు పరిష్కారం కావడంలేదు. సిబ్బంది, అధికారులు కూడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో పాలన కుంటుపడింది. వివిధ హోదాల్లో మొత్తం 67 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 28 మందే అందుబాటులో ఉన్నారు.
 
 శ్రీకాకుళంలోనూ అదే వివాదం
 శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులున్నాయి. 1,33,531 జనాభా ఉన్నారు. మున్సిపాలిటీలో పెద్దపాడు పంచాయతీని విలీనం చేయాలన్న అధికారుల నిర్ణయాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. కోర్టులో కేసు వేశారు. దీంతో ఎన్నికలు నిల్చిపోయాయి. గతంలో పలువురు ప్రజా ప్రతినిధులు పెద్దపాడు గ్రామ పెద్దలతో దీనిపై చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దీనితోపాటు చాపురం, పాత్రునివలస, కిల్లిపాలెం, కాజీపేట, తోటపాలెం, కుశాలపురం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయాలని రెండేళ్ల క్రితం భావించడంతో కొంతమంది కోర్టునాశ్రయించారు. దీంతో ఎన్నికల ప్రక్రియకు కోర్టు స్టే ఇచ్చింది. గత పంచాయతీ ఎన్నికల్లో పెద్దపాడు మినహా మిగతా పంచాయతీలకు ఎన్నికలు జరిపారు. ఇప్పుడు కూడా పెద్దపాడును డీ నోటిఫై చేస్తే శ్రీకాకుళం మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపించవచ్చన్న భావన నేతల్లో కనిపిస్తోంది. మొత్తానికి ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని ఆ ప్రాంత వాసులు కోరుకుంటున్నారు. మూడు నెలల క్రితం అన్ని విభాగాల్లోనూ 100రోజుల ప్రణాళిక ప్రకారం పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే శ్రీకాకుళంలో 50 శాతం లక్ష్యం కూడా దాటలేదు. ఇలాగే మిగిలిన పలు అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. ప్రజారోగ్య విభాగానికి సంబంధించి నిధులు విడుదల చేయాలంటే కలెక్టరుకు నోట్ పెట్టి అనుమతి తీసుకోవల్సి వస్తోంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అదే మున్సిపల్ కౌన్సిల్ ఉంటే, కౌన్సిల్‌లో అనుమతితో నిధులు మంజురు చేసే అవకాశం ఉంటుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు