అంధకార తాండవం

14 May, 2016 04:21 IST|Sakshi
అంధకార తాండవం

హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లు
నేటికీ పునరుద్ధరించని వైనం జలాశయ నీటి విడుదలకు
జనరేటరే దిక్కు విధుల నిర్వహణలో అవస్థలు పడుతున్న సిబ్బంది

 
 
విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 52 వేల ఎకరాలకు సాగునీరందించే తాండవ జలాశయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో జాప్యం జరుగుతోంది. ఈ ప్రాంతంలో హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లు నేటికీ పునరుద్ధరించకపోవడం వల్ల రాత్రి వేళల్లో అంధకారం నెలకొంది.
 

 
నాతవరం : జిల్లాలో ఏకైక మేజర్ ప్రాజెక్టు నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హుద్‌హుద్ తుపాను సమయంలో దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను నేటికీ పునరుద్ధరించకపోవడం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. హుద్‌హుద్ తుపాను సమయంలో గాలులకు తాండవ జలాశయానికి విద్యుత్ సరఫరా చేసే లైన్లన్నీ ధ్వంసమయ్యాయి. అప్పటినుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో సిబ్బందవి జనరేటర్‌పై ఆధారపడాల్సి వస్తోంది.


 విద్యుత్ సరఫరా లేకుంటే..
తాండవ జలాశయం నీటికి ఆయకట్టుకు విడుదల చేయాలంటే గేట్లు ఎత్తేందుకు విద్యుత్ అవసరం. ప్రమాదస్థాయికి నీటిమట్టం చేరినప్పుడు స్పిల్‌వే దగ్గర గేట్లు ఎత్తి తాండవ నదిలోకి నీటిని విడుదల చేస్తుంటారు. ఇందుకు తప్పనిసరిగా విద్యుత్ అవసరం. హుద్‌హుద్ తరువాత తాండవ జలాశయం నిండిన పరిస్థితులు లేవు. ఈ కారణంగా విద్యుత్ ఉన్నా లేకపోయినా పెద్దగా సమస్య తలెత్తలేదు. అత్యవసర అయినప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో జనరేటరే దిక్కవుతోంది.


చీకట్లో డ్యామ్!
 తాండవ జలాశయం డ్యామ్‌పై లైట్లు వెలగకపోవడం వల్ల అంధకారం నెలకొంది. రాత్రివేళల్లో జలాశయ ప్రాంతం చీకటిమయంగా మారడంతో విధులు నిర్వహించే సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో డ్యామ్ దగ్గర నుంచి స్పిల్‌వే గేట్ల వరకు పరిస్థితిని ఎప్పడికప్పుడు సిబ్బంది పరిశీలించాలి. చుట్టూ దట్టమైన అటవీప్రాంతం, ఎటుచూసినా అంధకారం నెలకొనడంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.


అడవి జంతువులతో సమస్య
నాతవరం, గొలుగొండ, కొయ్యూరు మండలాల అటవీప్రాంతం మధ్య తాండవ జలాశయం విస్తరించి ఉంది. వేసవిలో దాహార్తి తీర్చుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి అడవి జంతువులు జలాశయం వద్దకు వస్తుంటాయి. జలాశయాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో అవి సేదతీరుతుంటాయి. వీటివల్ల సిబ్బంది ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్ సరఫరా లేక ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితి.
 
 
నిధులు సిద్ధం
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.18 లక్షలు విడుదల చేసింది. వీటిని విద్యుత్ శాఖకు చెల్లించాం. విద్యుత్ లైన్ల పునరుద్ధరణ ప్రారంభించారు. త్వరలోనే విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుంది. - చిన్నారావు, తాండవ జేఈ
 

>
మరిన్ని వార్తలు