హుదూద్ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు

12 Oct, 2014 01:15 IST|Sakshi

నేటి నుంచి 16 వరకు మోస్తరు నుంచి భారీవర్షాలు
 
హైదరాబాద్: హుదూద్ తుపాన్ ప్రభావంతో తెలంగాణలో ఆదివారం నుంచి 16వ తేదీ వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ ఇన్‌చార్జి డెరైక్టర్ సీతారాం చెప్పారు. హుదూద్ తీరం దాటిన తర్వాత దాని ప్రభావం తెలంగాణపై ఉంటుందన్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తుండడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలో వలె ఇక్కడ ఈదురుగాలులు ఉండబోవని, కాబట్టి చెట్లు కొమ్మలు విరిగిపడడం, కరెంటు స్తంభాలు కూలడం వంటివి జరగవన్నారు. ఆదివారం వేకువ జామున ఖమ్మం జిల్లాలో వర్షాలు ప్రారంభమవుతాయన్నారు. అక్కడి నుంచి వరుసగా వరంగల్, కరీంనగర్ సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తరిస్తాయన్నారు. అయితే హుదూద్ తీరం దాటాకనే పూర్తి సమాచారం వెల్లడవుతుందని పేర్కొన్నారు. రాబోయే 48 గంటల్లో హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ చిరుజల్లులు గానీ... మోస్తరు వర్షాలు కానీ పడే అవకాశం ఉంది.

ఇదిలాఉండగా, ఒక మోస్తరు వర్షాల వల్ల కంకి దశకు వచ్చిన వరి, మొక్కజొన్న పంటలకు మేలు జరుగుతుందని అంటున్నారు. అయితే భారీవర్షాలు కురిస్తే మాత్రం చివరి దశకు వచ్చిన పత్తి, వరికి నష్టం జరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆలస్యంగా వేసిన వరి సహా కూరగాయల పంటలకు ఈ తుఫాను మేలు చేకూర్చుతుందని చెబుతున్నారు. ఖరీఫ్‌లో వర్షాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో 9 జిల్లాల్లోని 352 మండలాలు వర్షాభావంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హుదూద్ ప్రభావంతో పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడితే ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి రబీలో వేయబోయే పంటలకు సాగు నీటి సమస్య లేకుండా ప్రయోజనం కలుగుతుంది.
 
 

మరిన్ని వార్తలు