‘అనంత’లో వెలుగుచూసిన డబ్బు కట్టలు

16 Feb, 2019 09:23 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు

సాక్షి, అనంతపురం: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో భారీ మొత్తంలో డబ్బు కట్టలు బయటపడటంతో కలకలం రేగింది. ఇంత డబ్బును ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి వద్ద పోలీసుల తనిఖీల్లో 1.27 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది.

డబ్బు తరలిస్తున్నవారు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో చెన్నేకొత్తపల్లి వీఆర్వో నజీర్ సహా ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నగదు తీసుకెళ్తున్నామని చెబుతూనే పొంతనలేని సమాధానాలతో చెప్పటంతో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.


పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇన్నోవా కారు

తెలంగాణ రిజిస్ట్రేషన్‌ (టీఎస్‌ 07 ఏటీ 0408)తో కొత్త ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ డబ్బు ఎవరిది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సివుంది. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంత డబ్బు పట్టుబడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు