'ఈ–పాసులకు' దరఖాస్తుల వెల్లువ

15 Apr, 2020 04:54 IST|Sakshi

జిల్లాల వారీగా పరిశీలించాకే అనుమతులు 

తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు 

సాక్షి, అమరావతి:  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖ చేపట్టిన ఈ–పాసుల జారీ ప్రక్రియకు తొలిరోజైన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. లాక్‌డౌన్‌ కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు.. అత్యవసరమైన వారు వారివారి ప్రాంతాలకు వెళ్లాలంటే పోలీసుల అనుమతిని తప్పనిసరి చేశారు. ఇందుకోసం పోలీసులు ఈ–పాసులు మంజూరు చేసేలా ప్రతి జిల్లాకు వాట్సాప్, ఈ–మెయిల్‌ అడ్రస్‌లు ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో మొదటిరోజే రాష్ట్రవ్యాప్తంగా 14 వేల దరఖాస్తులు వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. 

► భారీ సంఖ్యలోనే దరఖాస్తులు రావడంతో వాటి పరిశీలనలో పోలీసులు తలమునకలయ్యారు.  
► ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలు, వ్యాపారులు, విద్యార్థులు ఎక్కువమంది ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.  
► అలాగే, అత్యవసరం కాకపోయినా చాలామంది దరఖాస్తు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉదా.. ఒక్క కృష్ణాజిల్లాలోనే 1,150 దరఖాస్తులు రాగా వాటిలో అత్యవసర కారణాలు ఉన్నవి 90–100 మాత్రమే ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.  
► ఇలా అన్ని జిల్లాల్లో వచ్చిన వాటిని పరిశీలించి నిర్ధారించుకున్నాకే అనుమతులు మంజూరు చేస్తామని జిల్లా ఎస్పీలు చెబుతున్నారు.  
► తప్పుడు సమాచారమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 
► ఏపీ నుంచి వైద్యం వంటి అత్యవసర సేవల నిమిత్తం తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న 60 మందికి డీజీపీ కార్యాలయం మంగళవారం అనుమతిచ్చింది.  

>
మరిన్ని వార్తలు