-

హెల్ప్‌లైన్‌కు ఫోన్ల ప్రవాహం

22 Jul, 2015 09:32 IST|Sakshi
హెల్ప్‌లైన్‌కు ఫోన్ల ప్రవాహం

సాక్షి, రాజమండ్రి: పుష్కర యాత్రికుల కోసం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు ఫోన్లు వెల్లువలా వస్తున్నాయి. ప్రారంభమైన రోజు నుంచి వేలాదిమంది సమాచారం కోసం హెల్ప్‌లైన్ నెంబరు 12890కు ఫోన్ చేస్తున్నారు. నిత్యం 1800 నుంచి 2వేల కాల్స్ వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో 30 శాతం తప్పిపోయిన వారి గురించిన కాల్స్ ఉంటున్నాయి. పుష్కర, కోటిలింగాల ఘాట్‌కు ప్రతిరోజూ వచ్చే వేల కుటుంబాల్లో చాలామంది తప్పిపోతున్నారు. ఆయా కుటుంబాలకు చెందినవారు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి వారి గురించి అడుగుతున్నారు. హెల్ప్‌లైన్ సెంటర్ పుష్కర ఘాట్‌ల కంట్రోల్ రూముల నుంచి తప్పిపోయిన వారి వివరాలు సేకరించి తమకు ఫోన్లు చేస్తున్న వారికి వివరాలు అందిస్తోంది.

ఘాట్లకు వెళ్లే రూట్లు, వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రికి ఎలా రావాలి, రైళ్లు, బస్సు సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు చాలామంది హెల్ప్‌లైన్‌కు ఫోన్లు చేస్తున్నారు. దొంగతనాలు, క్యూలైన్లలో ఇబ్బందులు, ఘాట్లలో సమస్యల గురించి కాల్స్ వస్తున్నాయి. ఒక్క రోజే హెల్ప్‌లైన్‌కు 2,500 కాల్స్ వరకూ  వచ్చాయి. హెల్ప్‌లైన్ నిర్వాహకులు ఫిర్యాదులు, సమస్యలను ఆయా శాఖలకు పంపుతున్నారు. పుష్కరఘాట్ ఎదుట ఉన్న భవనంలోని సెంట్రల్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్‌కు 20 ఫోన్‌లైన్లను అనుసంధానం చేశారు. రాజమండ్రి రైజింగ్స్ పేరుతో కొందరు యువకులు నడిపే స్వచ్ఛంద సంస్థ ఈ హెల్ప్‌లైన్ సెంటర్‌ను నడుపుతోంది. ప్రభుత్వ సాయంతో ఈ సెంటర్‌ను ఈ సంస్థే నిర్వహిస్తోంది. 26 మంది వలంటీర్లు మూడు షిఫ్టులుగా 24 గంటలు పని చేస్తున్నారు.

మరిన్ని వార్తలు