నీరు– చెట్టు..  కనిపిస్తే ఒట్టు 

5 Jul, 2020 11:05 IST|Sakshi
సీతారామపురం మండలం బసినేనిపల్లిలో అవసరం లేనిచోట అరకొరగా నిర్మించిన ఫైబర్‌ చెక్‌డ్యాం

టీడీపీ హయాంలో జరిగిన నీరు–చెట్టు పనుల్లో భారీ అక్రమాలు 

ఫైబర్‌ చెక్‌ డ్యాముల్లోనూ నాణ్యత డొల్ల 

నీరు– చెట్టు అక్రమాలపై ప్రభుత్వానికి విజిలెన్స్‌ శోధన నివేదిక 

ఉపాధి హామీ అవినీతిపై విచారణ 

పనుల నాణ్యత టెస్టింగ్‌ కోసం ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్‌  

అభివృద్ధి ముసుగులో అధికారంలో ఉన్న ఐదేళ్లూ టీడీపీ భారీ దోపిడీకి తెర తీసింది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు వివిధ పథకాల పేరుతో రూ.కోట్లు దోచిపెట్టింది. అధికార అంతం వరకు అవినీతి వేట సాగించింది. ప్రధానంగా జిల్లాలో నీరు–చెట్టు పేరుతో వందల కోట్ల అవినీతికి పాల్పడింది. ఈ పనుల్లో అక్రమాలపై పెద్ద ఎత్తున దుమారం రేగినా లెక్క చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల నాణ్యతపై జిల్లాలో విజిలెన్స్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్రమాలను నిగ్గు తేలి్చంది. ఇప్పటికే నీరు–చెట్టు పనుల నాణ్యతా ప్రమాణాలపై నివేదిక ప్రభుత్వానికి పంపిన విజిలెన్స్‌ తాజాగా ఉపా«ధి హామీ పథకం పనుల నాణ్యతను తనిఖీ చేసింది. నాణ్యత పరిశీలనకు కోర్‌ ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్‌ నుంచి వచ్చే రిపోర్ట్‌ ఆధారంగా ఉపాధి పనుల అవినీతిపై కూడా  ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. 

సాక్షి, నెల్లూరు:  టీడీపీ హయాంలో జిల్లాలో నీరు– చెట్టు, ఉపాధి హామీ పథకాలు ఆ పార్టీ నేతలకు ఆదాయ వనరులుగా మారాయి. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నీరు–చెట్టు పనులను టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ద్వితీయ కేడర్‌ నేతలకు పందేరం చేసి వాటాలు పంచుకున్నారు. 2015–16 ఏడాది నుంచి ప్రారంభమైన నీరు– చెట్టు పథకం కింద జిల్లాలో 2017–18 వరకు 13,780 పనులకు రూ.711 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఇక చివరి ఏడాది 2018–19లో ఎన్నికల సమీపించడంతో అనామతుగా దాదాపు రూ.200 కోట్ల మేర పనులు హడావుడిగా చేపట్టి నిధులు ఆరగించేందుకు విఫలయత్న చేశారు. 

టీడీపీ నేతలు, జలవనరులశాఖ అధికారులు సైతం నీరు–చెట్టు అవినీతిలో భాగస్వామ్యులై నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. 
సుమారు రూ.911 కోట్ల మేర నీరు–చెట్టు పథకం కింద పనులు చేపడితే ఎక్కడా పక్కా అభివృద్ధి పనులు చేసిన దాఖాలాలు లేవు.  
చేసిన పనులు తిరిగి చూస్తే కనిపించని తాత్కాలికమైన నీటిలో కొట్టుకుపోయే మట్టి పనులు చేసి రూ.కోట్లు దిగమింగారు.  
తొలి మూడేళ్లలోనే సుమారు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు పక్కదారి పట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.  
ఇరిగేషన్, తెలుగుగంగ శాఖల్లో జరిగిన పనులతో పాటు, నెల్లూరు సెంట్రల్‌ ఇరిగేషన్‌ విభాగంలో జరిగిన పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని విజిలెన్స్‌ తనిఖీల్లో నిగ్గు తేలినట్లు సమాచారం.  
ఇక చివరిలో పనులు హడావుడిగా చేసి బిల్లులు చేసుకునే ప్రయత్నం జరిగినా.. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో బిల్లులు నిలిచిపోయాయి.   
జిల్లాలో నీరు–చెట్టు పనుల్లో జరిగిన  అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.   

ఫైబర్‌ చెక్‌ డ్యామ్‌ల్లో అవినీతి ధార 
ఉదయగిరి నియోజకవర్గంలో మహారాష్ట్ర నాగపూర్‌ టెక్నాలజీ పేరుతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, ఆయన అనుచరులు ఫైబర్‌ చెక్‌డ్యామ్‌ నిర్మాణంలో భారీ దోపిడీ చేసిన వైనం విజిలెన్స్‌ తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది.  
గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని బొల్లినేని భారీ దోపిడీకి పథకం వేసి మొత్తం 24 ప్యాకేజీల కింద 210 పైబర్‌ చెక్‌ డ్యామ్‌లను మంజూరు చేయించారు.  
ఆయా చెక్‌ డ్యామ్‌లకు దాదాపు రూ.72 కోట్లు నిధులు మంజూరు చేయించి తన అస్మదీయులకు కమీషన్ల రూపంలో పందేరం చేశారు.  
ఆయా టెండర్లను తన సూట్‌కేసు కంపెనీలైన సిగ్మా, శ్రీనివాస కంపెనీల పేరుతో టెండర్లు వేయించి పనులు కేటాయించారు.  
చెక్‌డ్యామ్‌ నిర్మాణాల్లో ఎక్కడా నాణ్యతకు చోటివ్వలేదు. ఫైబర్‌ చెక్‌డ్యామ్‌ల నాణ్యతపై పరిశీలన చేసిన విజిలెన్స్‌ అధికారులు కొంత మెటీరియల్‌ను కోర్‌ ల్యాబ్‌ పంపించారు.  
ఫెబర్‌ చెక్‌డ్యామ్‌ల్లో నాణ్యత లేదని తేలింది.   

ఉపాధి పనుల్లోనూ మేత   
జిల్లాలో మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ ప«థకం నిధులతో వివిధ శాఖల విభాగాలతో చేపట్టిన అభివృద్ధి పనులపై కూడా విజినెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు.  
అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఉపాధి నిధులను దారి మళ్లించి నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసినట్లు విజిలెన్స్‌ గుర్తించింది.  
ప్రత్యేకంగా 1 అక్టోబరు 2018 నుంచి 31 మే 2019 వరకు 9 నెలల కాలంలో జరిగిన దా దాపు రూ.100 కోట్లు విలువైన 823 పనుల నాణ్యతపై విజిలెన్స్‌ తనిఖీలు చేపట్టింది.  
తనిఖీల్లో సేకరించిన నమూనాల్లో నాణ్యత ఎంత అనే నిగ్గు తేల్చే పనిలో భాగంగా కొన్ని శాంపిల్స్‌ను కోర్‌ ల్యాబ్‌కు పంపారు.   
జిల్లాలో ఎక్కువగా వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్లాల్లో జరిగిన ఉపాధి పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. 
సీసీరోడ్లు, కల్వర్టులు, చెక్‌డ్యామ్‌లు, ఫారంఫాండ్స్, మరుగుదొడ్లు, నాడెప్‌లు, శ్మశానాల అభివృద్ధి, మొక్కలు పెంపకం, చెత్తతో సంపద సృష్టి, వర్మీకంపోస్ట్‌ తొట్టెలు, తాత్కాలిక రోడ్ల నిర్మాణం ఇలా  పలు శాఖల పనులన్నింటి పై శోధన చేసి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు.  

నమూనాలు ల్యాబ్‌కు పంపాం 
జిల్లాలో నీరు–చెట్టు పనులపై ఇప్పటికే పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. చాలా చోట్ల మెజార్టీ పనుల్లో భారీగానే అక్రమాలు జరిగాయి. ఇంతని స్పష్టంగా చెప్పలేం. ఇక ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల నమూనాలను స్వీకరించి ల్యాబ్‌కు పంపాం. ఆ ఫలితాలు వచ్చిన వెంటనే నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నాం.   
– వెంకటనాథ్‌రెడ్డి, ఓఎస్‌డీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  

మరిన్ని వార్తలు