బరి తెగింపు

6 Feb, 2015 02:29 IST|Sakshi

 అనంతపురం సెంట్రల్/ శింగనమల : ఇసుకాసురులు బరి తెగించారు. ప్రభుత్వ నిబంధనల్లో లొసుగులను ఆసరాగా చేసుకొని రూ.కోట్లు కొల్లగొట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని నయా మోసాలకు తెగబడ్డారు. అధికారుల సంతకాలను సైతం ఫోర్జరీ చేసి మరీ లూటీకిపాల్పడ్డారు. ఆలస్యంగా మేల్కొన్న ఉన్నతాధికారులు కూపీ లాగే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శింగనమల మండలం ఉల్లికల్లు రీచ్ నుంచి దాదాపు రూ. కోటి విలువైన ఇసుక దారి మళ్లిందని కలెక్టర్, డీఆర్‌డీఏ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వస్తున్నారు. ఇటీవల ఈ రీచ్‌ను కలెక్టర్ కోన శశిధర్ తనిఖీ చేశారు. అక్కడ ఉన్న పరిస్థితికి, రికార్డుల్లో ఉన్న వివరాలకు పొంతన లేకపోవడాన్ని గుర్తించారు. వెంటనే రికార్డులన్నీ తెప్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 6,848 ఆర్డర్లకు గాను 24,910 క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయించారు.
 

 ప్రభుత్వానికి రూ.1,55,05,625ల ఆదాయం సమకూరింది. అయితే..రీచ్ వద్ద పరిస్థితిని గమనిస్తే భారీగా ఇసుకను రవాణా చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 40 వేల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు చేపట్టారు. రీచ్‌లోనే కాకుండా నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా తవ్వకాలు సాగించారు. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు చాగల్లు ప్రాజెక్టుకు వదులుతున్న నీటిని మళ్లించారు. దీంతో రీచ్ ప్రాంతం చెరువును తలపిస్తోంది. పది అడుగులకు పైగా ఇసుకను తవ్వినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వస్తున్నారు. అక్రమంగా తవ్విన ఇసుకను బెంగళూరు, బళ్లారి, ఉవరకొండ, నంద్యాల, గుత్తి, గుంతకల్లు, కదిరి తదితర ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది.
 
 వెలుగులోకి నకిలీ బిల్లుల కథ
 ఇసుక అక్రమ రవాణాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నకిలీ బిల్లులు సృష్టించారు. ఓ ప్రజాప్రతినిధి తమ్ముడు, నగరంలో ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ప్రజాప్రతినిధి దగ్గర బంధువులు, ఏడుగురు టీడీపీ చోటా నాయకులు కలిసి ఇసుక దందా సాగించినట్లు సమాచారం. వీరికి వెలుగు ప్రాజెక్టు ఏరియా కో ఆర్డినేటర్, ఏపీఎంలు పూర్తి సహకారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇసుక రవాణా కోసం ప్రత్యేకంగా ‘ఫారం ఈ ట్రాన్సిట్ పాస్’ రసీదు పుస్తకాలను తయారు చేయించారు. వీటి ద్వారా రోజూ వాహనాలలో అక్రమంగా ఇసుకను నింపుకొని ఇతర ప్రాంతాలకు తరలించారు. రోజూ 30-40 లోడ్ల ఇసుకను అక్రమ రవాణా చేసినట్లు తెలుస్తోంది.

 ఇసుకాసురులు నగరంలోని ప్రధాన కూడలిలో ఉన్న టీడీపీ నాయకునికి చెందిన ఓ లాడ్జిలో మకాం వేసి వ్యవహారాన్ని నడిపారు. ఉల్లికల్లు రీచ్ వద్ద నాలుగు జేసీబీలు, 70 ట్రాక్టర్లు, 30 టిప్పర్లు పనిచేశాయి. దాదాపు సగం వాహనాల ద్వారా అక్రమ రవాణా చేశారు. రోజూ రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఆదాయాన్ని తీసుకున్నారు. రీచ్ ప్రారంభం నుంచి నెలన్నర రోజుల పాటు ఈ దందా కొనసాగింది. అలా వచ్చిన మొత్తాన్ని అందరూ సమానంగా పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు అధికారులకు కూడా వాటాలు వెళ్లినట్లు సమాచారం. కలెక్టర్‌గా కోన శశిధర్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ఇసుక వ్యాపారంపై దృష్టి సారించారు. జిల్లాలోని అన్ని రీచ్‌ల సమాచారాన్ని తెలుసుకున్నారు.
 
 ఆయన తనిఖీకి వస్తారని ముందుగానే పసిగట్టిన అక్రమార్కులు ఉల్లికల్లు రీచ్ వద్ద పనులు చేస్తున్న జేసీబీల సహాయంతో అటుగా వెళుతున్న నీటిని మళ్లించి ఆనవాళ్లు చెరిపేశారు. అయితే.. కలెక్టర్ రికార్డులు తన కార్యాలయానికి తెప్పించుకొని పరిశీలిస్తుండడంతో అక్రమార్కుల్లో వణుకు పుడుతోంది. మరీ ముఖ్యంగా వెలుగు ప్రాజెక్టు ఏరియా కోఆర్డినేటర్, ఏపీఎంలు ఇసుక అక్రమ వ్యాపారం వెనుక ఉన్న ప్రజాప్రతినిధుల చెంతకు చేరి తమను రక్షించాలంటూ వేడుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు