ఆ పీతలు ఫ్లయిటెక్కుతాయ్‌

28 Jun, 2020 04:26 IST|Sakshi

పెదవలసల పీతలకు విదేశాల్లోనూ గిరాకీ 

తాతల కాలం నుంచీ ఎగుమతి 

మూడు తరాలుగా ఊరంతా ఇదే వృత్తిలో.. 

పోషక విలువలు పుష్కలం 

ప్రతి నెలా విదేశాలకు 20 టన్నుల ఎగుమతి

తూర్పు గోదావరి జిల్లా యానాం–కాకినాడ మధ్యన ఉండే ఓ మత్స్యకార పల్లె ‘పెదవలసల’. ఆ చిన్న గ్రామం తాతల కాలం నుంచీ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. కృష్ణా, గోదావరి నదీపాయల ముఖ ద్వారాలు, కోరంగి, నాగాయలంక ప్రాంతాల్లోనూ పీతలు లభ్యమవుతున్నా.. పెదవలసల ప్రాంత పీతలకు ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే.. అక్కడి మడ అడవుల్లో దొరికే పీతలు రుచిలో మేటిగా పేరొందాయి. ఇక్కడి మండ పీతలు, పసుపు పచ్చ పీతలకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. అమెరికా, చైనా, థాయ్‌లాండ్, సింగపూర్‌ దేశాల ప్రజలు వీటిని ఇష్టంగా తింటారు. ఈ గ్రామం నుంచి ప్రతినెలా సుమారు 20 టన్నుల పీతలు విదేశాలకు విమాన యానం చేస్తున్నాయి.

పొద్దుపొడవక ముందే వేటకు.. 
► తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం చినవలసల, పెదవలసల, చినబొడ్డు వెంకటాయపాలెం, పెదబొడ్డు వెంకటాయపాలెం, గాడిమొగ, రామన్నపాలెం, పండి, పోర, కొత్తపాలెం గ్రామాల మత్స్యకారులు తరతరాలుగా పీతల వేటలో ఉన్నా.. పెదవలసల పీతలు విదేశాల్లో ప్రాచుర్యం పొందాయి. పదేళ్ల కుర్రాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకూ తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి భైరవపాలెం, భైరవలంక తదితర ప్రాంతాల్లో పీతలను వేటాడి మధ్యాహ్నానికి తిరిగొస్తారు.  
► దేశీయ బోటులో ముగ్గురు లేదా నలుగురు మత్స్యకారులు బృందంగా వెళ్లి 10 కిలోల వరకు పీతలను వేటాడతారు. కిలో రూ.250 వంతున రోజుకు సుమారు రూ.2,500 వరకు సంపాదిస్తారు. 
► సాధారణ పీతలను సమీపంలోని స్థానిక మార్కెట్లలోనే విక్రయిస్తారు. గ్రేడింగ్‌ చేసిన పీతలను వెదురు బుట్టల్లో కాకినాడ మార్కెట్‌కు తరలించి.. ఎగుమతిదారులకు విక్రయిస్తారు. 

ఆ రెండు రకాలకే డిమాండ్‌ 
► పీతలు ఆర్థోపోడా వర్గం, కష్టేసియన్‌ తరగతికి చెందినవి. వీటిలో 300 రకాలున్నా.. సవాయి, చుక్క, శిలువ, మండ, పసుపు పచ్చ, గుడ్డు పీతలు రుచిలో ప్రత్యేకమైనవి. 
► ‘సిల్లా’ జాతికి చెందిన మండ పీతలు, పసుపు పచ్చ, గుడ్డు పీతలు కేజీ వరకూ పెరుగుతాయి. గుడ్డు పీతలను కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్, బిహార్‌ తదితర రాష్ట్రాలకు రవాణా చేస్తుంటారు.  
► మండ, పసుపు పచ్చ పీతలను గ్రేడింగ్‌ చేసి వాటిలో నాణ్యమైన వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 
► వీటి ధర విదేశాల్లో కేజీ రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు పలుకుతుంది.  
► విదేశీ మార్కెట్‌కు చేరే వరకు బతికి ఉండేలా.. పీతలను గోనె సంచులు, ప్లాస్టిక్‌ బాక్సుల్లో పెడతారు. దీనివల్ల వాటికి గాలి తగిలి కనీసం వారం రోజుల వరకు బతికే ఉంటాయి. 

అమెరికా వయా చెన్నై.. కోల్‌కతా 
► పెదవలసల పరిసర ప్రాంతాల్లో లభ్యమయ్యే పీతలను  కాకినాడ ప్రాంత కొనుగోలుదారులు రైళ్లలో చెన్నై, కోల్‌కతా నగరాలకు తరలిస్తారు. 
► అక్కడ నుంచి విమానంలో అమెరికా, చైనా, సింగపూర్, థాయ్‌లాండ్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.  
► కరోనా కారణంగా ప్రస్తుతం విదేశీ ఎగుమతులకు బ్రేక్‌ పడటంతో ఒడిశా,కర్ణాటక మార్కెట్లకు తరలిస్తున్నారు. 

నల్ల జిగురు మట్టి వల్లే ఆ రుచి 
సముద్ర తీరంలో పీతలను వేటాడే ప్రాంతాలు ఇసుక, బొండు ఇసుకతో ఉంటాయి. పెదవలసల మడ అడవుల్లో మాత్రమే సముద్రం మొగ వద్ద నల్ల జిగురు మట్టి ఉంటుంది. అందుకే ఇక్కడి పీతలకు అంత రుచి ఉంటుంది. 
– పోతాబత్తుల నూకరాజు, పీతల వ్యాపారి, పెదవలసల 

పీతల్లో ఔషధ గుణాలు 
ఔషధ గుణాలు కలిగిన వృక్ష జాతులు పెరిగే కోరంగి అభయారణ్యం పరిసరాల్లోని పీతలు రుచిగా ఉంటాయి. పీతలు తినడం వల్ల శరీరానికి రాగి, పాస్ఫరస్‌ రక్తం బాగా పడుతుంది. శరీరంలో ఎముక గట్టిపడటానికి దోహదపడుతుంది. ఒమేగా–3 ఉండటంతో గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.పెద్ద వయసులో అల్జీమర్స్‌ (మతిమరుపు) లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. రక్తంలో చక్కెర నిల్వలు కూడా తగ్గుతాయి. అందుకే విదేశీయులు ఇక్కడి పీతలను అమితంగా ఇష్టపడుతున్నారు. 
– సీహెచ్‌ గోపాలకృష్ణ, మత్స్యశాఖ అధికారి, అమలాపురం 

మూడు తరాలుగా ఇదే వృత్తి 
మూడు తరాలుగా మేమంతా పీతలను నమ్ముకునే బతుకుతున్నాం. తెల్లారిగట్లే మడ అడవుల్లోకి వెళ్లి మధ్యాహ్నం తిరిగొస్తాం. మిట్టమధ్యాహ్నం వరకూ కట్టపడితే ఆరేడు వందలు వత్తాయి. ఒక్కోసారి గుడ్డు పీత కేజీ, కేజీన్నరది కూడా పడతాది.
– చక్కా సత్యనారాయణ, పెదవలసల
 

పెద్దవి దొరికితే పండగే.. 
30 ఏళ్ల నుంచి పీతలు కొని అమ్ముతున్నా. గుడ్డు పీత, పసుపు పీత కేజీ నుంచి కేజీన్నర సైజు ఉంటే విదేశీయులు తింటారు. అందుకే ఎక్కువ రేటుకు కొంటారు. అలాంటిది ఒక్కటి దొరికినా ఆ రోజు పండగే.
– కామాడి రాఘవ, పెదవలసల 

మరిన్ని వార్తలు