సర్కారు బడిలో ఇక అభివృద్ధి వెలుగులు

29 Aug, 2019 04:29 IST|Sakshi

సీఎం ఆదేశాలతో పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు

2021–22 నాటికి రూ.10,500 కోట్లతో అన్ని స్కూళ్ల రూపురేఖలు మార్పు 

మొదటి ఏడాది బడ్జెట్‌లో రూ.1500 కోట్లు కేటాయింపు 

తొలిదశలో పంచాయతీకొక యూపీ, ప్రైమరీ స్కూళ్లు ఎంపిక 

మండలానికి ఒకటి లేదా రెండు హైస్కూళ్లు ఎంపిక

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడానికి రాష్ట్ర సర్కారు నడుం బిగించింది. పాఠశాలల్లో ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొట్టమొదటి సమీక్షను విద్యా శాఖపైనే నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను రెండేళ్లలో మార్చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పాఠశాలల ప్రస్తుత స్థితిని ఫొటోలు తీయించి.. వాటి రూపురేఖలు మార్చాక మళ్లీ ఫొటోలు తీయించి ప్రజల ముందు ఉంచనున్నారు.

ఇందులో భాగంగా దాదాపు 44,510 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10.88 లక్షల ఫొటోలను తీయించారు. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో ఉన్న సదుపాయాలు, అక్కడ నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2021–22 నాటికి ప్రభుత్వ స్కూళ్లను అన్ని హంగులతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకు బడ్జెట్‌లో రూ.10,500 కోట్లు కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశకింద దాదాపు 16,750 స్కూళ్లను అభివృద్ధి చేయడానికి సర్వశిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు రూ.2,250 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది (2019–20) పనులకోసం బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించారు. 

పంచాయతీకొక స్కూల్‌ తప్పనిసరిగా ఎంపిక  
స్కూల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కింద ప్రత్యేక యాప్‌ ద్వారా ఆయా స్కూళ్ల ఫొటోలను, సమగ్ర సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ తెప్పించింది. తక్షణం మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉన్న పాఠశాలలను గుర్తించనున్నారు. పంచాయతీకి ఒకటి చొప్పున ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లను ఎంపిక చేస్తున్నారు. మండలానికి ఒకటి లేదా రెండు చొప్పున హైస్కూళ్లను గుర్తించి అభివృద్ధి చేస్తారు. మొదటి దశ కింద అభివృద్ధి 12,918 ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లు, 3,832 హైస్కూళ్లను గుర్తించారు. ఇవికాకుండా 6,010 హైస్కూళ్లలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద ప్రహరీల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. 


బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు  
ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు 2019–20 బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించారు. ఇక 2020–21 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులకు రూ.4,000 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలోనే చేపట్టి అర్ధంతరంగా నిలిచిపోయిన వాటిని పూర్తిచేయడానికి రూ.750 కోట్లు, కొత్తగా చేపట్టాల్సిన పనులకు రూ.3,250 కోట్లు కావాలని అంచనా వేశారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులతో పాఠశాలలకు అవసరమైన అదనపు తరగతి గదులను సమకూర్చనున్నారు.
 

>
మరిన్ని వార్తలు