శ్రీగిరి.. భక్తుల సందడి

30 Oct, 2017 11:49 IST|Sakshi

శ్రీశైలం: కార్తీ్తకమాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని ఆదివారం నుంచి శ్రీశైలంలో భక్తుల సందడి కనిపించింది. ఆంధ్రా, తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో క్షేత్ర పరిసరాలు కిక్కిరిసిపోయాయి.  ఆదివారం ఉదయానికి భక్తుల సంఖ్య లక్షకు పైగా చేరుకోవడంతో ఉచిత, ప్రత్యేక, దర్శన క్యూలలో విపరీతమైన రద్దీ కనిపించింది. దీంతో ఈఓ భరత్‌గుప్త ఆలయపూజావేళల్లో మార్పులు చేశారు.

వేకువజామున 2.30గంటలకు మంగళవాయిద్యాలు, 3గంటలకు సుప్రభాతం, 4గంటలకు మహామంగళహారతి, 4.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. అభిషేక సేవాకర్తలను మాత్రం నిర్ణీత సమయంలో గర్భాలయంలోకి అనుమతించారు. మల్లన్నను అభిషేకించుకొని స్పర్శ దర్శనం చేసుకోవడానికి వందల సంఖ్యలో భక్తులు ఆన్‌లైన్, కరెంట్‌ , ముందస్తు టిక్కెట్లను కొనుగోలు చేయడంతో 900కు పైగా అభిషేకాలు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి.  

నేడు పుష్కరిణి హారతి, లక్షదీపోత్సవం
కార్తీక మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు పుష్కరిణి హారతితో పాటు లక్ష దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటుకు ఈఓ భరత్‌ గుప్తా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 6.30గంటల నుంచి స్వామిఅమ్మవార్లకు పుష్కరిణి హారతులు నిర్వహిస్తారు. ముందుగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి ప్రత్యేక వేదికపై వేంచేయింపజేసి విశేషపూజలు నిర్వహిస్తారు. అలాగే లోక కల్యాణార్థం పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం ఏర్పాటు చేశారు. ఉత్సవంలో భక్తులందరూ పాల్గొనే అకాశం కల్పించారు.

∙మల్లన్న దర్శనం కోసం నిరీక్షణ ..
శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను ఉచిత దర్శన క్యూల ద్వారా దర్శించుకోవడానికి  సుమారు 4 గంటల సమయం పట్టగా ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. గంటల తరబడి నిరీక్షించే భక్తులకు క్యూలోనే ప్రసాద వితరణ చేశారు.  మంచినీరు, పిల్లలు, వృద్ధులకు బిస్కెట్లు, సాంబారన్నం అందించారు. దర్శనానంతరం అన్నపూర్ణభవన్‌లో భోజన ప్రసాదం వడ్డించారు. 

మరిన్ని వార్తలు