ఐదేళ్లుగా ‘కోతలే’

28 May, 2019 03:57 IST|Sakshi

వ్యవసాయ విద్యుత్‌ డిమాండ్, సరఫరా మధ్య భారీ వ్యత్యాసం

బోరు బావులకు తొమ్మిది గంటల సరఫరా అంటూ ప్రచారం

ఇచ్చింది నాలుగు గంటలే   ఐదేళ్ల టీడీపీ సర్కార్‌ ఘనత ఇదీ

సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్‌ను తెలుగుదేశం సర్కార్‌ ఐదేళ్లూ ప్రచారాస్త్రంగానే వాడుకుంది. ఎప్పటికప్పుడు కోత వేస్తూ.. సరఫరాను 7 నుంచి 9 గంటలకు పెంచినట్టు ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. అధికారిక గణాంకాలు పరిశీలిస్తే.. టీడీపీ ప్రభుత్వం చెప్పినవన్నీ అవాస్తవాలేనని స్పష్టమవుతోంది. రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌లో వ్యవసాయ రంగానికి సరఫరా చేసినది 2014లో 28 శాతం ఉంటే, 2018–19 నాటికి అది 25 శాతానికి తగ్గింది. వ్యవసాయ పంపుసెట్లకు ఏటా భారీ సంఖ్యలో రైతుల నుంచి దరఖాస్తులు వచ్చినా ప్రభుత్వం అరకొరగా మంజూరు చేసింది. వ్యవసాయ విద్యుత్‌ డిమాండ్, సరఫరా మధ్య భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పంపుసెట్లన్నీ ఐదు అశ్వసామర్థ్యం (5 హెచ్‌పీ) కలిగినవే. ఒక్కో పంపుసెట్టు రోజుకు 7 గంటలు నడిపితే 35 యూనిట్ల విద్యుత్‌ కావాలి. ప్రస్తుతం ఉన్న 18.02 లక్షల పంపుసెట్లకు ఏటా 23,020 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం ఉంది.

డిస్కమ్‌లు ఇస్తున్న విద్యుత్‌ కేవలం 13,480 మిలియన్‌ యూనిట్లు మాత్రమే. దాదాపు 10 వేల మిలియన్‌ యూనిట్ల మేర తక్కువ సరఫరా అవుతోంది. అంటే, రోజుకు 4 గంటలకు మించి వ్యవసాయ విద్యుత్‌ ఇవ్వడం లేదనేది సుస్పష్టం. వాస్తవానికి రాష్ట్రంలో గడచిన ఐదేళ్లలో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్‌ విద్యుత్‌ కొనుగోళ్లు జరిగాయి. ఏడాదికి సగటున 15 వేల మిలియన్‌ యూనిట్ల కొనుగోలు చేసినట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏటా 10 వేల మిలియన్‌ యూనిట్ల మిగులు ఉన్నట్టు టీడీపీ ప్రభుత్వం చెప్పుకుంది. అయినప్పటికీ వ్యవసాయ విద్యుత్‌కు కత్తెర తప్పలేదు. ఈ రంగానికి ఇచ్చే విద్యుత్‌ భారాన్ని డిస్కమ్‌లకు ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌ భారాన్ని ఎలా తప్పించుకోవాలా అనే ఆలోచించింది. దీని పర్యవసానమే విద్యుత్‌ రంగానికి ఐదేళ్లుగా భారీ కోతలు తప్పలేదు. ఎన్నికల సమయంలో రోజుకు 9 గంటల విద్యుత్‌ ఇస్తున్నట్టు ప్రకటించిన టీడీపీ సర్కార్, అదనంగా విద్యుత్‌ రంగానికి ఒక్కపైసా ఇవ్వలేదు.

మరిన్ని వార్తలు