గాజువాక శ్రీకన్య కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

18 Sep, 2018 05:40 IST|Sakshi
గాజువాక శ్రీకన్య సినీ కాంప్లెక్స్‌లో మంటలు

  రెండు థియేటర్లు దగ్ధం

  రూ.కోట్లలో ఆస్తి నష్టం 

  షార్ట్‌ సర్క్యూట్‌ వల్లేనని నిర్ధారణ 

గాజువాక(విశాఖ): విశాఖ జిల్లా గాజువాకలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెయిన్‌రోడ్‌లోని శ్రీకన్య కాంప్లెక్స్‌లోని శ్రీకన్య, శ్రీకన్య హెవెన్‌ థియేటర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో రెండు, మూడు అంతస్తులు దగ్ధమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని థియేటర్‌ యాజమాన్యం, పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో థియేటర్ల నుంచి పొగలు వస్తున్నట్టు స్వీపర్‌ చిట్టెమ్మ నుంచి సమాచారం అందుకున్న మేనేజర్‌ రమణబాబు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికే రెండు థియేటర్లలోని ప్రొజెక్టర్లు, తెర (స్క్రీన్‌)లు, కుర్చీలు, ఏసీ యూనిట్లు, ఫర్నిచర్‌ కాలి బూడిదయ్యాయి. థియేటర్‌పైనున్న సెల్‌ టవర్లు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. గాజువాక, పారిశ్రామిక ప్రాంత పరిధిలోని పెదగంట్యాడ, గాజువాక ఆటోనగర్‌ అగ్నిమాపక శకటాలతోపాటు, హెచ్‌పీసీఎల్, షిప్‌యార్డు, కోరమాండల్, స్టీల్‌ప్లాంట్‌ తదితర పరిశ్రమలకు చెందిన అగ్నిమాపక శకటాలతో రెండు గంటలపాటు శ్రమించి మంటలను విస్తరించకుండా నిలువరించారు. ఘటనలో సుమారు మూడు కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు థియేటర్‌ మేనేజర్‌ పోలీసులకు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే డీసీపీ ఫకీరప్ప, సౌత్‌ ఇన్‌చార్జి ఏసీపీ రంగరాజు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

మరిన్ని వార్తలు