ఉధృతంగా గోదావరి

10 Sep, 2019 05:15 IST|Sakshi
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నంలో వరద నీటితో మునిగిపోయిన ఓ వీధి

భద్రాచలం, ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

గోదావరి జిల్లాల్లో తీర గ్రామాలను చుట్టుముట్టిన వరద 

సహాయక చర్యల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బృందాలు

కృష్ణానదిలో పెరిగిన వరద ఉధృతి

శ్రీశైలం, సాగర్, పులిచింతల,ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత

కొనసాగుతున్న వంశధార వరద ప్రవాహం

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరుల నుంచి వస్తున్న వరద నీటితో ఇంకా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం భద్రాచలం వద్ద 51.2 అడుగులకు చేరిన నీటి మట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టి సోమవారం సాయంత్రానికి 48.50 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద రాత్రి ఏడు గంటలకు 15.20 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. భద్రాచలం, ధవళేశ్వరంల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నానికి ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే అవకాశం ఉందని, అప్పటి వరకూ వరద పరిస్థితి కొనసాగుతుందని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద నుంచి 14,81,674 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ గోదావరి జలాలు 2,479 టీఎంసీలు కడలి పాలయ్యాయి. సోమవారం 128 టీఎంసీలు సముద్రంలో కలసిపోయాయి. 

ముమ్మరంగా సహాయక చర్యలు
తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం, కోనసీమ లంక గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో వేలేరుపాడు, కుకునూరు, వీఆర్‌పురం మండలాలు వరద నీటిలో ఉన్నాయి. ఆ జిల్లాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. వీరవరంలో రెండు, చింతూరులో ఒకటి, రాజమహేంద్రవరంలో ఒకటి మొత్తం నాలుగు బృందాలతో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సహాయక చర్యలు చేపట్టింది. రంపచోడవరం కేంద్రంగా 30 మంది సిబ్బందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం, 90 మంది సిబ్బందితో కూడిన అగ్నిమాపక శాఖ విభాగం వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ సీజన్‌లో మూడోసారి వరదలతో ఉభయ గోదావరి జిల్లావాసులకు కంటిపై కునుకులేకుండా పోతోంది. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ కారణంగా దేవీపట్నం పరిసర గ్రామాలను వరద ముంచేసింది. దేవీపట్నం పరిసర 36 గ్రామాలు ఇప్పటికీ వరద ముంపులోనే ఉన్నాయి. 

నీట మునిగిన దేవీపట్నం
దేవీపట్నం ప్రధాన రహదారి నీట మునిగింది. చినరమణయ్యపేట–దేవీపట్నం, దండంగి–పురుషోత్తపట్నం రోడ్లు ముంపులో ఉండటంతో పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. పోసమ్మగండి వద్ద అమ్మవారి విగ్రహం నీట మునిగింది. దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో 1200 ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల్లో 22 పాఠశాలలు మూతపడ్డాయి. బాధితులకు ప్రభుత్వ సిబ్బంది భోజనాలు పంపిణీ చేశారు. మూలపాడు, అగ్రహారం, పెనికలపాడు, కచ్చులూరు, ఏనుగులగూడెం, గానుగులగొంది తదితర గ్రామాల గిరిజనులు కొండలపై తలదాచుకున్నారు. చింతూరు వద్ద శబరి నదికి గోదావరి బ్యాక్‌ వాటర్‌తో చింతూరు–వీఆర్‌ పురం, ఆంధ్రా–ఒడిశాల మధ్య రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాల్లో 17 గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. కూనవరం–భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం దిగువున కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 2,500 ఎకరాల లంక భూముల్లో పంటలు దెబ్బతిన్నాయి.

ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ
ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. వరద ఉధృతి పెరగడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉప నదులైన భీమా, తుంగభద్ర పరవళ్లు తొక్కుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.34 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 884.60 అడుగులకు చేరుకుంది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 2.17 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. సోమవారం రాత్రి సాగర్‌ రెండు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 587.90 అడుగుల్లో 306.04 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి 47 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.  ప్రకాశం బ్యారేజీలో 20 గేట్లు తెరిచి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ ప్రకాశం బ్యారేజీ నుంచి 308.71 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. మంగళవారానికి ప్రకాశం బ్యారేజీ వద్దకు 1.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. 

స్థిరంగా వంశధార..
ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో వంశధార నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 30,975 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో వరదను సముద్రంలోకి వదులుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ గొట్టా బ్యారేజీ నుంచి 53.31 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. తోటపల్లి ప్రాజెక్టులోకి నాగావళి వరద ప్రవాహం కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు