సచివాలయాల్లోనూ సూపర్‌ ‘రివర్స్‌’

26 Oct, 2019 03:07 IST|Sakshi

రివర్స్‌ టెండరింగ్‌తో భారీగా ప్రజాధనం ఆదా

గ్రామ, వార్డు సచివాలయ పరికరాల కొనుగోళ్లలో పూర్తి పారదర్శకత   

డెస్‌్కటాప్‌ కంప్యూటర్లు,యూపీఎస్‌లు, ప్రింటర్ల కొనుగోళ్లలో  రూ.65.47 కోట్ల మిగులు  

‘రివర్స్‌’తో ప్రభుత్వానికి ఇప్పటిదాకా  రూ.1,179.56 కోట్లు ఆదా

సాక్షి, అమరావతి: అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజాధనాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు అవసరమైన డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, యూపీఎస్‌ సిస్టమ్స్, ప్రింటర్ల కొనుగోళ్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ చేపట్టింది. డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, యూపీఎస్‌ సిస్టమ్స్, ప్రింటర్లకు వేర్వేరుగా ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లలో ఎల్‌–1, ఎల్‌–2, ఎల్‌–3గా నిలిచిన సంస్థలతో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. దీంతో మొత్తం రూ.65.47 కోట్ల ప్రజాధనం ఆదా కావడం గమనార్హం. 

డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, యూపీఎస్‌ సిస్టమ్స్‌ కొనుగోళ్లలో.. 
రాష్ట్రంలోని 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలకు అవసరమైన 29,888 డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, 14,944 యూపీఎస్‌ సిస్టమ్స్‌ కొనుగోలుకు ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లను ఆహ్వానించారు. ఒక సంస్థ రూ.191.10 కోట్లు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచింది. మరో సంస్థ రూ.235.58 కోట్లు కోట్‌ చేసి ఎల్‌–2గా, ఇంకో సంస్థ రూ.326.58 కోట్లు కోట్‌ చేసి ఎల్‌–3గా నిలిచాయి. ఈ మూడు సంస్థలతో రివర్స్‌ టెండరింగ్‌ను నిర్వహించారు. ఎల్‌–1గా నిలిచిన సంస్థ కోట్‌ చేసిన ధర రూ.191.10 కోట్ల కంటే ఇంకా తక్కువ ధరకు వచ్చేందుకు రివర్స్‌ టెండరింగ్‌ను చేపట్టారు. ఇందులో తొలుత ఎల్‌–2గా నిలిచిన సంస్థ రూ.139.95 కోట్లు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచింది. అంటే  డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, యూపీఎస్‌ సిస్టమ్స్‌ కొనుగోళ్లలో రివర్స్‌ టెండరింగ్‌ వల్ల రూ.51.15 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది. 26.77 శాతం తక్కువ ధరకే ఆయా పరికరాలు గ్రామ, వార్డు సచివాలయాలకు అందనున్నాయి. 

ప్రింటర్ల కొనుగోళ్లలో.. 
గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,944 ప్రింటర్ల కొనుగోళ్ల కోసం తొలుత ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ టెండర్లు పిలిచింది. ఒక సంస్థ రూ.38.92 కోట్లు కోట్‌ చేసి ఎల్‌–1గా, మరో సంస్థ రూ.47.12 కోట్లు కోట్‌ చేసి ఎల్‌–2గా నిలిచాయి. ఎల్‌–1 కోట్‌ చేసిన రూ.38.92 కోట్ల కంటే తక్కువ ధరకు వచ్చేందుకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా, తొలి టెండర్‌లో ఎల్‌–2గా నిలిచిన సంస్థ కేవలం రూ.24.60 కోట్లు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచింది. తద్వారా రూ.14.32 కోట్ల నిధులు ఆదా అయ్యాయి. 36.80 శాతం తక్కువ ధరకే ప్రింటర్లు లభిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు