‘స్పందన’ కార్యక్రమానికి భారీ స్పందన

1 Jul, 2019 13:04 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో స్పందన పేరుతో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌ కార్యక్రమం సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల వారీగా విశేష స్పందన వస్తోంది. భారీ సంఖ్యలో తరలివస్తున్న ఫిర్యాదుదారులు అధికారులకు తమ గోడును విన్నవించుకుంటున్నారు. జిల్లాల వారీగా అన్ని కలెక్టరేట్లలోని గ్రీవెన్స్‌ హాల్లలో ప్రత్యేకంగా ప్రజల కోసం కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. అర్జీదారులను కూర్చోబెట్టి ఆయా శాఖల అధికారుల ఎదుట తక్షణమే సమస్యలను పరిష్కరిస్తున్నారు.

పశ్చిమ గోదావరి :  జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాలలో స్పందన కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ ముత్యాలరాజు, జేసీ వేణుగోపాలరెడ్డిలు ఏలూరు జిల్లా కలెక్టరేట్లో ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అప్పటికప్పుడే సమస్యల పరిష్కారానికి ఆయా శాఖాధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నారు. సమయానికి హాజరుకాని అధికారులను సమావేశ మందిరం లోపలికి అనుమతించటంలేదు. జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు అన్ని పోలీస్ సబ్ డివిజినల్, సర్కిల్ కార్యాలయాలలో స్పందన కార్యక్రమం ప్రారంభమైంది. ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.

నెల్లూరు : జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాలలో స్పందన గ్రీవెన్స్ కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ శేషగిరి బాబు.. కలెక్టరేట్లో స్పందన తొలి రోజు నాడు ప్రజల వద్ద అర్జీలు స్వీకరిస్తూ వారి సమస్యలను వింటున్నారు. అప్పటికప్పడే సమస్యల పరిష్కారానికి ఆయా శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో ట్రై సైకిల్ కోసం వచ్చిన మోహన్‌ అనే వ్యక్తికి అధికారులు ట్రై సైకిల్ మంజూరు చేశారు.

గుంటూరు :  పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో ఈ ఉదయం ప్రారంభమైన "స్పందన " కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ప్రజలు భారీగా తరలివచ్చి అధికారులకు తమ గోడును విన్నవించుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కిలారి రోశయ్య హాజరయ్యారు. బాపట్ల మండలం స్టువర్ట్ పురం, వెదుళ్లపల్లి, మురగొంటుపాడు గ్రామ సభలలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రజల వినతులను పరిశీలించారు.

కర్నూలు : జిల్లా ఎస్సీ డాక్టర్ పక్కీరప్ప.. స్పందన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్ సెల్ నిర్వహించారు. ఫ్రెండ్లీ పోలీసులుగా మెలుగుతూ తమకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని ఎస్పీ పక్కిరప్ప తెలిపారు.

విజయవాడ : ఈ ఉదయం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం ప్రారంభమైంది. సీపీ ద్వారకా తిరుమలరావుతో సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారీగా హాజరైన ప్రజలు వివిధ సమస్యలపై సీపీని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఆయా సమస్యలపై నిర్ణీత తేదీల్లోగా చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు