ఏపీ: ఖజానాకు భారీ ఆదాయం

13 Jun, 2020 10:09 IST|Sakshi

గ్రీన్‌కో గ్రూప్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌ల పునఃసమీక్ష ద్వారా రూ.3,625 కోట్ల అదనపు లబ్ధి

పాత ప్రాజెక్ట్‌లతోనే అద్భుతాలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

 భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్ట్‌లో రూ.1,500 కోట్ల మిగులు

రివర్స్‌ టెండరింగ్‌తో ఇప్పటికే రూ.2,072.29 కోట్లు ఆదా

ఆ నిధులతో సంక్షేమ, అభివృద్ధి పథకాలు 

సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం వెల్లడి  

సాక్షి, అమరావతి: ఉన్న వనరులతో రాష్ట్రానికి మరింత మేలు చేకూర్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృఢ సంకల్పం అద్భుత ఫలితాలిస్తోందని సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం పేర్కొన్నారు. ‘రౌతు సరైనోడైతే గుర్రం దౌడు తీస్తుంది. పాలకుడు సరైనోడైతే పాలన పరుగులు పెడుతుంది’ అన్నది రాష్ట్రంలో నిజమవుతోందని చెప్పారు. వెలగపూడిలోని సచివాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో అజేయకల్లం మాట్లాడుతూ సమర్థతకు సరికొత్త  నిర్వచనంగా సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. (త్వరలో సీఎం జగన్‌ పల్లె బాట)

గ్రీన్‌కోతో సంప్రదింపుల ద్వారా..
గ్రీన్‌కో గ్రూప్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌పై సంప్రదింపుల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయాన్ని సమకూర్చారు. భూమి ధర పెంపు వల్ల దాదాపు రూ.250 కోట్లు, గ్రీన్‌ ఎనర్జీ అభివృద్ధి చార్జీ విధింపు వల్ల రూ.3,375 కోట్లు కలిపి మొత్తంగా రూ.3,625 కోట్లు రాష్ట్రానికి అదనంగా లబ్ధి చేకూరనున్నది.
టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.
సౌర, పవన విద్యుత్‌తో కలిపి జల విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్‌ ఇది.  1,000 మెగావాట్ల సౌర విద్యుత్, 550 మెగావాట్ల పవన విద్యుత్, 1,680 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. 
టీడీపీ ప్రభుత్వం ఎకరాకు రూ.2.50 లక్షల చొప్పున గ్రీన్‌కో గ్రూప్‌నకు 4,600 ఎకరాల భూమిని కేటాయించింది.  సీఎం వైఎస్‌ జగన్‌ పునఃసమీక్ష జరపగా.. ఎకరాకు రూ.5 లక్షలు చెల్లించేందుకు ఆ సంస్థ సమ్మతించింది.  
ఇక గ్రీన్‌ ఎనర్జీ అభివృద్ధి చార్జీ కింద.. ఉత్పత్తి చేసే ప్రతి మెగావాట్‌కు 25 ఏళ్ల పాటు రూ.లక్ష చొప్పున చెల్లించేందుకు గ్రీన్‌కో సంస్థ సమ్మతించింది. దాంతో ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.31 కోట్లు ఆదాయం వస్తుంది. 
25 ఏళ్ల తరువాత ప్రాజెక్ట్‌ కొనసాగినంత కాలం మెగావాట్‌కు రూ.2లక్షల చొప్పున చెల్లించేందుకు గ్రీన్‌కో అంగీకరించింది. 
హైడ్రో ప్రాజెక్ట్‌ల జీవిత కాలం వందేళ్లు అని నిపుణుల అంచనా. ఆ ప్రకారం గ్రీన్‌ ఎనర్జీ అభివృద్ధి చార్జి ద్వారా ప్రాజెక్ట్‌ జీవిత కాలంలో   రూ.3,375 కోట్ల ఆదాయం వస్తుంది. 
ఈ ప్రాజెక్ట్‌పై గ్రీన్‌ కో గ్రూప్‌తో కేవలం సంప్రదింపులు జరపడం ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మొత్తమ్మీద రూ.3,625 కోట్ల ఆదాయాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చి నట్టయింది.
గ్రీన్‌కో గ్రూప్‌ ప్రపంచంలో రెండో అతిపెద్ద సావెరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌ మద్దతు గల సంస్థ. 
అందులో సింగపూర్‌ ప్రభుత్వ పెట్టుబడుల కార్పొరేషన్, అబుదాబి పెట్టుబడుల అథారిటీలు భాగస్వామిగా ఉన్న అతిపెద్ద పునరుత్పాదక విద్యుత్‌ కంపెనీ.  

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్ట్‌
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్ట్‌ నిర్మించేందుకు జీఎంఆర్‌ గ్రూప్‌తో గతంలో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఇందుకోసం 2,700 ఎకరాల భూమిని కేటాయించింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై జీఎంఆర్‌ సంస్థతో 
సంప్రదింపులు జరిపింది. 
విమానాశ్రయం నిర్మాణాన్ని 2,200 ఎకరాలను పరిమితం చేసింది. దాంతో ప్రభుత్వానికి 500 ఎకరాల భూమి మిగిలింది. ఆ భూమి విలువ రూ.1,500 కోట్లు. తద్వారా ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఆదా  చేసింది. 

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.2,072.29కోట్లు ఆదా
టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన వివిధ ప్రాజెక్ట్‌లపై రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.2,072.29 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. 
నీటి పారుదల రంగంలో ప్రాజెక్ట్‌ల రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.1,130.18కోట్లు, పంచాయతీరాజ్‌ ప్రాజెక్ట్‌ల రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.200 కోట్లు, ఏపీ టిడ్కో ప్రాజెక్ట్‌ల్లో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.361కోట్లు, జెన్‌కో ప్రాజెక్ట్‌ల్లో రూ.190 కోట్లు, విద్యా శాఖలో రూ.181.29 కోట్లు.. ఇలా రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా భారీగా ప్రజాధనాన్ని ఆదా చేయడం సీఎం వైఎస్‌ జగన్‌ సమర్థతకు నిదర్శనం.
టెండర్లలో పారదర్శకత కోసం జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ ఏర్పాటు చేశారు. విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో టెండర్లను పరిశీలించి అనుమతులు ఇస్తున్నారు.
అలా ఆదా చేసిన ప్రజాధనంతో రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా, పింఛన్లు తదితర పథకాల నిధులన్నీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో అనుకున్న సమయానికి పడుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో సంక్షేమ పథకాలను సమగ్రంగా అమలు చేస్తున్నారు. 
విలేకరుల సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, సమాచార, పౌర సంబంధాల కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు