ముక్కోటి ఏకాదశి.. భక్తకోటి పరవశించి!

7 Jan, 2020 05:04 IST|Sakshi
సోమవారం తిరుమలలో స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు

ఉత్తర ద్వార దర్శనంతో కిక్కిరిసిన ఆలయాలు

స్వర్ణరథంపై తిరుమలేశుని విహారం

సామాన్యులకు పెద్దపీట వేసిన టీటీడీ

తిరుమల/ సింహాచలం (విశాఖపట్నం)/ శ్రీశైలం(కర్నూలు)/ కదిరి(అనంతపురం)/ నెల్లిమర్ల రూరల్‌ (విజయనగరం)/ మంగళగిరి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని భక్తకోటి పరవశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తుల కోలాహలం మొదలైంది. తిరుమలలో వైకుంఠ మహాద్వార దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమాడ వీధుల్లో, నారాయణగిరి తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేనివిధంగా క్యూల్లోనూ, తాత్కాలిక షెడ్లలోనూ చలి తీవ్రత తట్టుకొనేందు దుప్పట్లను పంపిణీ చేశారు. ఒకసారి 80 వేల మందికిపైగా అన్న పానీయాలు వితరణ చేసేలా టీటీడీ అన్నదాన విభాగం కృషి చేసింది. వీఐపీలు తరలి వచ్చారు. అదనపు ఈవో ధర్మారెడ్డి ఆదేశాలతో భారీగా వచ్చిన దరఖాస్తులను కుదించి 3,500 టికెట్లు జారీ చేశారు. వారికి 1.30 గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పించి ముగించేసి సామాన్య భక్తులకు దర్శనం కల్పించారు.

సప్తగిరీశుడు స్వర్ణ రథంపై ఊరేగింపు
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణకాంతులతో భక్తులకు అభయ ప్రదానం చేశారు. కలియుగంలో రాజాధిరాజులకు కూడా రాజును తానే అంటూ భక్తులకు తెలియచెప్పడానికి స్వర్ణరథంపై అధిరోహించి తిరువీధుల్లో ఊరేగారు. 

ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన మల్లన్న
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైలంలో సోమవారం మల్లికార్జునస్వామి దేవేరి భ్రామరితో కలిసి ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. ప్రాతఃకాల పూజలనంతరం స్వామివార్ల గర్భాలయ ఉత్తరద్వారంలో ఉత్సవమూర్తులను వేంచేయింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. 

మల్లన్న ఆర్జిత కల్యాణాలు రద్దు
కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 12 నుంచి 18 వరకు జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్ల ఆర్జిత, శాశ్వత కల్యాణాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్‌ రామారావు తెలిపారు. 

పోటెత్తిన కదిరి
అనంతపురం జిల్లా కదిరిలో కొలువైన ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సోమవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు తమ ఇలవేల్పు దేవుడు లక్ష్మీ నారసింహుని ఉత్తర గోపురం ద్వారా దర్శించుకున్నారు. 

ఆధ్యాత్మిక సిరి.. రామగిరి
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి ఉత్తర ద్వారదర్శనం, గిరి ప్రదక్షిణలకు ఉత్తరాంధ్ర జిల్లాల భక్తులు పోటెత్తారు.

మంగళగిరిలో పోటెత్తిన భక్తులు
మంగళగిరిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని సోమవారం దాదాపు లక్ష మందికి పైగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామి వారు బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, శివక్షేత్ర శివస్వామి తదితరులు స్వామిని దర్శించుకున్నారు.

సింహగిరిపై ముక్కోటి ఏకాదశి
సింహాచలంలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఘనంగా జరిగింది. సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడై ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠవాసుడిగా శేషతల్పంపై భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4.45 గంటల నుంచి ఉదయం 11.15 గంటల వరకు ఉత్తరద్వారంలో స్వామివారి దర్శనం కల్పించారు. సింహాచలం క్షేత్రం మహా పుణ్యక్షేత్రమని, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఉత్తరద్వారంలో దర్శించుకోవడం ఆనందంగా ఉందని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు.

శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు
 వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే.మహేశ్వరి తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన శ్రీకాళహస్తి చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సీతారామమూర్తి, జస్టిస్‌ దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ శ్యాంప్రసాద్, జస్టిస్‌ ఉమాదేవి, జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్, జస్టిస్‌ వెంకటరమణలు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమర్నాథ్‌గౌడ్, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ టి.వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు.

చెంగాళమ్మ సేవలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ 
సూళ్లూరుపేట: ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి దంపతులు, ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి జీవీ కృష్ణయ్య, హైకోర్టు జాయింట్‌ రిజిస్ట్రార్‌ ఎస్‌వీఎస్‌ఆర్‌ మూర్తి సోమవారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు