అడ్మిషన్‌ తగ్గిందా.. ఉద్యోగం గోవిందా.!

24 Apr, 2019 04:11 IST|Sakshi

ప్రైవేట్‌ టీచర్ల మెడపై వేలాడుతున్న అడ్మిషన్‌ కత్తి

టార్గెట్‌ తగ్గితే ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలో ప్రైవేట్‌ ఉపాధ్యాయులు 

పిల్లలను బడిలో చేర్పిస్తేనే కొలువు ఉంటుందంటూ హెచ్చరికలు 

మండుటెండలో ఇంటింటికీ తిరుగుతూ పాట్లు 

నిబంధనలకు విరుద్ధంగా వచ్చే విద్యాసంవత్సరానికి మొదలైన అడ్మిషన్లు 

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

సాక్షి, అమరావతి బ్యూరో: ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో చిరుద్యోగుల బతుకులు చిత్తవుతున్నాయి. నేటి నుంచి వేసవి సెలవులు. భార్య, పిల్లలతో సరదాగా గడపాల్సిన టీచర్లు అడ్మిషన్ల వేటలో పడ్డారు. జూన్‌లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే విద్యార్థుల కోసం అడ్మిషన్ల వేట మొదలైంది. ప్రైవేట్‌/కార్పొరేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలు పెట్టే నిబంధనలకు ఆ పాఠశాలల్లో పని చేయాలో? లేక బయటకు రావాలో.. తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉద్యోగులు పని చేస్తున్నారు.  

టార్గెట్‌ చేరుకుంటేనే జీతాలు.. 
ప్రైవేట్‌/కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు నెల నుంచే ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గ్రామాలు, పట్టణాల్లోకి పంపిస్తున్నారు. ఓట్ల ప్రచారం, ఇంటింటి సర్వేలు చేసే వారిలా ఉపాధ్యాయులు ప్రతి ఇంటికీ వెళ్లి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా..ఏం చదువుతున్నారని అడిగి వారిని తమ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. ఓసారి మా పాఠశాలలో వసతులు చూడండి..ఫీజులు పరిశీలించండి.. ఫలితాలు చూడండంటూ ఏకరువు పెడుతున్నారు. కొందరు టీచర్లు వారి దగ్గర చదువుకునే పిల్లలను, వారి తల్లిదండ్రులను  కూడా వదలడం లేదు. ఆ వీధిలో ఉండేవారినో, బంధువుల పిల్లలనైనా మా స్కూల్లో, లేదా కళాశాలలో చేర్పించాలంటూ ప్రాధేయపడుతున్నారు. రోజు ఫోన్‌ చేయటం, మెసేజ్‌లు పెట్టి అభ్యర్థిస్తున్నారు. ఒక్కొక్కరు 10–15 మంది పిల్లలను పాఠశాలలో చేర్పించాలి. అలా చేర్పిస్తేనే జీతాలు ఇస్తారు. లేకుంటే జీతం రాదు. ఈ ఏడాది ఇంటర్‌ ఫలితాల్లో సదరు విద్యాసంస్థ నుంచి పరీక్షలకు హాజరైన విద్యార్థులు భారీ ఎత్తున ఫెయిల్‌ కావటంతో తల్లిదండ్రుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నామని లెక్చరర్స్‌ వాపోతున్నారు.  

సమ్మర్‌లో జీతాలు ఇవ్వరు..పని చేయాల్సిందే 
కొన్ని విద్యాసంస్థల్లో ఏడాదికి కేవలం 10 నెలలు మాత్రమే జీతాలు చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. కాదు కూడదంటే ఉద్యోగాలు వదిలేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. 2 నెలలపాటు జీతాలు అందక కుటుంబాలను నడపటానికి ఉపాధ్యాయులు నానాఇబ్బందులు పడుతున్నారు. సెలవుల్లో సైతం కొత్త అడ్మిషన్ల వేటలో పడాల్సిందే. అనుకున్న టార్గెట్‌ సాధించాల్సిందే. కొంతమంది ఉపాధ్యాయులు టార్గెట్‌ నుంచి తప్పించుకోవటానికి తమ  సొంత ఖర్చులతో అడ్మిషన్‌ ఫీజులు చెల్లించి యాజమాన్యాల ఒత్తిడి నుంచి తప్పించుకుంటున్న పరిస్థితి. 

విద్యార్థులకూ తప్పని తిప్పలు.. 
తమ విద్యాసంస్థలో చదివే విద్యార్థులను సైతం ఒక్కో విద్యార్థి ఒక్కొక్కరిని కొత్తగా స్కూల్‌లో జాయిన్‌ చేయాలంటూ టీచర్ల ద్వారా చెప్పించి నైతిక విలువలకు సైతం తిలోదకాలు ఇస్తున్నారు. అడ్మిషన్‌లు చేయించకపోతే స్కూల్‌ యాజమాన్యాల చేతిలో ఉన్న మార్కులు పడవేమోనన్న భయాందోళనలు సృష్టిస్తున్నారు. యాజమాన్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థులను ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకుంటున్న పాపానపోవటం లేదు. ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ పెద్దలకు అందుతున్న ముడుపుల వల్లే చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.

వెంకటేశ్వరరావు (36) (పేరు మార్చబడినది) ఎంఎస్సీ(మాథ్స్‌), ఎంఈడీ చేసి విజయవాడలోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో మ్యాథ్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఆయన స్కూల్‌ ముగిశాక కొన్ని పేపర్లు పట్టుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. ‘‘ సార్‌..మీ అమ్మాయి/ అబ్బాయిని మా స్కూల్‌లో చేర్పించండి. మీ పిల్లలను చేర్పించలేకపోతే మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి సార్‌..ప్లీజ్‌. మాకు టార్గెట్‌ విధించిన అడ్మిషన్స్‌ పూర్తి చేయకపోతే వేసవి సెలవుల్లో జీతాలు రావు. కనీసం ఓ ఐదారు మందిని కొత్తగా చేర్చకపోతే వచ్చే విద్యాసంవత్సరంలో ఉద్యోగమే పోయే ప్రమాదముంది సార్, ’’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద వాపోతున్నాడు. ఇది ఒక్క వెంకటేశ్వరరావు పరిస్థితే కాదు రాష్ట్రంలోని దాదాపు 30వేల ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలల్లో పని చేస్తోన్న 4.5 లక్షల మంది ప్రైవేట్‌ టీచర్లందరిది ఇదే దుస్థితి. యాజమాన్యాలు విధించిన టార్గెట్‌ను పూర్తి చేయకపోతే ఉద్యోగాలు పోయే ప్రమాదముండటంతో దిక్కుతోచని స్థితిలో మండుటెండల్లో ఇంటింటికి తిరుగుతూ పాట్లు పడుతున్నారు. 

యాజమాన్యాల వేధింపులను కట్టడి చేయాలి... 
అడ్మిషన్‌లు చేయించాలంటూ ఉపాధ్యాయులపైన పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. చట్టం ప్రకారం వేసవి సెలవుల్లో తరగతులు, అడ్మిషన్‌ల కోసం ప్రచారం నిర్వహించడం నేరమని ప్రశ్నించిన వారిపై వేధింపులకు దిగుతున్నారు. వేసవి సెలవులు ఇవ్వకపోవటం, జీతాలు కట్‌ చేయటం వంటి వాటిపై ప్రభుత్వం స్పందించి యాజమాన్యాల దాష్టికాలను అరికట్టాలి.  
– డి.అంబేడ్కర్, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రైవేట్‌ టీచర్స్, లెక్చరర్స్‌ యూనియన్‌ 

మరిన్ని వార్తలు