దివి సీమలో వర్ష బీభత్సం

20 Oct, 2019 06:32 IST|Sakshi
అవనిగడ్డలో నీట మునిగిన సబ్‌ట్రెజరీ కార్యాలయం

అవనిగడ్డలో18.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

క్రోసూరులో 12.58 సెంటీమీటర్ల వర్షం 

సాక్షి, అవనిగడ్డ/గుంటూరు: కృష్ణా జిల్లా దివిసీమలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. అవనిగడ్డలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకూ ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. అత్యధికంగా 18.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పట్టణమంతా జల దిగ్బంధంలో చిక్కుకోగా.. జన జీవనం స్తంభించింది. పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్‌ అన్నీ పూర్తిగా నీటమునిగాయి. డ్రెయిన్లు పొంగి పొర్లడంతో రోడ్లు జలమయం అయ్యాయి.

ప్రధాన రహదారిపై మధ్యాహ్నం వరకూ వర్షం నీరు తగ్గకపోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ డిపోలో నాలుగు అడుగుల మేర నీరు చేరింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం వర్షం నీటితో నిండిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన డ్రెయిన్లు పొంగి ప్రవహించాయి. మోపిదేవిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

గుంటూరు జిల్లాలోనూ కుండపోత
గుంటూరు జిల్లా అంతటా కుండపోత వర్షాలు కురిశాయి. జిల్లాలోని క్రోసూరులో అత్యధికంగా 12.58 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు సరాసరి 2.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా క్రోసూరులో చెరువు కట్ట పక్కనున్న చెంచు కాలనీ, బుడగ జంగాల కాలనీ నీటమునిగాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో మిర్చి, పత్తి, పసుపు పంటల్లో భారీగా నీరు చేరింది. గుంటూరు రూరల్‌ మండలం గొర్లవారిపాలెం ప్రధాన రహదారిలో లో–లెవల్‌ చప్టాపై ఉధృతంగా వరద నీరు ప్రవహించింది.

వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. స్వర్ణభారతి నగర్, అడవి తక్కెళ్లపాడు, చౌడవరంలోని చండ్ర రాజేశ్వరరావు నగర్, లింగాయపాలెంలోని అల్లూరి సీతారామరాజు నగర్‌ కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా అంతటా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

మరిన్ని వార్తలు