అంతిమయాత్రలో ఆప్తుడై..

29 Jun, 2020 07:55 IST|Sakshi
జక్కిలేరు మృతదేహానికి పూజలు చేస్తున్న భట్రాజు

అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న భట్రాజు

ఫోన్‌ చేస్తే ఇంటి ముంగిటకే సేవలు 

పెద్దపప్పూరు: అనాథ మృతదేహాలకు అతను ఆప్తుడు. పేగు తెంచుకుని పుట్టకపోయినా.. తోబుట్టువు కాకపోయినా.. ఓ ఆత్మీయుడిలా దగ్గరుండి మరీ అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటాడు. వివవరాల్లోకెళితే పెద్దపప్పూరు మండలం రామకోటికాలనీకి చెందిన భట్రాజు 15 సంవత్సరాలుగా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్నాడు. తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 80 మృత దేహాలను తన సొంత ఆటోలో శ్మశానికి తరలించి, శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్నాడు. కరోనా నేపధ్యంలో ఇటీవల పెద్దపప్పూరు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మరణిస్తే.. గ్రామ పెద్దల అనుమతితో అంత్యక్రియలు నిర్వహించి పలువురి మన్ననలు పొందాడు.

ఒకవైపు అనాథ మృతదేహాకలు అంత్యక్రియలు నిర్వహిస్తూనే.. మరో వైపు ఆధ్యాత్మిక చింతనను ప్రజల్లో పెంపొందించేలా ప్రతి పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో ఆలయాల్లో భజన కీర్తనల పారాయణం చేస్తూ వస్తున్నాడు. తాడిపత్రి నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనైనా.. అనాథ మృతదేహం ఉన్నట్లు తనకు (94900 70655) సమాచారం అందిస్తే.. తన కుమారుడితో కలిసి ఆటో వెళ్లి అంత్యక్రియలు నిర్వహించి వస్తాననే భట్రాజు.. జీవితంలో ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు.. మనకున్నంతలో ఎంత సేవ చేయగలిగామన్నదే ప్రధానమని పేర్కొంటుంటారు.


ఆటోలో మృతదేహాన్ని  శ్మశానవాటికకు తరలిస్తున్న భట్రాజు  

అయినవారు కాదంటే..  
అయినవారందరూ ఉన్న ఓ దివ్యాంగుడు అనారోగ్యంతో మరణిస్తే.. అంతిమయాత్రలో పాల్గొనే వారు కరువయ్యారు. విషయాన్ని ఫోన్‌ద్వారా తెలుసుకున్న భట్రాజు ఆ గ్రామానికి చేరుకుని ఆప్తుడిలా ఆ దివ్యాంగుడికి అంత్యక్రియలు నిర్వహించి వచ్చారు. వివరాల్లోకి వెళితే.. పెద్దపప్పూరు మండలంలోని గార్లదిన్నెకు చెందిన జక్కిలేరు (70) రెండు నెలల క్రితం కాలికి దెబ్బ తగిలి చికిత్సకు నోచుకోలేక అనారోగ్యంతో ఆదివారం మృతిచెందాడు. బంధువులకు సమాచారం అందించినా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అటువైపు ఎవరూ కన్నెత్తి కూడా  చూడలేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భట్రాజుకు ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేశారు. వెంటనే ఆ గ్రామానికి చేరుకున్న భట్రాజు.. జక్కిలేరు మృతదేహానికి స్నానపానాదులు, పూజలు చేసి, తన సొంత ఆటోలో శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆపద సమయంలో ఆప్తుడిలా వచ్చిన భట్రాజును ఈ సందర్భంగా గ్రామస్తులు అభినందించారు.   

మరిన్ని వార్తలు