జన గణ మనకు 'వంద'నం

23 Feb, 2018 11:24 IST|Sakshi
విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్‌

అఖండ భారతావనిని ఒక్కటి చేసిన జనగణమన గీతానికి వందేళ్ల పండుగొచ్చింది. విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్‌  విరచించి  తొలిసారి స్వయంగా ఆలపించి ఈ గీతం ఈ నెల 28 నాటికి వందో ఏట అడుగుపెడుతోంది. ఆ మహనీయుడు ఆలపించింది మరెక్కడో కాదు.. మదనపల్లె బీసెంట్‌ దివ్యజ్ఞాన కళాశాలలో..అందరం ఒక్కటే..మనందరి గీతం ఒక్కటేనంటూ జాతికి అంకితం చేసిన జాతీయగీతానికి బాణి కట్టింది కూడా ఇక్కడే.. వేష, భాషలు వేరైనా, కట్టుబాట్లు, విశ్వాసాలు విభేదించినా, రైతు నుంచి సరిహద్దులో  సైనికుడి వరకు, పలుగు, పార పట్టే శ్రామికుడి నుంచి మరయంత్రాల మధ్య నరయంత్రంలా పని చేసే కార్మికుడి వరకు ఏ గీతం వింటే గుండె నిండా దేశభక్తి అలుముకుంటుందో ఆ జనగణమనకు రేపేశత వసంతాల సంబరం జరుగనుంది. మదనపల్లె సిటీ

 వందేళ్ల ఉత్సవాలకు శ్రీకారం
ఈ నెల 24 నుంచి 28 వరకు భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహణకు కళాశాల యాజమాన్యం కసరత్తులు ప్రారంభించారు. కళాశాల కరస్పాడెంట్‌ విజయభాస్కర్‌చౌదరి, బీజేపీ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి కలిసి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి ఉత్సవాలను ఆహ్వానించారు.  

ఠాగూర్‌ కాటేజీ
రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ బస చేసిన గదిని కాటేజీ ఏర్పాటు చేశారు. అందులో విశ్వకవి చిత్రపటాలను పెట్టారు. కాటేజీ ఎదురుగా రవీంద్రుడి 90 కిలోల పాలరాతి విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఠాగూర్‌ ఆడిటోరియం నిర్మాణం జరుగుతోంది.

లక్ష గళార్చన
విశ్వకవి రవీంద్రుడి 150 జన్మదిన వేడుకలు పురస్కరించుకుని 2012లో బి.టి.కళాశాలలో లక్ష గళార్చన నిర్వహించారు. భారీ ఎత్తున జరిగిన కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  హాజరయ్యారు. 20 వేల విద్యార్థులచే ఐదు సార్లు జాతీయగీతం ఆలపించారు.

దక్షిణ భారతదేశంలో శాంతినికేతన్‌గా పేరుపొందిన బీసెంట్‌ దివ్యజ్ఞాన కళాశాల(బి.టి) జాతీయగీతం వందేళ్ల  పండుగకు ముస్తాబవుతోంది. విశ్వ కవి రవీంద్రనాథ్‌ఠాగూర్‌ జనగణమనను ఆంగ్లంలోకి తర్జుమా చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి చరిత్రలో చెరగని స్థానం దక్కింది. మారుమూల ప్రాంత యువతకు విద్యను అందించాలన్న ధ్యేయంతో 1915లో డాక్టర్‌ అనిబీసెంట్‌  ఏర్పాటు చేసిన బీటీ కళాశాల స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది. ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఎందరెందరో దేశభక్తులను తయారు చేసింది.  

 తొలిసారిగా..
దక్షిణ భారతదేశ పర్యటనను బెంగుళూరుకు వచ్చిన విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్‌ విశ్రాంతికి 1919 ఫిబ్రవరి 25న మదనపల్లెకు విచ్చేశారు. ఇక్కడ వాతావరణానికి ముగ్ధుడైన ఆయన మార్చి 2 వరకు మదనపల్లెలోని బి.టి.కళాశాలలో బస చేశారు. ఈ సమయంలో ఇండోర్‌ గేమ్స్, సంగీత పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీల్లో విద్యార్థుల గళం నుంచి జాలువారిన దేశభక్తి గీతాలకు స్పందించిన ఠాగూర్‌ పోటీల అనంతరం ఆర్ట్స్‌ రూములో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తాను బెంగాల్‌ భాషలో రాసిన జనగణమణ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. అప్పటి బీటీ కళాశాల ప్రిన్సిపాల్‌ జేమ్స్‌ హెచ్‌.కజిన్స్‌ భార్య మార్గరేట్‌ కజిన్స్‌ సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఠాగూర్‌ అనువదించిన జనగణమణ గీతాన్ని మార్గరేట్‌ కజిన్స్‌ బాణి సమకూర్చారు. కళాశాలలో పెద్ద ఎత్తున జరిగిన పోటీల్లో ముగింపు సమావేశంలో ఈ గీతాన్ని తొలిసారిగా తానే స్వయంగా ఆలపించారు. ఠాగూర్‌ అనువదించిన జనగణమణ గీతాన్ని మార్గరేట్‌ కజిన్స్‌ బాణి సమకూర్చి విద్యార్థులతో కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. 1950 జనవరి 24న జనగణమణను భారత ప్రభుత్వం అధికారికంగా జాతీయగీతంగా ప్రకటించింది. 1950 జనవరి గణతంత్ర దినోత్సవాల్లో జాతీయగీతాన్ని అధికారికంగా మెట్టమొదట ఆలపించారు.

మన జాతీయగీతానికిఅర్థం ఇది..
 ‘జనులందరి  మనస్సుకూఅధినేతవు. భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగుగాక. పంజాబు, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ, వంగ దేశాలతోనూ వింధ్య, హిమాలయ పర్వతాలతోనూ, యమునా గంగ ప్రవాహాలతోనూ, ఉవ్వెత్తుగా లేచే సముద్ర తరంగాలతోనూ శోభించే ఓ భారత విధాతా! వాటికి నీ శుభ నామం ఉద్భోద కలిగిస్తుంది. అవి నీ ఆశీస్సులు అర్థిస్తాయి. నీ జయగాథల్ని గానం చేస్తాయి. సమస్త జనులకూ మంగళ ప్రదాతవు. భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగు గాక! జయమగుగాక! జయమగుగాక!’

మరిన్ని వార్తలు