కోటి ఆశలతో...

2 Jun, 2014 02:41 IST|Sakshi

 చీరాల టౌన్, న్యూస్‌లైన్: సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి చెందే  సమయంలో 45 రోజుల పాటు ప్రభుత్వం విధించిన వేట నిషేధం పూర్తయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి మత్స్యకారులు కోటి ఆశలతో సముద్రంలో వేటకు పయనమయ్యారు. గంగమ్మను నమ్ముకొని జీవనం సాగించే మత్స్యకారులు గతేడాది సంభవించిన విపత్తులు మళ్లీ రాకూడదంటూ పూజలు చేసి వేటకు శ్రీకారం చుట్టారు. వేట నిషేధ సమయంలో ఎటువంటి ఉపాధి లేక కుటుంబ పోషణ కోసం మత్స్యకారులు తంటాలు పడ్డారు.

నిషేధం పూర్తికావడంతో ఒక్కో బోటుకు నలుగురు చొప్పున ఆనందోత్సాహాలతో సముద్రంలోకి వేటకు వెళ్లారు. వేటకు కావాల్సిన వలలు, ఆహారం, ఇంజిన్, చేపలు నిల్వ చేసుకునేందుకు ఐస్‌బాక్సులను పడవల్లో పెట్టుకుని బయలుదేరారు. కొందరు మత్స్యకారులు శనివారం రాత్రే గంగమ్మ తల్లికి పూజలు చేసి చేపల వేటకు వెళ్లి ఆదివారం ఉదయానికి తీరానికి చేరుకున్నారు. వలలకు చిక్కిన కూన, రొయ్యలు, పారలను వేలంలో విక్రయించారు. తొలిరోజు వేట ఆశాజనకంగానే ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందజేసే బియ్యాన్ని  ఈ ఏడాదికి ఇస్తారో లేదోనని మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు