కాఫర్‌ డ్యామ్‌పేరుతో కపట నాటకం

13 Feb, 2020 15:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాకాలు ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు గుదిబండలా మారుతున్నాయి. ఒక్కదాని తర్వాత ఒకటిగా వస్తున్న సమస్యలు, న్యాయ వివావాదాలు ఇంజినీర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాలతో వివాదాలను రాష్ట్రస్థాయిలోనే  పరిష్కరించుకునేందుకు గతంలోని చంద్రబాబు సర్కారు ఏ మాత్రం కృషి చేయలేదు. దీంతో ప్రాజెక్టు పనులు నిలిపేయాలని కోరుతూ పొరుగు రాష్ట్రమైన ఒడిశా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

ఆంధ్రప్రదేశ్‌లో  గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కారణంగా తమ రాష్ట్రంలోని సంరక్షిత గిరిజన గ్రామాలు ముంపుకు గురవుతాయని, బచావత్‌ ట్రైబ్యూనల్ ఆదేశాలు ఉల్లంఘిస్తూ నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఒడిశా ఆరోపిస్తోంది. ఒడిశా చేస్తున్న ఆరోపణలన్నీ చంద్రబాబు నిర్వాకాలను తేటతెల్లం చేస్తున్నాయి.  ఇక ఏపీకి మరో వైపు ఉండే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ కూడా పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు గడప తొక్కాయి. రేలా అనే  స్వచ్ఛంద సంస్థ కూడా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. 

నియమావళికి నీళ్లు
భారీ ప్రాజెక్టుల నిర్మించేటప్పుడు రాజకీయాలకు తావులేకుండా ఇంజినీరింగ్ ప్రమాణాలు అనుసరించాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. కాని రాష్ట్ర ప్రయోజనాలకంటే సొంత ప్రయోజనాలకు చంద్రబాబు పెద్ద పీట వేసుకుంటూ సాగించిన వ్యవహారశైలి ఇప్పుడు పోలవరానికి ఇబ్బందికరంగా మారింది.  ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వేను పక్కన పెట్టి కాఫర్ డ్యామ్ నిర్మించడమన్నది చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం. అంతే కాకుండా ప్రచారమే తప్ప ముంపు బాధితుల పునరావాసంపై దృష్టి సారించకపోవడంతో ఇప్పుడది అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్లింది. పోలవరంపై చేసిన ప్రచార ఆర్భాటంలో కనీసం కొంతైనా పునరావాసంపై  దృష్టి సారించి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు పోలవరం పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నాయి. ఆయన సృష్టించిన సమస్యలు, న్యాయపరమైన వివాదాల నుంచి గట్టెక్కేందుకు అధికారులు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు. 

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు 
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒడిశా అభ్యంతరాలపై జవాబు ఇచ్చేందుకు కేంద్రం,  ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నాయి. గత ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం, పునరావాసం, పునర్‌నిర్మాణ పనులను పట్టించుకోకపోవడంతో కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం కనిపిస్తోందని  ఇంజినీరింగ్‌నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ, తూర్పు, పశ్ఛిమ గోదావరి జిల్లాలు,  కృష్ణా జిల్లాల్లో  540 గ్రామాలకు తాగునీరు అందిస్తుంది పోలవరం ప్రాజెక్టు.  దాదాపు 3 లక్షల హెక్టార్లకు సాగు నీరు సమకూర్చడంతో పాటు 960 మెగావాట్ల స్థాపిత సామర్ధ్యంతో విద్యుత్‌ ఉత్పత్తి చేసే జలవిద్యుత్‌కేంద్రం కూడా ఏర్పాటు కానుంది. వీటి ద్వారా ఆంధ్రపదేశ్‌ముఖచిత్రం పూర్తిగా మారిపోవడం తథ్యం.

పచ్చ ప్రచారం
వాస్తవాలు జనాలకు తెలిస్తే ఎక్కడా తమను మరింత ఛీత్కరించుకుంటారనే భయంతో చంద్రబాబు తన అనుకూల మీడియాలో విపరీతంగా దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం పనులు నిలిచిపోయాయంటూ టీడీపీ, దానికి అండగా ఉండే మీడియా గోబెల్స్ తరహాలో ప్రచారం చేస్తోంది.  నిజానికి కోర్టు ఆదేశాల కారణంగా హైడల్‌ పవర్‌స్టేషన్ పనులు నిలిచిపోయినా ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన పనులన్నీ జోరుగా సాగుతున్నాయి. కాని పునరావాసం, పునర్‌నిర్మాణం పనులు నిదానించడం సమస్యగా మారింది. పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.51,424 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో ఆర్‌అండ్ ఆర్, భూ సేకరణకే రూ.32,509 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అంటే నిర్మాణ పనుల కన్నా వీటికే భారీ మొత్తం కేటాయించాల్సి వస్తుంది. 

2013లో తీసుకొచ్చిన పటిష్టమైన భూసేకరణ చట్టం ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా నష్టపోయేవారికి, ముంపు బాధితులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తోంది.  వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి  సంబంధించి 13 అనుమతులకు గాను 11 అనుమతులు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమయంలోనే లభించాయి.  భూసేకరణ, పునరావాసం, పునర్‌నిర్మాణ పనులకు సంబంధించి కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ, ప్రణాళిక సంఘం, కేంద్ర జలసంఘం నుంచి అప్పటి  సీఎం వైఎస్సార్‌ అనుమతులు సాధించారు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్‌కుమార్‌ప్రభుత్వం ప్రాజెక్టు పనులకు టెండర్‌ పిలిచింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగి, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు  అధికారంలోకి వచ్చారు.  కాని ప్రాజెక్టు పనులు చేయలేని స్థితిలో ఉన్న కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించి తమ వారికి సబ్‌కాంట్రాక్టులు దన్నుకున్నారు.

అపార నష్టం
చంద్రబాబు చర్యలతో పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టం మాటల్లో చెప్పలేనిది. ప్రాజెక్టు పనులతో పాటు భూసేకరణ, పునరావాసం, పునర్‌నిర్మాణ పనులు సమాంతరంగా సాగాలి. కాని చంద్రబాబు ఏలుబడిలో నిర్మాణ పనులు ఇంజినీరింగ్ నియమ నిబంధనలకు విరుద్ధంగా సాగాయి. ప్రాజెక్టులో ముందు స్పిల్‌వే పనులు జరగాల్సి ఉండగా దాన్ని పట్టించుకోకుండా కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టారు. ఈ కారణంగా అసలు పనులు నిలిచిపోయాయి. అదే సమయంలో గోదావరికి వచ్చిన వరదలతో స్పిల్‌వే నుంచి నీరు పోవడంతో ముంపు పెరిగింది. గతేడాది గోదావరికి వచ్చిన భారీ వరదతో అప్పుడు పనులు నిలిచిపోవడమే కాదు ఎగువ భాగంలో ముంపు  సమస్య తీవ్రమైంది. ఈ కారణంగా ఈ ఏడాది జనవరి వరకు కూడా పనులు చేపట్టేందుకు స్థలం లేకుండా పోయింది. భారీ వరదల కారణంగా రోడ్లు పూర్తిగా కొట్టుకుపోవడంతో వాటిని మళ్లీ నిర్మించాల్సి వచ్చింది.  అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుతుండటంతో ఇప్పుడిప్పుడే పనుల్లో వేగం పెరిగింది.
 
దిద్దుబాటు చర్యలు
గత ప్రభుత్వ వైఖరి కారణంగా చోటుచేసుకున్న ఇంజినీరింగ్‌లోపాలు సరిదిద్దుతూ, రాజకీయాలు, కాంట్రాక్టర్‌ప్రయోజనాలకు అతీతంగా ఇంజినీరింగ్‌ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పుడు పనులు చేయిస్తోంది.  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమైన పనులన్నీ వచ్చే ఏడాది ఏప్రిల్‌నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్‌నాటికి మొత్తం పనులన్నీ ముగిసేలా సమాయత్తమవుతోంది.
 
కాఫర్‌ డ్యామ్‌పేరుతో కపట నాటకం 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపు తలెత్తి పనులు అధిక కాలం ఆగిపోవడానికి ముఖ్య కారణం కాఫర్‌డ్యామ్. తన హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తికాదని గ్రహించిన చంద్రబాబు అప్పట్లో కాఫర్‌డ్యామ్‌పేరుతో కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. రూ. 50 వేల కోట్లకు పైగా ఖర్చుతో చేపట్టిన ప్రాజెక్టు కోసం రాష్ట్రంలో నిధులు లేకపోవడం, అటు కేంద్రం కూడా రిక్తహస్తం చూపడంతో కాఫర్‌ డ్యామ్‌ కట్టేసి దాన్నే పోలవరం ప్రాజెక్టుగా చూపేందుకు చంద్రబాబు కుటిల పన్నాగాలు పన్నారు. 42.5 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యామ్ నిర్మించాలని బాబు ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదన తీసుకురాగా ఎత్తు తగ్గించాలని సూచిస్తూ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కేంద్రం అనుమతి మంజూరు చేసింది. జలాశయాల నిర్మాణంలో ఎక్కడా, ఎప్పుడూ లేనిరీతిలో కాఫర్‌డ్యామ్ నిర్మించి పోలవరం తొలి దశ పూర్తి చేసినట్టు చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రచారం రూపొందించుకున్నారు.  పోలవరం కాఫర్ డ్యామ్‌పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేశారు. 

అసలు కాఫర్‌ డ్యామ్‌ అంటే ఏంటి?
జలాశయాలు నిర్మించేటప్పుడు ఆ పనులకు నీరు అడ్డు రాకుండా నదీ ప్రవాహం మళ్లించేందుకు నిర్మించే తాత్కాలిక కట్టడం కాఫర్ డ్యామ్.  ప్రధాన పనులు పూర్తైన తర్వాత దీన్ని  తొలగిస్తారు. ఇది ఏ మాత్రం పటిష్టంగా, స్థిరంగా ఉండదు. శాశ్వతంగా అసలు ఉపయోగపడదు. అలాంటి నిర్మాణం పూర్తి చేసి దాంతో పోలవరం మొదటి దశ పూర్తి చేసినట్టు చెప్పుకునేందుకు అప్పట్లో చంద్రబాబు సర్కారు విపరీతంగా ప్రయత్నించింది. దీని వలన ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లగా కాంట్రాక్టరుకు మాత్రం భారీ లబ్ధి చేకూరింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా