ఈతకెళ్లి నవ వరుడు మృతి

4 Jun, 2016 04:34 IST|Sakshi
ఈతకెళ్లి నవ వరుడు మృతి

తల్లడిల్లిన నవ వధువు
►  రెండు కుటుంబాల్లో విషాదం   

 
కాళ్ల పారాణి ఆరనేలేదు. పెళ్లి తోరణాలు తీయనేలేదు. అచ్చటాముచ్చటా తీరనేలేదు. అప్పుడే ఆ యువతిపై విధి చిన్నచూపు చూసింది. ఈతకెళ్లిన భర్తను దూరం చేసి వైధవ్యంపాలు చేసింది. ఈ విషాద సంఘటన బి.కొత్తకోట మండలం బీరంగి గ్రామం కాచిపల్లె శుక్రవారం చోటుచేసుకుంది.  
 
 బి.కొత్తకోట : మండలంలోని కాచిపల్లెలో ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఎన్.రామచంద్ర కుమార్తె శ్వేతకు కర్ణాటక రాష్ట్రం చింతామణి సమీపంలోని కొత్తపల్లె స్టేషన్‌కు చెందిన కే.విజయకుమార్(27)కు ఏప్రిల్ 29న వివాహమైంది. బెంగళూరులో ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న విజయకుమార్ గురువారం భార్య శ్వేతతో కలిసి అత్తారిల్లు కాచిపల్లెకు వ చ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్వేత తమ్ముడు మనోజ్‌కుమార్(15), సంజయ్(13), శివ(7)తో కలిసి ఈతకోసం నాగులచెరువు వద్ద ఉన్న వ్యవసాయబావికి వెళ్లారు. మిగిలిన వారు ఈతకు సిద్ధమవుతుండగానే విజయకుమార్ బావిలోకి దూకేశాడు. నీటిలో మునిగిపోతూ చేతులు పైకి ఎత్తడంతో మిగిలిన ముగ్గురు బాలురు భయంతో కేకలు వేశారు.

దీంతో సమీపంలో గొర్రెలు మేపుకొంటున్న ఓ మహిళ పరుగున వచ్చి చూడగా విజయకుమార్ మునిగిపోతుండడాన్ని గమనించి కాపాడేందుకు ప్రయత్నించేలోగా పూర్తిగా మునిగిపోయాడు. ఈ విషయం తెలుసుకొన్న గ్రామస్తులు బావి వద్దకు చేరుకుని గాలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు గాలించిన విజయకుమార్ ఆచూకీ లభించలేదు. స్థానిక సర్పంచు అమరనాథ్‌రెడ్డి ఇచ్చిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొన్నారు. అగ్నిమాపక అధికారి మాధవరెడ్డి, లీడింగ్ ఫైర్‌మెన్ రాజయ్య, సిబ్బంది 10 నిమిషాల్లో మృత దేహాన్ని వెలికితీశారు. రాజయ్య మాట్లాడుతూ మృతుడు వేసుకొన్న డ్రాయర్ ముళ్లకంపకు చిక్కుకుపోవడంతో మునిగిపోయి, ఊపిరాడక మృతి చెంది ఉంటాడని పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
పెళ్లి పందిరి తీయకముందే..
పెళ్లయిన నెలకే భర్త విజయకుమార్ మరణంతో భార్య శ్వేత బోరున విలపిస్తోంది. జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త మృత్యువాత పడడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. పెళ్లి ఇంట వేసిన పందిరి తీయకుండానే ఘోరం జరగడంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకొంది.

మరిన్ని వార్తలు